3, అక్టోబర్ 2014, శుక్రవారం

కాఫీ రాగం



                                                    


సూర్యోదయానికి భూపాల రాగానికి ఏదో  సంబంధం ఉన్నట్టే కాఫీకి సూర్యోదయానికి కూడా  ఏదో  సంబంధం ఉందనిపిస్తుంది. సూర్యోదయం లేనిదే పగలు ప్రారంభం కానట్టే, కాఫీ లేనిదే దిన చర్య సక్రమంగా  మొదలయినట్టనిపించదు.     ఉదయం దంతధావనం కాగానే, కాఫీ న్యూస్ పేపరు ఒకేసారి చేతిలో పడితే ఆ ఆనందమే వేరు.    కాఫీ తాగుతూ న్యూస్ పేపర్ చదివితే మనసు తటస్థంగా ఒకింత ఉత్సాహంగా ఉండి మంచి చెడు వార్తలు రెండింటినీ నిర్వికార చిత్తులై  చదవగలుగుతాం.

టీ కన్నా కాఫీ ప్రియం. ఖరీదులోనే కాదు.  ఇష్టానికి కూడా. మా అత్తగారు కూడా కాఫీ ప్రియులే.  చిన్నప్పుడు ఉదయాన్నే అమ్మ కాఫీ ఇస్తే ఇప్పుడు అత్తగారు అందిస్తున్నారు.  నా పెళ్ళైన కొత్తలో నాకు తెలిసిన విషయమేంటంటే మా ఇంట్లో అందరూ, మా ఆయన, ఆడపడుచులు, మరిదితో సహా అందరు బూస్టు బేబిలని.  నాకు మాత్రం  కాఫీ అలవాటనీ ఇష్టమనీ తెలిసి మా అత్తగారు సరదా పడ్డారు కాఫీ తాగడానికి తోడు దొరికినందుకు.     కాఫీ కలుపుకుని ఆవిడ టీవీ ఆన్ చేస్తారు. ఉదయాన్నే ప్రసారమయ్యే చాగంటి వారి ప్రవచానాలు కాని లేదంటే గరిమెళ్ళ వారి సూక్తులు కాని వింటూ ఒక పక్క పేపరు చదువుతూ ఉంటే అదొక అలౌకికానందం.  ఆ రోజుకి శుభారంభం.  

కాఫీ అనగానే నాకు బాగా గుర్తుకు వచ్చేది ఆర్. కె. నారాయణ్ గారు.  ఆయన అమెరికా వెళ్లినప్పటి కాఫీ అనుభావాల మీద వ్రాసిన వ్యాసం 'Over a cup of Coffee '  మాకు ఇంటర్మీడియట్లో పాఠ్యాశంగా ఉండేది.  అక్కడ పొద్దున్నే హోటల్ కి వెళ్లి కాఫీ కావాలని అని అడిగితే వాళ్ళు 'నలుపా  తెలుపా' (బ్లాక్ ఆర్ వైట్) అని ప్రశ్నించే సరికి  ఆయనకీ చిర్రెత్తుకొస్తుంది.  కాఫీ కాఫీరంగులోనే ఉంటున్ది.  నలుపు తెలుపుల్లో ఉండదు అని వాళ్ళతో వాదనకు దిగుతారాయన.  అంతే కదండీ. కాఫీ పొడి రంగు చీరా కాఫీ రంగు చీర అని మనం చెప్పుకోమూ.  ఆ రంగుల చీరల్ని మరొక రంగులో చెప్పలేము.  ఆ తరువాత వాళ్ళు ఇచ్చిన ఇన్స్టంట్ కాఫీ ఆయనకి నచ్చక ఇండియాలో వాళ్ళమ్మ కలిపే ఫిల్టర్ కాఫీ గుర్తుకొచ్చి తెగ ఫీలయిపోతాడు.  ఆ ఫిల్టర్ కాఫీకి కూడా డికాక్షన్ తియ్యడానికి నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి ఎన్ని చెంచాల కాఫీ గుండకి ఎన్ని నీళ్ళు పొయ్యాలి లాంటి రూల్సన్నీ చెప్పుకొస్తాడు.  కాఫీ ఇష్టపడేవాళ్ళు దాని నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీ పడరు.  నిజమే కాఫీ బాగుంటేనే తాగగలం.  మా చెల్లి కాఫీ పెట్టిన ప్రతిసారీ ఫ్రెష్ మిల్కే వాడుతుంది.  ఒకసారి మరిగించినపాలు కాఫీకి బాగుండవని.  

కాఫీల్లో ఫిల్టర్ కాఫీ వేరయా.  చాలా పధ్ధతిగా డికాక్షన్  తియ్యాలి. ఒక పెద్ద కప్పు కాఫీకి ఒకటిన్నర స్పూను కాఫీ పొడిబాగుంటుంది.   అలా తీసిన డికాక్షన్తో చేసిన కాఫీ ఫస్ట్ డిగ్రీ కాఫీ.   కొంచెం ఎక్కువ డికాషన్ తీసినప్పుడు పూర్తిగా డికాక్షన్ దిగాలేదేమో అని మరి కొంచెం నీళ్ళు పోసి తీసిన డికాక్షన్తో చేసిన కాఫీ సెకండ్ డిగ్రీ  కాఫీ. ఫరవా లేదు తప్పనిసరి పరిస్థితుల్లో తాగొచ్చు.  కక్కుర్తి పడి మరిన్ని నీళ్ళు పోసి డికాక్షన్ తీసి చేసేది థర్డ్ డిగ్రీ కాఫీ.  తాగాలంటే పనిష్మెంటే.  

                                                  

మీకొక విషయం చెప్తా.   మా ఫ్రెండ్ శారద ఒకసారి వాళ్ళ దొడ్డమ్మ నర్సీపట్నం నుంచి సిటీలో ఉన్న కొడుకు దగ్గరకి వస్తే చూడ్డానికి తను వెళ్తూ నన్ను.  కూడా తీసుకు వెళ్ళింది.  అక్కడ ఆవిడా వాళ్ళ కోడలు వనజ ఉన్నారు.  వాళ్ళబ్బాయి ఇంకా ఇంటికి రాలేదు. తనని చూడడానికి వచ్చిన శారదని భుజం చుట్టూ చెయ్యి వేసి తన గదిలోకి తీసుకు వెళ్ళింది ఆవిడ.  అక్కడ కూర్చుని మేం మాట్లాడుతుంటే వాళ్ళ కోడలు వచ్చి 'కాఫీ తెస్తానత్తయ్యా ' అంది.  ఆఫీసునుండి తిన్నగా ఇక్కడికే వచ్చామేమో తలనొప్పితో ఉన్న నాకు కాఫీ అనగానే ప్రాణం లేచొచ్చింది.  దొడ్డమ్మ గారు మాత్రం 'కాఫీ వద్దులే, నిమ్మకాయ నీళ్ళు కలుపు. లేకపొతే ఫ్రిడ్జ్ లో స్ప్రైట్  ఉందిగా అదివ్వు' అన్నారు.  ఆ అమ్మాయి వెళ్లి రెండు గాజు గ్లాసుల్లో స్ప్రైట్ తీసుకు వచ్చి ఇచ్చి వెళ్ళింది.  అదే తాగుతూ 'ఎంటి దొడ్డమ్మా ఈ టైమ్ లో ఈ డ్రింక్ ఏంటి, వేడిగా కాఫీ ఐతే బాగుండేది కదా, ఏం మీ కోడలు అలిసి పోతుందా ఏంటి, అలిగినట్టుగా అంది శారద.  'నా ముఖం అది అలిసి పోతుందని కాదు.  ఆ కాఫీ మీరు తాగలేరు.   ఉదయాన్నే నా కాఫీ నేను కలుపుకుంటేనే  కాని నాకు నచ్చదు, నీకు తెలుసు కదా. ఈ వనజ ఏం చేస్తోందో తెలుసా శారదా,  ఉదయం చక్కగా డికాక్షన్ తీసి వాళ్ళిద్దరూ కలుపుకుని నేను వచ్చేలోపు ఫిల్టర్ లో మరిన్ని నీళ్ళు పోసేస్తోంది'  'అరె ఎందుకలా' అడిగింది శారద.  'నేను పెద్ద గ్లాసు నిండా కాఫీ తాగుతాను కదా అందుకని'.  ఏడుపు ఒక్కటే తక్కువన్నట్టు ఆవిడ ముఖం చిన్న బుచ్చుకోవడం చూసి శారదకి కోపం వచ్చింది. 'అదేంటి శ్రీనుకి చెప్పు' అంది.  'వద్దులే పితూరీలు చెప్పడానికి వచ్చాననుకుంటారు.  నాలుగు రోజులు ఉండి పోయేదానికి ఎందుకు అనవసరమైన గొడవలు. అక్కడికీ ఒకసారి డికాక్షన్ లో నీళ్ళు ఎక్కువ అయినట్టున్నాయి అన్నా.  బాగానే ఉంది కదమ్మా అన్నాడు వాడు.  ఔను వాడి కాఫీ బాగానే ఉంది కదా.  ఇదేమో మాట్లాడదు' ఆవిడలా అందే కాని మరొక నాలుగు రోజులు ఆ పల్చని  ఎలా తాగాలా అన్న బెంగ ఉన్నట్టుంది  ఆవిడకి. 

మేము బయలుదేరుతుంటే వనజ బొట్టు పెడతానంటూ భరిణ తేవడానికి వంటింట్లోకి వెళ్ళింది.  శారద వెనకాలే వెళ్లి వంటింటిని పరిశీలిస్తున్నట్టు నటిస్తూ గట్టు మీది ఫిల్టర్ ని చూసి 'ఓ మీరు ఫిల్టర్ కాఫీయే తాగుతున్నారా.  మా దొడ్డకి కాఫీ అంటే ప్రాణం.  పొద్దున్నే చిక్కని పాలు మరింత చిక్కని డికాక్షన్ వేసి చేసిన కాఫీ అంటే పడి చచ్చి పోతుంది. గ్లాసు నిండా పోసుకుని తాగుతుంది.  పల్చని కాఫీ అంటే తీసుకెళ్ళి పెంటమీద పోసేస్తుంది'.  కసిగా అంది శారద.  ఎక్కడో తగిలిందేమో ఆ అమ్మాయి ఎటో చుస్తూ నిలుచుంది.  మేం  వచ్చేసాము.  మరునాడు లంచ్ టైమ్ లో శారద చెప్పింది.  ఉదయం ఏడు గంటలకల్లా వాళ్ళ దొడ్డ ఫోన్ చేసిందట.  ఆ రోజు కాఫీ చాలా బాగుందిట.                              

కాఫీ తాగడానికి కుడా ఒక పధ్ధతి పాటించాలి.  పూర్వం స్థోమత ఉన్నవాళ్ళు వెండి గ్లాసులు వాడేవారు.  కాని అవి గ్లాసు వేడెక్కి పోయి కాఫీ వేడి నిలవడం లేదని ఇత్తడి గ్లాసులు వాడడం మొదలు పెట్టారు.  

                


తర్వాత స్టీలు వాడకం పెరిగి శుభ్రం చేసుకోవడం సులువని వాటిని వాడడం మొదలయ్యింది.   కప్పుతో  గ్లాసు తమిళుల పధ్ధతి.  కప్ & and  సాసర్ ఇంగ్లీషు వాళ్ళ పధ్ధతి.    ఇంట్లో సరి అయిన జాగా లేక porcelain wear కొనలెదు.  ఎవరైనా స్నేహితులు వచ్చినప్పుడు వాడడానికి ఒక డజను కప్పులు తప్ప. మా ఇంట్లో ఇప్పటికీ స్టీలు గ్లాసులే.  కానీ, కాఫీకి చిన్న సైజు మగ్గులు కాని లేదా చిన్న మూతి ఉన్న కప్పులు కాని బాగుంటాయి.  కాఫీ వేడిగా ఉండగానే పట్టుకు తాగొచ్చు. పెద్ద మూతి కప్పులో కాఫీ పోస్తే త్వరగా చల్లారి పోతుందని అనుభవంలో తెలిసిన విషయం. పెద్దింట్లోకి మారాక మంచి క్రోకరీ సామాన్లు కొనాలన్నది ఒక కోరిక  
                  


కాఫీ మన దేశంలో శతాబ్దాలకు ముందునుండీ ఉందనుకుంటాను. మహానుభావులు ఎవరు తీసుకొచ్చేరో కాని ధన్యవాదాలు.  పంచదార ఇప్పటి తీరులో లేనప్పుడు కాఫీలో బెల్లం వాడేవారు.  గోదావరి జిల్లాల్లో చాలామంది ఈమధ్యదాకా బెల్లమే  వాడుతున్నారని విన్నట్టు గుర్తు.  ఇంటి ముంది వరండాలో ఉట్టిమీద గోనె పట్టాలో కట్టి బెల్లం దిమ్మ ఉంటుంది.  సాయంకాలం వాళ్ళింటికి వెళ్ళామనుకోండి, ఇంట్లోని ఆడపిల్లలో మగపిల్లలో చిన్న సుత్తి తీసుకొచ్చి బెల్లం దిమ్మలోంచి చిన్న ముక్క కొట్టి పట్టుకెళ్ళారంటె మనకి త్వరలో కాఫీ వస్తుందని అర్ధం.  బహుశా ఇప్పుడు పంచదారే వాదుతున్నారేమో లెండి.

నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తోంది.  ఒక పల్లెటూరిలో బాగా దగ్గరి బంధువుల పెళ్ళికి మగ పెళ్ళివారి తరుఫున  వెళ్ళాము.  అక్కడ బెల్లం కాఫీలు అందించి , బెల్లం బూర్లు వడ్డించారని మగ పెళ్ళివారు ఆడపెళ్ళి వారిమీద మండిపడ్డారు.  పెద్ద గొడవైపోయింది.  నాకు కూడా బెల్లం బూర్లు మహా నచ్చాయి కాని బెల్లం కాఫీ మాత్రం నచ్చలేదు సుమండీ.

ఇక పెళ్ళిళ్ళలో కాఫీల సంగతి చెప్పేదేముంది.  మగ పెళ్ళివారికి మర్యాదలు మొదలయ్యేదే కాఫీలతో.  ఇక అర్ధ రాత్రి లేదా బ్రాహ్మి ముహూర్తమ్ లో లగ్నమైతే ఇంక చెప్పక్కరలేదు.  నిద్ర ముఖాలతో ఎవరిమట్టుకు వాళ్ళు కూర్చుని వేదికపైకి చూసే ఆహూతులకి వేడి వేడిగా కాఫీలు అందిస్తే చాలు  అందరి ముఖాలు వికసించి ఒకొర్నకరు పలకరించుకొని, జోకులు వేసుకొని హుషారొచ్చి పెళ్లి సందడి మొదలవుతుంది.
   

ప్రొద్దున్న ఒకసారి కాఫీ తాగితే రెండోసారి తప్పని సరిగా తాగాలనిపిస్తుంది.  ఆ రెండో కాఫీ ఇడ్లీ ఉప్మా లాంటి టిఫిను తిన్నాకైతే మరీ బాగుంటుందన్నది జగమెరిగిన సత్యం.  ఇంట్లో చాలాకాలం తర్వాత  చుట్టాలు పదిమంది కలిసినప్పుడు భోజనాలు అయ్యాక  హల్లోకి చేరి ఎప్పటెప్పటివో కబుర్లు మొదలు పెడతారు.  అలా గంటా గంటన్నర తర్వాత నోరు మెదడు అలసిపోయి అటు ఇటూ దిక్కులు చూడ్డం  మొదలు పెడతారు.  అలాంటప్పుడు ఎవరైనా ఓ పది కప్పులు కాఫీతో పాటు మంచి బిస్కట్లు కూడా ట్రేలో పట్టుకువస్తే ఆహా అనుకుని అ వేడి వేడి కాఫీ చప్పరిస్తూ రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ కబుర్లలో పడతారు.  కాఫీ మహిమ అలాంటిది మరి.




కాఫీ గురించి మాట్లాడితే మా అమ్మ చేసే కాఫీ గురించి తప్పక చెప్పుకోవలసిందే.  నాణ్యమైన గిరిజన కాఫీ గింజలు కొని ఇంట్లోనే వేయించి మర పట్టించి వాడేది.  అలా వేయించిన రోజు వీధి వీదంతా కమ్మటి కాఫీ వాసనే.  ఇరుగు పొరుగు అందరూ  అడగడమే.  నా చిన్నప్పుడు మా అమ్మ కాఫీ కుంపటి మీద కాచేది.  ముందు నీళ్ళు పెట్టి డికాక్షన్ తీసి పాల గిన్ని పెట్టేది.  ముందుగా అమ్మా నాన్నగారూ రోజూ చెప్పుకునే కబుర్లే మళ్లీ చెప్పుకుని కాఫీలు ముగించాక మమ్మల్ని లేపేది.  మా అందరి కాఫీలూ  అయ్యేసరికి పాలు కూడా  చిక్కటి మీగడ కట్టి చక్కగా మరిగెవి.  అప్పుడు పాలు దించి కుంపట్లో నీళ్ళు జల్లి చల్లార్చి పక్కన పెట్టి స్నానానికి వెళ్ళేది.  ఆ తరువాత మిగిలిన పనులు.  చలికాలంలో అయితే ఆ కుంపటి పక్కనే కూర్చుని ఆ వెచ్చదనం ఆస్వాదిస్తూ కాఫీ ముగించేవాళ్ళం.

                    
     

 ఇలా కాఫీ గింజల గురించి మాట్లాడుతుంటే, మేము చిన్నప్పుడు చూసిన కాఫీ తొటలు గుర్తుకు వస్తున్నాయి.  మా నాన్నగారు చింతపల్లి, పాడేరుల్లో  పనిచేసినప్పుడు ఆ తోటల్ని చూడ్డానికి వెళ్ళడం మహా సరదాగా ఉండేది. కొండ వాలు ప్రాంతంలో ఓక్ చెట్ల నీడలో వేసేవారు వాటిని.  నిరంతరం నీడ, నిలువ ఉండకుండా పారే నీరు ఉండాలి వాటికి.  అంతేకాదు, సంవత్సరం పొడుగునా చాలా తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి వాటికి.  కాఫీ బోర్డు ఆఫీసరుగారు అవన్నీ వివరిస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు కళ్ళముందు కనవడి ఎక్జైటింగా ఉండేది.   ఇదిగో ఇదే కాఫీ తోట.  ఆ తోటల్లోని కాఫీ గింజలు. 
         

   
కాఫీ టైంకి నోట్లో పడకపోతే తలనొప్పితో చచ్చిపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. ఉదయాన్నే కప్పు కాఫీ పడకపోతే కడుపు కదలని వాళ్ళు కూడా ఉంటారు.  మంచి కాఫీ మంచి ఆలోచనకి దారి తీస్తుంది.  కాఫీలో cafaine అనే విషపదార్ధం ఉందంటారు కానీ, రోజుకి రెండు మూడు కప్పులు తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని కాఫీ ప్రియుల తరుఫున మాట్లాడే శాస్త్రవేత్తలు కూడా ఉన్నారండోయ్.  అతి సర్వత్ర వర్జయేత్ అన్న మాట కూడా మనం మరచిపో  కూడదుకదా. 
                                                

27, మే 2011, శుక్రవారం

అమ్మ - నాన్నగారు

అమ్మ పోయిన ఏడాది లోపే, అమ్మ ఇచ్చే కాఫీ కోసమో లేక ఆమె చెప్పే కబుర్ల కోసమో మరి, నాన్నగారు ఆమెని వెతుక్కుంటూ వెళ్ళి పోయారు.  అమ్మ గురించి చెప్తే అది ఒక అందమైన కధ అవుతుంది, కానీ నాన్నగారి గురించి చెప్పడం మొదలుపెడితే అది ఒక పాఠ్య పుస్తకమౌతుంది.  అందులో హిస్టరీ, ఎకనమిక్స్, సైన్స్, లాంగ్వేజెస్ అన్నీ ఉంటాయి. అమ్మ ద్వారా మేము జీవిత సత్యాలు నేర్చుకుంటే నాన్నగారి దగ్గర జీవితపు విలువల్ని తెలుసుకున్నాము. వెరసి ఎలా జీవించాలో నేర్చుకున్నామనే అనుకుంటున్నాను.  నిర్జీవంగా ఉన్న నాన్నగారిని చూసి దుఃఖం ఆపుకొలేకపొతున్న మా చెల్లి స్వాతిని చుస్తే తన మనసులో ఏ ఏ జ్ఞాపకాలు మెదిలేయో   నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి.  చిన్నప్పుడు డాబాలమీద నాన్నగారికి చెరొకవేపు పడుక్కొని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తూ ఆయన చెప్పిన విశేషమైన కబుర్లు గుర్తొచ్చి ఉంటాయి. వర్డ్స్ వర్త్, కీట్స్, షెల్లీల పొయెట్రీకి ఆయన ఇచ్చిన అందమైన వివరణలూ, పదో తరగతిలో, నూటికి నూరూ తెచ్చుకోగలిగేలా ఆయన చెప్పిన లెక్కలూ గుర్తొచ్చి ఉంటాయి.  తను ఉద్యోగం చేసేటప్పుడు, సాయంకాలం ఏ మాత్రం లేటైనా ఆదుర్దాగా, ఆఫీసుకే వచ్చేసిన నాన్నగారు గుర్తొచ్చి ఉంటారు. ఆలోచనల్లోనూ, జీవన విధానం లోను  నిత్య చైతన్యమూర్తి, మా జీవితాలకి చైతన్య స్ఫూర్తి అయిన నాన్నగారిని చైతన్య రహితంగా చూడలేక వచ్చిన దుఃఖమది.  రుద్రభూమిలో సున్నితమైన నాన్నగారి  దేహానికి నిర్దయగా అగ్ని సంస్కారం చేసి పంపించి, విశాఖపట్నం ఇంటికి వచ్చ్చాక మా అమ్మాయి కీర్తి నాకు కండొలెన్సె చెప్తున్నట్టు ఇలా అంది. ' అమ్మ డోంట్ బి సాడ్ దట్ ఎ లైఫ్ హాస్ ఎండెడ్, బట్ బి గ్లాడ్ థట్ అ ఫుల్ల్ లైఫ్ హాస్ బీన్ లివ్డ్.'  ఎక్కడిదో ఈ కొటేషన్.  సరిగ్గా చిన్నాన్నగారు కూడా ఇదే మాట అన్నారు, 'విచారించొద్దు ఆయనది పూర్ణ జీవితం' అని.  అంటే ఆయనగురించి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఒక్కలా అనిపించిందన్నమాట. ఆయన తన పిల్లలందర్నీ ఎంతగానో ప్రేమించారు.  మనమల్ని ఇంకెంతగానో ప్రేమించారు.  ఆయన దేహం సున్నితం.  ఆహారపు అలవాట్లు సున్నితం.  మాట సున్నితం, మనసు సున్నితం.  అలాగే అందరితోనూ సున్నితంగా వ్యవహరించేవారు. కానీ ఎంత కష్టాల్లో ఉన్నా భవిష్యత్తు గురించి భయపడని ధీరత్వం, కష్టాన్ని ఎదుర్కోగల ధృఢత్వం ఉండేవి ఆయనలో.
ఎనభై ఐదేళ్ళ వయసులో 'అవసరమేమో అనుకొని ' చేతి కర్ర కొనిస్తే ' అది ముసలివాళ్ళకి నాకు కాదు ' అనగల 'ఆత్మ విశ్వాసం' 'సెన్స్ ఆఫ్ హ్యూమర్ ' ఉండేవి ఆయనలో.  మా కీర్తిని తాత గారి గురించి చెప్పమంటే ఇలా అంటుంది.  'మన తాత గారు ఫెయిరీ టేల్ తాత గారు ' అంది.  'అంటే' అని అడిగితే, దాని దగ్గర రెండు వివరణలు ఉన్నాయి.  ఒకటేంటంటే,  'మా అందరికీ తాతగారు మేము చదవడానికి ముందే ఫెయిరీ టేల్స్ అన్ని చెప్పేవారు.       
    సిండరెల్లా, స్నోవైట్, స్లీపింగ్ బ్యూటీ, యాజ్ యు లైక్ ఇట్, మర్చెంట్ ఆఫ్ వెనిస్, అరేబియన్ నైట్స్, గల్లివెర్ ట్రావెల్స్ ఇవన్నీ మాకు తాతగారు చెప్పినవే. అందుకని తాతగారు ఫెయిరీ టేల్ తాతగారు.  మరొక వివరణ ఏంటంటే, తాతగారు ' వెయిరీ టేల్స్ లోని తాతగర్ల లాగా ఉంటారు.  'అంటే?.  అంటే, ఫెయిరీ టేల్స్ లో తాతగార్లు చిన్న పిల్లలతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు.  వాళ్ళు చెప్పేవి చాలా పేషంట్ గా వింటారు.  మమ్మల్ని చాలా ఈక్వల్ గా ట్రీట్ చేసేవారు.  ఫెయిరీ టేల్ తాతగార్లు చాలా మిస్టిగ్గా ఉంటారు, మన తాతా గారు కూడా అలాగే అనిపించేవారు.
నేను విజయవాడలో ఉండగా నాన్నగారు ఒక సారి ఆ ఊరు వచ్చారు. ఆయన్ని నేను పనిచేసే వ్యాగన్ వర్క్ షాపు ఆఫీసుకి తీసుకువెళ్ళా.  అక్కడ మా ఇంచార్జి నాన్నగారికి షాపు చూపిస్తానని తీసుకువెళ్ళాడు.  అలా వెళ్ళినవాళ్ళు రెండు గంటల తర్వాత తిరిగి వచ్చారు.  మా ఇంచార్జి వగరుస్తూ ' అబ్బ, మీ నాన్నగారికి ఏం ఓపిక.  ఆ సెక్షన్ చూపించు ఈ సెక్షన్ చూపించు అంటూ నన్ను తెగ తిప్పేసారు.  రోజూ తిరిగే నాకు ఆయాసం వచ్చింది కాని, ఆయన మాత్రం ఇంకా తిరుగుదాం అన్నట్టు ఎలా ఉన్నారో చూడూ ' నిజం, మీ నాన్నగారు ఆయుష్షు తొంభై  పైనే' అంటూ నవ్వాడు.  అప్పటికే నాన్నగారి వయసు అరవై దాటిందంతే.  ఆయినా, ఆయన ఆరోగ్యం లో చిన్న చిన్న తెడాలు రావడంతో, మా ఇంచార్జి మాటకి చాలా సంతోష పడ్డాను.  కానీ,   అప్పుడాయన 'వంద ' అని ఎందుకనలేదా అని ఇప్పుడనుకుంటున్నాను.  ఆయన అమ్మని పిలిచే తీరు భలేగా ఉండేది.  భార్యని పేరు పెట్టి పిలవకుండా 'ఏమేవ్' అనో 'ఒసేవ్' అనో పిలిచే రోజులవి.  కాని నాన్నగారు మాత్రం 'ఏమీ' 'ఒకసారి ఇలా వస్తావా అనేవారు.  కానీ ఎక్కువగా మాలో ఒకర్ని పిలిచి 'అమ్మని పిలు ' అనడానికే ఇష్టపడేవారు.  ఆడ పిల్లల్ని 'ఏమిటే' అనీ 'అదీ 'ఇదీ అని పిలవడానికి ఇష్టపడని నాన్నగారు మనసులో ఎక్కడో అమ్మని 'సీతా' అనో 'లక్ష్మీ' అనో పిలవాలనుకునే వారేమో అనిపిస్తుంటుంది నాకు. He was quite romantic at heart.

అభిజ్ఞాన శాకుంతలం లో శకుంతల ముఖాన్ని పుష్పంగా భ్రమించి ఒక భ్రమరం ఆ ముఖారవిందం చుట్టూ  పరిభ్రమించిందని, కాళిదాసు ఎంత గొప్పగా వర్ణించేడో నాకు తెలీదుగానీ, నాన్నగారు మాత్రం చాలా అందంగా వర్ణించి వివరించి చెప్పేవారు. కే ఎల్ సైగల్ పాటలంటే ప్రాణం ఇచ్చేవారు.  నా చిన్నతనంలో ప్రతీ ఉదయం ఏడు గంటలనుండి ఏడున్నర వరకు వచ్చే 'పురానీ గీత్ మాలా ఖచ్చితంగా వినాల్సిందే.  సైగల్, షమ్షాద్ బేగం, సురయా, నూర్జహాన్, గీతా దత్ ల పాటలు వింటూ వాళ్ళతో తను కూడా గొంతు కలిపేవారు. "'అసలు పాట విననివ్వరు ' అనేవారు, అమ్మా హైమా.  హైమకి హింది పాటలంటే మహా పిచ్చి.  పురానీ గీత్ మాలా తర్వాత వచ్చే బినకా గీత్ మాలా సమయానికి రేడియొ పెద్దగా మోగి పోయేది.    ఆ పాటలు వినీ, వినీ మాక్కూడా అప్పట్లో వచ్చే తెలుగు పాటలు నచ్చేవి కావు
ఇక పురానీ గీత్ మాలా లో ఆఖరుగా వచ్చే సైగల్ పాట కోసం నాన్నగారు కాచుక్కురుచునేవారు.   'సోజా రాజకుమారీ, సోజా'  పాట విని నేను అమ్మాయికి జోల పాడుతున్నాడేమొ అనుకున్నా.  కాని రాకుమారి సమాధి దగ్గర, ఆ అమ్మాయిని ఎంతో ఇష్ట పడ్డ అబ్బాయి పాడిన పాట అది అని ఎంతో హృద్యంగా వివరించి చెప్పేవారు.

ఆయన మా అందరికీ అన్ని విధాలుగా ఎంతో అండగా నిలిచేవారు.  నేను చోడవరంలో డిగ్రీ ప్రైవేటుగా చదువుతున్నప్పుడు, నాకు బాగా తెలిసిన ఒకమ్మాయి తను ఇష్టపడ్డ అబ్బాయితో హఠాత్తుగా జంప్.  నేను ఆశ్చర్యంలోంచి తేరుకోక మునుపే నాకోసం మా ఇంటికి  నాలుగిళ్ళవతల చిన్న క్లినిక్ నడుపుతున్న ఒక డాక్టరుగారు వాళ్ళ ఆయాతో కబురు.  'ఆ అబ్బాయి వాళ్ళు ఈ డాక్టరుగారి తెలుసుట, నా దగ్గర వివరమేమైన  తెలుస్తుందని '.  అప్పటికి హలా చిన్నదాన్నవడం, ఇలాంటి వ్యవహారాలు కొత్త అవడం చేతా , 'ఈ గొడవేంట్రా బాబూ' అని నేను చాలా భయపడ్డాను.  తరవాత వస్తానని చెప్పి ఆ ఆయాని పంపించేసాను.  నాన్నగారు ఇంటికి రాగానే విషయమంతా చెప్పేను.  పద, అంటూ నాన్నగారు నాతో వచ్చారు.  ఆయన్ని చూసి దాక్టరుగారు అవాక్కయ్యారు.  అప్పటికే, 'రిటైర్డ్ బీడీవో గారని, లెక్ఖలూ, పాఠాలూ బాగ చెప్తారని, తనూ, తన కుటుంబం తప్ప వేరే ఏ విషయమూ పెద్దగా పట్టించుకోరనీనాన్నాగారికి ఆ కొలనీలో మంచి పేరు.   ఆయన్ని చూసేక ఆ డాక్టరు గారికి ఏం అడగాలో మట్లాడాలో తోచలేదు.  నాన్నగారే చెప్పేశారు.  ' మా అమ్మాయి చిన్న పిల్లండీ,  బాగా చదువుకొని ఉద్యోగం చెయ్యాలనుకుంటోంది. దాన్ని ఇలాంటి వ్యవహారాల్లోకి లాక్కండి,  పరీక్షలు దగ్గర పడుతున్నయీ అని.  'అబ్బే అలాంటిదేమీ లేదండీ స్నేహితులు కదా విషయమేమైనా తెలుసేమో అనీ అంటూ నీళ్ళు నమిలేడు ఆ డాక్టరుగారు.  'సారీ, మా అమ్మాయికేమీ తెలీదు ' అంటూ నన్ను తీసుకుని వచ్చేసారు.  ఆయనిచ్చిన నైతిక స్థ్యైర్యం నన్ను గాల్లో తేలేలా చెసింది.  నాకే కాదు ఇంట్లో అందరికీ అన్ని అవసరాల్లోనూ తోడుగా నిలిచారు.  ఆర్ధిక అవసరాల దృష్ట్యా, నాకు ఉద్యోగం ఎంతో అవసరమై ఉండి కూడా, నేను విజయవాడలో ఉద్యోగం చేరిన కొత్తలో బెంగెట్టుకుని ఏడిస్తే 'ఉద్యోగం వదిలేసి  వచ్చెయ్యమని ' చెప్పగల మానవత్వం ఉందాయనలో.   
ఆయన జీవితాన్ని యధాతధంగా ఎంత హుందాగా స్వీకరించేరో మరణాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించేరు.  ఎంత వయసు మీద పడుతున్నా, ఆఖరికి అమ్మ పోయాక కూడా 'ఏముందింక ' 'ఆ దేముడింక ఎప్పుడు తీసుకు వెళ్తాడో నన్ను '  'ఇంకా ఈ భూమ్మీద  ఉండి చేసేదేముంది ' లాంటి వ్యర్ధపు నిట్టూర్పు మాటలు ఆయన నోటంట వినలేదు.   ఆఖరి రెండు వారాల్లో మాత్రం తన వైటల్ ఆర్గాన్స్ పనిచెయ్యడం లేదని గ్రహించారు.  అప్పుడుకూడా ఆయన గొంతులో నిరాశ ధ్వనించలేదు.  చూడ్డానికి వెళ్ళిన నన్నూ, నా అక్కయ్యలు విజయ, హైమలని పిలిచి షెల్ఫ్ లోంచి 'వేర్ దేర్ ఈజ్ నో డాక్టర్ ' బుక్ తీయించి తను చెప్పిన పేజీలు ఓపెన్ చేయించి తన ఫిజికల్ పొజిషన్ వివరించారు.     

  ముఖంలో ఎలాంటి భావం లేకుండా అలా వివరిస్తుంటే చాలా బాధనిపించింది.  ఆయన ముఖంలోకి చూస్తే చాలా మామూలుగా చెప్పేస్తున్నారు.  నేను, అక్కయ్యలు హైమ, విజయ పైకి మాములుగా మాట్లాడుతున్నా, బైటికి రాని బాధ ఎదో మా లోలోపల దొలిచేస్తొంది.  నాన్నగారికి ఏదో సేవ చెయ్యాలి.  జ్యూస్ చేసి ఇద్దామా,  పాలు కొంచెం తాగుతారేమో.  ఏదో ఒకటి.  ఏం చేసినా మరి కొద్ది రోజులు,  లేదా నెలలు అని మాకు అర్ధం అవుతున్నా పైకి ఒప్పుకోవడానికి ఇష్ట పడటం లేదు. హైమ తెచ్చిన మెత్తటి సోంపాపిడి తిన్నారు.  విజయ చేసిచ్చిన జ్యుస్ తాగారు.  మేము మాట్లాడుతుండగానే నాన్నగారికి చిన్నగా కునుకు పట్టింది.   మేము ముగ్గురం పక్క గదిలోకి వెళ్ళిపోయేము.  పది నిముషాలకే మళ్ళీ నాన్నగారి పిలుపు, 'ఇక్కడికొచ్చి మాట్లాడుకోండమ్మా' అని. ఇంథకు ముందు అలా ఎప్పుడూ అనగా వినలేదు.  సరే అనుకుని  ఆయన దగ్గరికే వెళ్ళి కూర్చున్నాము.  మేము మాట్లాడుకుంటూ ఉండగానే మళ్ళీ మగతలోకి జారుకున్నారు.  ఆయన మా సాన్నిహిత్యాన్ని ఎంతగా కోరుకుంటన్నారో అర్ధమయ్యింది.  ఆ రోజు సాయంకాలం,  నేను హైమా  మర్నాడు ఉదయం విజయా, అన్నయ్యా వాళ్ళింటినుండి  మనసులో ఎదో వెలితితోనే బయలుదెరి వెళ్ళాము.  తరువాత నాన్నగారి మరణ వార్త తెలిసే వరకూ విలువైనదేదో చెయ్యి జారిపోతున్న ఫీలింగ్.      
ఆఖరి రోజుల్లో కొడుకు చేతి సేవలు అందుకుంటూ, ముందు రోజు 'ఇక పై నన్ను చూసుకోగలవా' అని ఆడిగి, ఆ మర్నాడే, నిద్రలోనే ప్రశాంతంగా కళ్ళు మూసారు.  జీవితాన్ని ఎంతో పాజిటివ్ తీసుకొగలిగిన వాళ్ళకే అంత స్వచ్చంద మరణం సాధ్యం.
మా నాన్నగారు 1920, జూన్ 4వ తేదీన పుట్టారు.  ఆయన మరణించింది 1911, మార్చ్ మూడవ తేదీన.

1, జనవరి 2011, శనివారం

అమ్మ బాల్యం - అమ్మతో మా బాల్యం

మా అమ్మది అందమైన అరుదైన గ్రామీణ బాల్యం.  మా అమ్మ ఎక్కువగా బొబ్బిలిలోనూ వాళ్ళమ్మమ్మగారి  ఊరు బొబ్బిలి దగ్గరి పల్లెటూరు భీమవరంలోనూ ఎక్కువగా గడిచింది.  మా అమ్మమ్మ వేదులవారి పిల్ల.  వాళ్ళకి ఆ ఊర్లో పొలాలు, ఇళ్ళు ఉండేవి.  అందువల్ల మా అమ్మకి పొలాలన్నా, తోటలన్న, కళ్ళాలన్నా,  చెరుకు పెనాలన్న ఎంతిష్టమో ఆవిడ తన చిన్నప్పటి సంగతులు చెప్తుంటే అర్ధమౌతుండేది.  ఈ చిన్న విషయం చాలు మా అమ్మ బాల్య ఎంత తియ్యగా గడిచేదొ తెలియడానికి.  మా అమ్మా మిగతా పిల్లలూ కలిసి చిలగద దుంపలు, కొబ్బరి ముక్కలు నులకతాడుకి దండ గుచ్చి ఆ దండని ఆ పళంగా చెత్తో పట్టుకుని బెల్లం పాకం మరుగుతున్న చెరుకు పెనంలో ముంచి పట్టుకునేవారుట.  కాస్సేపటికి అవి ఉడికాయనగానే బయటికి తీసి, చల్లారాక ఎంచక్క తినేవారట. మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్.  నాకైతే మా అమ్మ ఎప్పుడు ఈ విషయం చెప్పినా నోరూరిపొయెది.

ఘజల్ శ్రీనివాస్ 'నా బాల్యం నాకిచ్చెయ్యి ' అని దేవుడిని అడిగినట్టు  అమ్మకి తన బాల్యమన్నా చిన్నప్పటి ఆటలన్నా చాలా ఇష్టం.  తన చిన్ననాటి స్నేహితులు ఎవరితో మట్లాడినా, మేము చిన్నప్పుడు ఆడుకొనేవాళ్ళం అని మొదటగా చెప్తుండేది.  అమ్మ చిన్నప్పుడు చిన్న చిన్న సాహసాలు కూడా చేసేది.  మా చిన్నమ్మాయి కీర్తి చెప్పగా ఈ విషయం తెలిసింది.

'అమ్మమ్మ ఒకసారి తన ఫ్రెండ్స్ తో వాళ్ళ ఊరి దగ్గరున్న నదిని దాటుతోంది.  అమ్మమ్మేమో తన ఫ్రెండ్స్ తో 'చూడండి, నేను వెనక్కు నడుస్తా అంటూ ఎదురుగ్గా ఫ్రెండ్స్ ని చూస్తూ వెనక్కి నడవటం మొదలు పెట్టింది.  కాస్సేపటికి నవ్వుతున్న స్నేహితులు కాస్తా చేతులు పైకెత్తి అరవడం మొదలు పెట్టేరు. నీటి శబ్దంలో వాళ్ళేమంటున్నరో వినిపించలేదు. వాళ్ళు ఎంకరేజె చేస్తున్నారనుకుని అమ్మమ్మ ఇంకా స్పీడ్ గా నడిచింది.  ఇంతలో వెనకనుండి అడ్డం లెమ్మని ఎడ్ల బండతని అరుపులు వినిపించాయి. బండి చాలా దగ్గరగా వచ్చేసింది.  ammamma immediately ducked .   బండి పైనించి వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చింది. ;

ఇక బొబ్బిలి సంగతి సరే సరి.  బొబ్బిలి పేరెత్తితే అమ్మ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది.  అమ్మకి తన బాల్యమంటే చాలా ఇష్టం.  బొబ్బిలిలో తను పెరిగిన ఇళ్ళూ, తిరిగిన వీధులూ, ఆడుకున్న అరుగులూ ఎవరికైనా చూపించాలంటే ఎంత సరదానో.  

అమ్మకి బాల్యం విలువ బాగా తెలుసు. అందుకనే మాక్కూడా  చీకూ చింతా లేని బాల్యం అందించింది.  అందరి ఇళ్ళళ్ళోనూ ఉండే చిన్న, చిన్న మాట పట్టింపులే కానీ, అమ్మ నాన్నగారూ పెద్దగా గొడవపడినట్టెప్పుడూ నాకు గుర్తు లేదు.  మా ఇంట్లోని వాతావరణం వల్ల  మాకు దేనికీ బెంగకానీ ఏం లేకపోయినా మాకు లోటు కానీ అనిపించేదికాదు.

నేనూ మాచెల్లి ఆడుకుంటుంటే మాతో కలిసిపోయెది.  మేము పెళ్ళి పందిరి వెయ్యాలని ప్రయత్నిస్తే , పంగల కర్రలతో పందిరి ఎలా వెయ్యాలో నేర్పించేది.  మాకు కొబ్బరాకులతో బూరలు, పెళ్ళికొడుకు, ఫెళ్ళికూతురు బొమ్మలు చేసిచ్చేది. నేనూ, మా చెల్లి వాటికి బట్టలు కట్టేవాళ్ళం.  ఆ బట్టలకోసం టైలర్ షాపుల చుట్టు కట్ చేసి పారేసిన గుడ్డల కోసం తిరిగేవాళ్ళం.

షి ఈజ్ ఎ చైల్డ్ ఎట్ హార్ట్.  మా అమ్మకి బొమ్మల కొలువులంటే ఎంతిష్టమో. మార్గశిరమాసంలో, విశాఖపట్నం కనకమహాలక్ష్మి కోవెల దగ్గర కొన్న మట్టి బొమ్మలు , ఇంకా నక్కపల్లి చెక్క బొమ్మలూ మా ఇంట్లో ఉండేవి.  వాటికి గుడ్డలు చుట్టి రేకు పెట్టెల్లో దాచేది.  బొమ్మల కొలువు పెట్టినప్పుడు మాకు ఏం చెయ్యాలో  మాతో కలిసిపోయి చేసెది. కొలువులో కొలను, గుడి, మెంతి గింజలతో రెండు రోజుల ముందు చేసిన నారుమడి అన్నిటితో చాలా సహజంగా తయారు చేసేది.  మా అమ్మలో  అప్పుడు ఆమె బాల్యం తాలూకు జ్ఞాపకాలు కొట్టొచ్చినట్టు కనపడేవి.


ఇక అమ్మకి దీపావళి బాణా సంచా అంటే ఎంతిష్టమో.  మతాబులు చిచ్చు బుడ్లు చెయ్యడంలో తన నైపుణ్యమంతా జోడించి చేసేది.  మేము చేస్తున్నట్టు కనపడ్డా ఎనభై శాతం అమ్మే పూర్తి చేసేది.  గంధకం, సురేకారం, ఇనుప రజను, ఆముదం ఏది ఎంత పాళ్ళు కలపాలో అమ్మకి కొట్టిన పిండి.  మతాబు గొట్టాలు చేయడం, కూరడం మాకు దగ్గరుండి నేరిపించేది.  ఇక అన్నయ్య సిసింద్రీలు చేస్తుంటే చాలా సాయం చేసేది.  ప్యాకేజీ కర్రని సంపాదించి కాల్చి బొగ్గుని పొడి చేసి వస్త్ర కాడనం చేసి అన్నయ్యకి ఇచ్చేది.  మా అమ్మకి తాట్రేకు టపాకాయలంటే మహా ఇష్టం. తను కాలుస్తూ నాక్కూడా నేర్పించింది.  దీపావళికి ఖర్చని అనుకోకుండా చాలా ఎక్కువగా దీపాలు పెట్టేది.      
పిల్లలు బాణా సంచా కాలుస్తుంటే తను కూడా చిన్న పిల్లలా తెగ సరదా పడేది.  ఇక దీపావళి తరువాత వచ్చే కార్తీక మాసమంటే అమ్మకి చాలా ఇష్టం.  ఆ నెలంతా దీపాల పండగలే కదా, అందుకనేమో.  క్షీరాబ్ది ద్వాదసి చాలా చక్కగా చేసేది.  అరతి డొప్పల్లోనూ కొబ్బరి చిప్పల్లోనూ తులసమ్మ చుట్టూ దీపాలతో నింపేసేది.  ఇక పోలి స్వర్గానికి వెళ్ళే రోజు పొద్దున్నే లేచి దీపాలు నీళ్ళల్లో వదిలేది.   మేము కొట ఉరట్లలో ఉండేటప్పుడు   అక్కడి నదిలోనూ, కశింకొటలో ఉండేటప్పుడు అక్కడి చెరువులోనూ ఆ దీపాల్ని వదిలేది.  మిగిలిన ఊళ్ళల్లో అలాంటి సదుపాయం లేక బకెట్ లో దీపాలు పెట్టి నూతిలో వదిలేది.  అమ్మతో పాటు పొద్దున్నే లేచి అమ్మ వదిలిన దీపాలు ముందుకు వెళుతుంటే చూడడం మాకు చాలా అనందంగా ఉండేది.  కార్తీక మాసం వచ్చినప్పుడల్లా అమ్మ వదిలిన దీపాలు గుర్తుకొచ్చి నేనూ మాచెల్లి మనం కూడా అలా దీపాలు వదిలి పెడదాం అనుకుంటాము.  కానీ వీలుకాదో లేక మరి బధ్ధకమో అలా దీపాలు వదలడమే అవడం లేదు మాకు.  మా అమ్మ పండుగలు మతపరమైన నమ్మకాలతో కాకుండా, సాంప్రదాయ వారసత్వం, అందం, ఆనందం ప్రాతిపదికగా ఉండేవి. పండుగలప్పుడు అయిదింటికే పిల్లలందర్నీ లేపేసి హడావుడి  చేసేది.   ఇక వినాయక చవితి వచ్చిందంటే అటకమీంచి వెదురుతో చేసిన పాలవెల్లిని తీయించేది.  ఆ పాలవెల్లిని దేవుడి దగ్గర కట్టి అలంకరించమని వెంటపడేది.  అమ్మ ప్రోత్సాహంతో మాలో ఉత్సాహం వచ్చేది.  అమ్మ వంట చేస్తుంటే మేము వినాయకుణ్ణీ, పాలవెల్లినీ అలంకరించేవాళ్ళం. పూజకి కావలసిన వస్త్ర్రాలు, యజ్ఞోపవీతాలు, అక్షింతలూ, పంచామృతాలు అన్నీ మా చేతనే చేయించేది. పూజలు పెద్దగా చేయని నాన్నగారు వినాయక చవితి, విజయదశమి రోజులనాడు మాత్రం ఆయనే స్వయంగా మా అందర్నీ కూర్చో పెట్టి పూజ చేయించేవారు. పూజ పూర్తవుతూనే చెంచాతో పంచమృతాలు (ఇష్టమని చాలా పెద్ద గిన్నితో చేసే వాళ్ళం) తీసుకుని నైవేద్యంగా పెట్టిన ఉండ్రాళ్ళు, బుట్టలు, జిల్లుడుగాయలు వెంట పడేవాళ్ళం. అవి అధ్భుతమైన రుచితో ఉండేవి. మన భారతీయ కుటుంబాల్లో ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలే వ్యక్తుల్ని కట్టి పడేస్తాయనుకుంటాను. లేకపోతె ఇన్ని సంవత్సరాల తరువాత కూడా ఈ జ్ఞాపకాలు ఇంత తాజాగా నా మెదడులో భద్రంగా ఉన్నాయంటే అవి ఎంత చిన్నవైనా ఎంత బలీయమైనవో.

మాకు మళ్ళూ మన్యాలూ, పొలాలూ, పంటలూ లేకున్నా, అమ్మ మమ్మల్నీ ఏదీ మిస్ అవనిచ్చేది కాదు. మా చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ పెద్ద ఇత్తడి బిందెతో వేరుశనగ కాయాలూ, ఒక మూల గోనె మీద బెల్లం దిమ్మ ఉండేవి. ఇక సీజన్లో చెరుకులు ఎంతగా తినే వాళ్ళమో లెక్ఖలేదు. అప్పట్లో మా నాన్న గారు మానేజరుగ ఉండేవారు. బీడీవో గారికి గేదె ఉండేది. పిల్లలు లేరు. సోమయ్య అనే అతను మాకు చెరుకు గడలు తెచ్చేవాడు. రోడ్డు మీద ఎవరైనా పలకరించినప్పుడు అతనేమనేవాడంటే, 'ఇదిగో, మానేజరుగారికి చెరుకులూ, బీడీవో గారికి గడ్డి పట్టుకెల్తున్నా' అని. అది విని అమ్మ 'నయమే మనకి గేదె లేదు ' అని నవ్వేది. మా అందరి పెళ్ళిళ్ళు అయ్యేవరకూ మా ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేది కాదు. అప్పట్లో పల్లెటూర్లలో అయిస్ ఫ్రూట్ బళ్ళే కానీ అయిస్ క్రీం షాపులు ఉండేవి కాదు. కాని మా అమ్మ మా కోసం అయిస్ క్రీం చేసేది. ఎలాగో తెలుసా. చిక్కటి పాలని నాలుగో వంతు వరకూ మరిగించి, పంచదార వేసి కవ్వంతో తిప్పి సీసాలో పోసి నాన్నగారికి ఇచ్చేది. దాన్ని ఆయన ఆఫీసుకి పట్టుకెళ్ళి అక్కడి ఫ్రిడ్జ్ లో అయిస్ క్యూబ్ ట్రేలో పెట్టి సాయంకాలం ఇంటికి వచ్చేటప్పుదు ఫ్లాస్క్ లో పెట్టి తెచ్చేవారు. ఇప్పుడు వస్తున్న రకరకాల ఫ్లేవర్లు లేకపోతేనేమి, మంచి క్రీం కలరులో కోవా వాసనతో ఉండి ఆ అయిస్ మా అందరికీ ఎంత నచ్చేదో. ఇప్పుడు తలుచుకుంటె పిల్లలకి అయిస్ క్రీం పెట్టలన్న అమ్మ మనసు కనిపిస్తుంది.




అమ్మ చెయ్యి పట్టుకుని, కోట ఉరట్లలో తనతో వెళ్ళిన పేరంటాలు, మహిళా మండలి మీటింగులూ, పుష్య మాసంలో అమ్మ వేసిన నెలగంట, రధం ముగ్గులూ, (నా కసలు ముగ్గు వెయ్యడమే రాదు), పండగలకి అమ్మ చేసి పెట్టిన తాయిలాలూ, ప్రతీదీ మదిలో సజీవమే. అమ్మ మాకు అధ్భుతమైన బాల్యం అందించింది.



అమ్మతో మా బాల్యమే కాదు, మా పిల్లల బాల్యం కూడా అత్యంత అద్భుతంగా గడిచింది. ఆ వివరాలు మరొకసారి చెప్తా.


 

   

7, డిసెంబర్ 2010, మంగళవారం

అమ్మ - పెద్దక్క పెళ్ళి

ప్రతి స్త్రీ జీవితంలో పెళ్ళి ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక్కసారిగా మోగే మేళ తాళాల మధ్య వరుడు , తన తలమీద   జీల కర్రా బెల్లం పెట్టినా, మెడలో తాళి కట్టినా, తన జీవితంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన మార్పుని తెచ్చే ఆ సమయం ఏ అమ్మాయికైనా  ఉద్విగ్న భరితమే..


తరువాత, భర్తా, పిల్లలూ, వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా చేసే వంటలూ, వంటిల్లూ, బాధ్యతలూ, స్కూళ్ళూ కాలేజీలూ,సిలబస్ లూ పిల్లలు పెరిగే క్రమం లో వాళ్ళతో పడే చిరాకులూ, అదొక అయోమయ లోకం లో బతికేస్తుంటారు ఆడవాళ్ళు.

మళ్ళీ స్త్రీ నిజంగా సంతోషం పొందేది ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఉద్యోగాలొచ్చినప్పుడో లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడో.   అలాగే, మా పెద్దక్క పెళ్ళి, మా అమ్మ జీవితంలో అతి ముఖ్యమైన, సంతోషకరమైన ఘట్టం. నలుగురు ఆడపిల్లల్లో పెద్ద పిల్ల పెళ్ళి అంటే ఎవరికైనా ఎంత ఆనందం. ఎంత ఉత్సాహం.  మా అక్క పెళ్ళి 1972 లో జరిగింది. వధువు పేరు ముద్దు విజయలక్ష్మి. వరుని పేరు పంతుల జోగారావు. ఇక చదవండి పెళ్ళి ముచ్చట్లు.

పెళ్ళి కొడుకు మా పార్వతత్తయ్య రెండో అబ్బాయి. వాళ్ళది పార్వతీపురం. ఆ రోజు నాకింకా బాగా గుర్తు. నాన్నగారు అక్క పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకు రావడానికి పార్వతీపురం వెళ్ళారు.

అమ్మకి కాలు నిలవటంలేదు. అప్పుడు మేము అనకాపల్లిలో ఉండేవాళ్ళం. ముందు రెండు గదులు, మధ్యలో వాకిలి. వెనకవేపు నట్టిల్లు, వంటిల్లు ఉండేవి. ఊరు వెళ్ళిన నాన్నగారు ఇంకా రాలేదని అమ్మ పెరట్లోకి వీధిలోకి అటూ ఇటూ తిరుగుతునే ఉంది. అప్పడు స్కూళ్ళకి వేసవి శలవులు. నేనూ, మా చెల్లి ఇంట్లోనే ఉన్నాము. అమ్మ వెనకాలే తిరగడం మొదలు పెట్టాము. ఇల్లుగల మామ్మగారు అమ్మ ఆదుర్దా గమనించి 'గాభరా పడకండి, వస్తారు, బహుశా బస్సు లేటై ఉంటుంది ' అంటూ మాట కలిపారు.

ఇంతలో నాన్నగారు వచ్చారు. అమ్మ పరుగున ముందు గదిలోకి వచ్చింది. ఇల్లు గల మామ్మ గారు వాళ్ళ గుమ్మం బయటకు వచ్చి ఓ చెవి ఇటు పడేసారు. నాన్నగారు మంచి నీళ్ళు తాగి ముహూర్తపు తేది చెప్పేరు. 1972 మే  27 వ తేది.
అక్క పెళ్ళి శుభ లేఖ ఇది:


 అమ్మ కాలెండెర్ తీసి ముహూర్తపు తేదిని పసుపుతో మార్క్ చేసి 'సరిగ్గా నెల ఉంది ' అంటూ మధ్య పోర్షన్ లో ఉన్న మామ్మగారింటికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ చాలా సేపు చాలా విషయాలు మట్లాడుకున్నారు. నాకూ మాచెల్లికి ఏం అర్ధం కాలేదు. కాని,  ఇద్దరం పెళ్ళనగానే చాలా ఉత్సాహ పడ్డాము. ఎవరింట్లోనైనా పెళ్ళంటేనే చాలా సరదా మాకు. అలాంటిది ఇంట్లో అక్క పెళ్ళంటే ఇంకెంత సంబరం.?!

పెళ్ళి పనులు మొదలయ్యేయి. మరునాడు గురువు గారొచ్చి సామాన్ల లిస్టు, ఏ పనులు ఎప్పుడు చెయ్యాలో రాసిన కాగితం ఇచ్చేరు. అమ్మ దానికి పసుపు పెట్టి, కావిడి పెట్టిలో దాచింది. అప్పటి వరకూ పెళ్ళెలా చెయ్యాలో ఎవరికైనా ఎలా తెలుస్తుందో అని నాకు చాలా కంగారుగా ఉండేది. గురువు గారిచ్చిన వివరాలు చూసేకా కొంత అర్ధమయ్యింది. ఓహో ఈయన అన్నీ అమ్మకి చెప్తారన్నమాట అనుకున్నా.


పెళ్ళికి వెన్యు కావాలి కదా. అప్పట్లో కళ్యాణ మండపాలూ, క్యాటరింగులూ ఇంతలా లేవు. అనకాపల్లిలో కన్యకాపరమేశ్వరి కల్యాణమండపం ఒకటే ఉండేది. దానిని సంప్రదించడానికి నాన్నగారు వెళితే అది కమ్యూనిటీకి సంబంధించినందువల్ల చివరివరకూ ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ఆఖరి క్షణంలో ఇబ్బంది ఎందుకని అ ప్రయత్నం
విరమించారు. మరెక్కడ చెయ్యాలి.?


అప్పుడు అమ్మ సలహా ఇచ్చింది. మా అమ్మకి చిట్టి పిన్నిగారని వేలు విడిచిన పిన్నిగారు ఒకరు ఉండేవారు. వాళ్ళు అనకాపల్లిలో మా పక్క వీధిలోనే ఉండేవారు. ఆవిడని మా అమ్మ చిట్టి పిన్నీ అని పిలిచి మట్లాడితే, ఆవిడ 'ఏమే చిట్టి పిల్లా' (మా అమ్మ ముద్దు పేరు) అని మట్లాడేవారు. ఆ చిట్టి పిన్నిగారి అబ్బాయి 'ఆకుండి కృష్ణా రావు ' గారు. టెలికాం డిపార్ట్ మెంట్లో పనిచేసేవారు. మా ఇళ్ళ మధ్య తరుచూ రాకపోకలు ఉండేవి. ఆయన అనకాపల్లిలో శారదా నదికి అవతల కొత్తగా తయారవుతున్న శారదా నగర్ లో ఒక కొత్త ఇల్లు కట్టారు. అది అప్పటికింకా నిర్మాణంలో ఉంది. ఆ ఇంటిని పెళ్ళికని అడుగుతానని అమ్మ అంది. నాన్నగారికి ఆ సలహా నచ్చింది. వెళ్ళి అడగమన్నారు. పెద్దక్కకి మాత్రం బెంగ పట్టుకుంది. ఆ ఇల్లు ముహూర్తం లోపల పూర్తవుతుందా, పూర్తవుతుందనుకున్నా, వాళ్ళు ఇస్తారో లేక గచ్చులు పాడవుతాయని ఇవ్వరో అంటూ బెంగెట్టుకుంది. 'చూద్దాం. ఈ రోజే అడుగుతాను. తప్పకుండా ఒప్పుకుంటారు. చిట్టి పిన్నీ, మా అమ్మా సొంత అక్కా చెల్లెళ్ళలా ఉండేవారుట. మా చిట్టి పిన్నే చెప్పింది. ' అంది అమ్మ. ఆ రోజు సాయంకాలం అమ్మ చిట్టి పిన్ని గారింటికి బయలుదేరింది. వెనకాలే నేనూ మా చెల్లి, మామూలే. ఆ కబురూ ఈ కబురూ చెప్తూ అమ్మ మనసులోని మాట బయట పెట్టింది. ఆవిడ వెంటనే 'అయ్యో ఎంతమాటే, తప్పకుండా వీలవుతుంది ' అంటూ వాళ్ళబ్బాయినీ కోడల్నీ పిలిచి విషయం చెప్పేరు. వెంటనే 'తప్పకుండా అక్కయ్యా' అంటూ కృష్ణా రావు గారు 'శుభమా అని కొత్త ఇంట్లో పెళ్ళి చేసుకుంటామంటే మాకేం అభ్యంతరం వదినగారూ' అంటూ ఆవిడా సంతోషంగా ఒప్పుకున్నారు.

అమ్మయ్య వేదిక కుదిరింది. మర్నాడే ఆ కొత్త ఇంటి ప్రదేశానికి వెళ్ళేము. అప్పటికి ఇల్లు చాలా వరకూ తయరయిపోయింది. కాని ఇంటిముందు ఎక్కడ పడితే అక్కడ ఇటుకలు, రాళ్ళు, ఎగుడు దిగుడుగా ఉంది. ఫెళ్ళికొచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారా అని బెంగ పట్టుకుంది నాకు. కానీ పది రోజుల తరవాత వెళ్ళి చుస్తే అక్కడి రూపే మారి పోయింది. అన్న మాట మీద నిలబడి ఆరు గదుల ఇల్లు  పూర్తి చేసి గృహప్రవేశం కూడా చెసేస్కొని మాకు ఇల్లు అప్పగించేరు ఆకుండి కృష్ణా రావుగారు.


అనకాపల్లి పక్కనే కశింకొటలో మా నాన్నగారు అంతకుముందు పనిచేసారు. ఇలా పెళ్ళని తెలిసి అక్కడి స్టాఫ్ ఉత్సాహంగా ముందుకొచ్చి పెళ్ళి ఇంటిముందు పెద్ద తాటాకుల పందిరి వేయించేరు. ఇంటి వెనక వంట పాక, పాకలో గాడీ పొయ్యి కూడా తయారయిపోయాయి. దూరంగా టెంపరరీ టాయిలెట్లు కట్టేరు. పందిరి కింద జాగా అంతా క్లియర్ చేసి ఇసుక, మట్టి వేసి సాపు చేసి దిమిస కొడుతున్నారు. ఆ ఏర్పాట్లు చూసి నా మనసు కుదుట పడింది. కానీ మా చెల్లి మాత్రం నిరాశ పడింది.

'అప్పుడే' కొత్తగా షామియానాలు వస్తున్న రోజులు. ఆ షామియానా కట్టి, వాటికి రంగు కాగితాల బుట్టలు కట్టాలని దాని కోరిక. అప్పటికి చాలా చిన్నది కదా. దాని కోరిక దానిది. తర్వాత ఈ విషయం చెప్తే 'ఛ, అలా అన్నానా? ఇప్పుడైతే మనం అలాంటి పందిట్లో పెళ్ళి చెయ్యగలమా' అంటుంది. నిజమే కదా.


పెళ్ళంటే అందరూ ముందుగా అలోచించేది బట్టలూ, నగలూ. మాది సామాన్య కుటుంబం కాబట్టి , అప్పటికే సిధ్ధంగా ఒక గొలుసు తప్ప అక్కకి పెద్దగా నగలు కొనాల్సిన పని లేకపోయింది. ఇక పట్టు చీరలు. అనకాపల్లి శ్రీధరాల  వారి షాపులో కొన్నారు. అక్క లెత గులాబి రంగు పట్టుచీర అమ్మ ఎరుపు రంగు పట్టుచీర ఎంచుకున్నారు. నాకు, చెల్లి కి DCM లో (ఢిల్లీ  కాటన్ మిల్ల్స్  అని అన్నయ్య విడమరిచి చెప్పేవాడు) చెరొక మూడు గౌన్లు కుట్టించేరు. ఆ మెటీరియల్, ఇంకా అ గౌన్లు సింపుల్ గా కుట్టిన విధానం మా సుబ్బలక్ష్మి పిన్నికి బాగా నచ్చి మెచ్చుకున్నారు.

ఇక ఇంట్లో మా అమ్మ పెళ్ళి పనులు మొదలు పెట్టేసింది. పెళ్ళిలో వడ్డనకీ, మగ పెళ్ళి వారికి 'తగవు ' లో ఇవ్వాల్సిన అప్పడాలూ, గుమ్మడి వడియాలు, పేల వడియాలు అన్ని అమ్మే ఇంట్లొ స్వయంగా చేసింది. ఆ పనులన్ని నాకిప్పటికీ గుర్తే. ఇక వంట వాళ్ళు. సుబ్బరావు గారనే వంటాయన కుదిరాడు. ఆయన అద్భుతంగా వంటలు చేసేరని ఇప్పటికీ అప్పట్లో పెళ్ళికి వచ్చిన వారంతా చెప్పు కుంటు ఉంటారు. అక్కని పెళ్ళి కూతుర్ని చేసిన నాడు ఇంట్లోనే అరిశలు చేసాడాయన. పెళ్ళికి ఒక రోజు ముందు ఆ కొత్త ఇంట్లో లడ్డు చెసారు. సున్ని ఉండలు మాత్రం అమ్మ ఇల్లుగల మామ్మగారు, నాయనమ్మ గారి సాయంతో ఇంట్లోనే స్వయంగా తయారు చేసింది. కొన్ని చేశాకా నెయ్యి చాలదనిపించి అన్నీ చిదిపేసి, మరింత నెయ్యి పోసి మళ్ళి చుట్టింది అమ్మ. క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండేది కాదు. 

పెళ్ళి కొద్ది రోజులుందనగా కాబోయే మా బావగారు మా ఇంటికి వచ్చారు. మేము ఆయన్ని చూడ్డం అదే మొదటి సారి. మా పక్కింటి మూడో పోర్షన్లో అమ్మాయిలు 'పెళ్ళి కొడుకు తెల్లగా, పొడవుగా చాలా బాగున్నాడన్నారు '  .  మా బావే కదా అని మేము చలా గర్వంగా గొప్పగా ఫీల్ అయిపోయాము.  అక్కా, బావా ఊర్లో కాస్త దూరంగా ఉన్న వెంకటేశ్వరస్వామి కోవెలకి బయలుదేరారు. అమ్మ నన్నూ, మా చెల్లినీ వాళ్ళ వెనకాలే పంపింది. అలా వెళ్ళకూడదని అప్పట్లో మాకేం తెలుసు.


ఇక పెళ్ళి పిలుపులు. అమ్మా, నాన్నగారూ, నేను చెల్లీ రిక్షాలో వెళ్ళి పిలిచేము. చిక్కశం అనే మాటని చాలా మంది విని కూడా ఉండరు. మా అక్క పెళ్ళికి అమ్మ ఊళ్ళో వాళ్ళందరినీ చిక్కశం పంచి పెట్టి మరీ అందర్నీ పిలిచింది. చిక్కశం అంటే మరేం కాదు. పసుపు, కుంకుమ, నలుగుపిండి , కుంకుడుకాయలు , నూనె , ఒక స్వీటుతో సహా వాళ్ళకిచ్చి చక్కగా పెళ్ళికి తయారయి రమ్మని చెప్పడం.  ఇక పై ఊరి బంధువలకి అందరికీ తప్పనిసరిగా శుభలేఖతో పాటు ఒక ఉత్తరం కూడా తప్పనిసరిగా రసేరు.  ఇప్పుడు శుభలేఖ పోస్ట్ చేసి , ఫోన్లు చేసేస్తున్నాము.  ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా.  అందుకని  ఒక్క శుభలేఖ మాత్రమే పంపిస్తే మొక్కుబడిగా పిలిచినట్టు ఫీల్ అయ్యేవారు.  పైగా అలా ఉత్తరం లేకపోతె అలకలూ కోపాలు తెచ్చుకొని గొడవలు పడిన సందర్భాలు కూడా ఉండేవి ఆ రోజుల్లో.  అందుకని ఆ విషయంలో అమ్మా నాన్నగారూ చాలా జాగ్రత్త తీసుకొని అందరికీ ఉత్తరాలు రాయడం జరిగింది.     

పెళ్ళి రోజు దగ్గర పడింది. ముందురోజు రాత్రే అమ్మా నాన్న గారూ కొత్త ఇంటికి బయలుదేరారు. నేను కూడా వెళ్ళా. పార్వతీపురం నుండి రావలసిన మగ పెళ్ళివారు బస్సు ట్రబుల్ ఇవ్వడంతో బాగా ఆలస్యంగా వచ్చారు. ఆ విషయం వాళ్ళు వచ్చి చెప్తే కానీ తెలీదుగా. ఈ లోపల అమ్మకి ఒకటే కంగారు. అవీ ఇవీ సర్దినవే సర్దుతూ ఇల్లంతా ఒకటే తిరగడం మొదలుపెట్టింది. నాకింక నిద్ర వచ్చి , మగ పెళ్ళి వారు రాగానే చూడాలనే కోరికని పక్కన పెట్టి నిద్ర పోయాను. వాళ్ళు ఏ అర్ధరాత్రికో వచ్చినట్టున్నారు.

తెల్లవారగానే చూసేసరికి ఇంటా, బయటా ఒకటే సందడి. అక్క పెళ్ళి రెండు రోజులు జరిగింది. పెళ్ళి జరిగిన ఇంటి పక్కనే రైల్వే ట్రాక్, ట్రాక్ దాటితే పక్కన చిన్న అందమైన కొండ, కొండమీద సత్యనారాయణస్వామి వారి గుడి, గుడి వరుకు పాములా మెలికలు తిరుగుతూ మెట్లు. పెళ్ళి కర్యక్రమాలు పూర్తవగానే మగ పెళ్ళి వారిలోని ఉత్సాహవంతులంతా కొండ మీద గుడికి వెళ్ళేవారు. వాళ్ళందరికీ నేనే గైడ్. ఆ ఇంటికి దగ్గరలోనే చిన్న దిగుడుబావిలాంటిది ఉండేది. దాన్లో సయంకాలమయ్యేసరికి స్నానాలు. అందుకే పెళ్ళికి వచ్చినవారంతా ఇప్పటికీ 'అది పిక్నిక్కి వచ్చినట్టుండేదని ' అంటుంటారు.


'కాఫీలూ' 'టిఫినీలూ' లేకుండా పెళ్ళుండదుగా. సాధారణంగా పెళ్ళిళ్ళలో పల్చటి పంచదార పాకం లాంటి కాఫీలు పోసేవారు. కానీ, అమ్మ  ఏర్పాటు చేసిన కాఫీలే  వేరు. ప్రత్యెకించి చెప్పుకోవాల్సిన.  రుచితో తయారు  చేయించింది. అప్పుడు మా నాన్న గారు విసాఖ ఏజన్సీ ఏరియాలో పనిచేసేవారు. పాడేరు కాఫీ ఉత్పత్తికి ప్రసిధ్ధి. అక్కడినుంచి  కాఫీ గింజలు తెప్పించి అమ్మే స్వయంగా వేయించి అన్నయ్య చేత మర పట్టించి, ఆ కాఫీ పొడితో ఘుమ ఘుమలా డే  కాఫీ ఏర్పాట్లు చేసింది. ఈ మన్యం కా ఫీ ఉత్పత్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ ప్రామాణికంగా నిలిచింది.  అలా అక్క పెళ్ళిలో కాఫీలు చలా ప్రత్యెకంగా నిలిచాయి. ఇక వంటాయన కూడా అమ్మ కోరిక ప్రకారం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వేడి వేడి కఫీలు విడిదికి పంపించేవాడు.

ఇక భోజనాల వడ్డన కిందనే. పంక్తి భోజనాలు. అది కూడా ప్రోటొకోల్ పాటించి మరీ కూర్చునేవారు. భోజనానికి ముందూ, తరువాతా సాహిత్యాభిమానులూ సరదా వ్యక్తులూ చక్కటి పద్యాలు పాడి ఆనందించేరు. పంక్తిలో అందరి భోజనం పూర్తయ్యెవరకూ లేచేవారు కాదు.

ఈ కాలపు పెళ్ళిల్లలో లాగా ప్లేట్లు పట్టుకుని ఖైదీల్లాగా క్యూలో నుంచొని పదార్ధాలు అడుక్కుని వడ్డించికుని హాలు ఇరుకైతే వాళ్ళ మోచెయి, వీళ్ళ మోచెయి తగిలి ఇబ్బంది పడుతూ భోజనం అయ్యిందనిపించే ప్రసక్తే లేదు అప్పట్లో.

ఆ రోజుల్లో శనివారం టిఫిన్ అంటే ఉప్పు పిండే. కాని నాన్నగారు పూరీ కూరా చేయించి , లడ్డూ పెట్టించేరు. గుప్తాస్ వారి కూల్ డ్రింక్స్ ముహూర్త సమయంలో అందరికి పంచేరు. ఆ కంపనీ మానేజర్ గారు అమ్మకి దగ్గర బంధువు. ఐస్ లో పెట్టి మరీ ముహూర్త సమయానికి అందించేరు.  ఆ డ్రింకులు ఆరెంజ్ ఫ్లేవరుతో పిల్లలందరికీ తెగ నచ్చేసాయి.

ఇక పెళ్ళి ఘనంగా జరిగింది. ఫక్కకు జరగండి , అడ్డంగా ఉన్నరు అంటూ వీడియొ వాళ్ళ గోల లేదు. మా పెద్దక్క తరవాత రచయిత్రిగా మారి  'అప్పగింతలు ' అనే కధ రాసింది. అందులో ఒక పెళ్ళిలో అప్పగింతలు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అమ్మాయిని అందరికీ అప్పగిం చేయడం, తల్లి, పెళ్ళికుతురు ఏడవడం అన్ని పూర్తయ్యాక ఆ తంతు వీడియొ తీయలేదని తెలుసి వీడియొ కోసం మళ్ళీ ఆ కార్యక్రమం  పూర్తి చేస్తారు, నటించిన ఏడుపులతో సహా. ఎంత రసాభాస. ఇలా కధలోలాగా వీడియో వాళ్ళకోసం చేసే ఏక్షన్ రీప్లేలు లేవు. సాహిత్య కారుడు  కూడా పెళ్ళంటే ‘పందిళ్ళు , సందళ్ళు , తో రణాలు’ అని రాసాడు కానీ, పాపం వీడియోలు అని రాయలేదు. ఇప్పట్లోలాగా ఏదో స్టేజ్ షో కొచ్చిన ఫీలింగ్ కూడా లేదు. చక్కగా చుట్టూ కూర్చొని పెళ్ళిని ఆసాంతం చూసి ఆనందించేరు. అందరూ పెళ్ళి ఏర్పాట్ల గురించి మెచ్చుకున్నారు. అది అమ్మ ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవడం వల్ల సాధ్యమయ్యింది.


అమ్మకి పెద్దక్క పెళ్ళిగురించి అందరికిన్నా గొప్ప కితాబు మా మామయ్యగారినుండే లభించింది. మా అక్క పెళ్ళి తరువాత జరిగిన మరొక పెళ్ళిలో అందరూ కూర్చొని ఉండగా మామయ్యగారు బాసిం పట్టు వేసుకుని కూర్చొని 'మా చిట్టి పిల్ల చేసినట్టు ఎవరూ చేయలేరు పెళ్ళి ' అంటూ చేత్తో ఢంకా   బజాయించినట్టు మరీ చెప్పేరు. ఆయన గొంతు కొంచెం పెద్దది. ఆయన నలుగురిలోనూ అంత గట్టిగా చెప్పేసరికి అమ్మ ముఖం చేటంత అయ్యింది. 'అన్నయ్యా, అంతా మీ అభిమానం అంటూ ఆయన  పాదాల మీద చేతులు వేసింది.

ఈ పెళ్ళిలో  ఒక కొస మెరుపు కూడా ఉంది. మూడోరోజు ఉదయం మగపెళ్ళివాళ్ళు బయలుదేరవలసి ఉంది. అంతా తయరయి టిఫిన్లు కూడా తిని, సిధ్ధంగా ఉన్న మగ పెళ్ళి వారికోసం రావలసిన బస్సు రాలేదు. వాళ్ళు వచ్చినప్పటి సమస్యే మళ్ళీ వచ్చింది. బస్సు పదకొండు గంటలకు వస్తుందని తెలిసింది. పార్వతీపురం నాలుగైదు గంటల ప్రయాణం. ఆ సమయంలో వాళ్ళని అభోజనగా మంపించడం అమ్మకి ఇష్టం లేకపొయింది. మా కిండాం దొడ్డమ్మ, పెద్ద దొడ్డమ్మలతో సంప్రదించింది. 'అయ్యో అదెంతసేపే అంటూ' వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి డెబ్భైమందికి అవలీలగా ఒక పప్పు, కూర చారులతో భోజనం రడీ చేసేసారు. సహృదయంతో విషయాన్ని అర్ధం చేసుకున్న మామయ్యగారు, బస్సు ఏర్పాటు సరిగా చెయ్యలేదని మగ పెళ్ళివారిలో ఎవర్నీ ఒక్కమాట కూడా అననివ్వకుండా కట్టడి చేసేరు. పైగా అక్క చెల్లెళ్ళ అవస్థ గమనించి ఆయనే స్వయంగా ముందుకు వచ్చి , ఉన్న పెరుగులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నీళ్ళు పోసి చక్కటి మజ్జిగని తయారు చేసారు.

అప్పటికి మేము చిన్న వాళ్ళం. ఇంత చిన్న చిన్న వివరాలు కూడా మాకు ఇంతగా గుర్తు ఉన్నాయంటే అమ్మ తరుచు ఈ విషయాలన్నీ ఇష్టంగా గుర్తు చేసుకుంటూ మాకు చెప్తుండటమే కారణం.

ఈ మధ్య మా చిన్నక్క కొడుకు ఉపనయనం రోజున సుధ అనీ మా బావగారి అన్నయ్యగారి అమ్మాయి ఒక విషయం చెప్పింది. ఈ పెళ్ళికి ఆ అమ్మాయి చాలా చిన్నది. మా బావగారు తన పెళ్ళిలో సుధని 'ఇదెవరి పెళ్ళీ'  అని అడిగారట. 'ఇదేంటి ఇది తన పెళ్ళే కద్ద, చిన్నాన్న ఇలా అడుగుతారేంటి ' అనుకుంటూ 'ఇది మీ పెళ్ళే' అని చెప్పడానికి అప్పుడు చాలా సిగ్గు పడిపోయిందట. ఆ విషయం చెప్పి తెగ నవ్వింది.

పంతొమ్మిది ఏళ్ళకే అత్తవారి ఇంటికి వెళ్ళిన మా అక్క కూడా, అమ్మ పేరు నిలబెట్టేలా అత్త వారి ఇంట్లోనూ, పార్వతీపురం లోని అత్తవారి కుటుంబాలలోనూ మంచిపేరే తెచ్చుకుంది. అప్పటికే మా పార్వతత్తయ్య లేరు.  అత్త పెద్ద కొడుకు వివాహమయి ఉద్యోగరీత్యా హైదరాబదులో ఉండేవారు. ఇక పార్వతీపురంలో మామగారూ, భర్తా, ముగ్గురు మరుదులూ,  చిన్నదైనా అక్క అన్నీ ఓపిగ్గా నేర్చుకుని ఇంటి బాధ్యతలు చక్క పెట్టేది. అందులో మా మామయ్యగారి సహకారం కూడా ఉంది.  ఆయనే దగ్గరుండి ఇంటి పనులన్నీ నేర్పించేరు.  38 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు మా పెద్దక్క తన ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అమ్మమ్మకూడా అయ్యింది. ఐనా ఏదో ఒక సందర్భంలో ఈ పెళ్ళి గురించిన ఉదాహరణలు వస్తుంటాయి. మగ పెళ్ళి వారిలో ఒక అబ్బాయి పెళ్ళికి వచ్చిన వారిలో కొంతమంది వివరాలు ముందే తెలుసుకుని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెయ్యి చూసి 'హస్త సాముద్రికం' తెలుసని చెప్పి ముందుగా తెలుసుకున్న వాళ్ళ వివరాలన్నీ  చెప్పడం,  ఆ వివరాలన్నీ ఎలా చెపుతున్నాడా అని వాళ్ళు ఆశ్చర్య పోతుంటే అందరూ నవ్వడం, పార్వతీపురం వారి హాస్యప్రియత్వం అన్నీ గుర్తొస్తుంటాయి.


ఇంటి ఆడ పిల్లల పెళ్ళిళ్ళకు సంబంధించిన ఉద్వేగం నేను అమ్మలో మళ్ళీ మా అన్న కూతురు చిన్ని పెళ్ళిలో చూశాను. అమ్మకి ఎనభై ఏళ్ళు వచ్చేసాయి. ఓపిక తగ్గిపొయింది. చిన్ని పెళ్ళి ముహూర్తం ఉదయం ఏడు గంటలకే. అమ్మ, నాన్నగారూ, నాలుగున్నరకే లేచి తయారయిపోయి మా వారి సాయంతో వెన్యుకి వచ్చి చిన్ని పెళ్ళిని ఆసాంతం ఆనందించేరు. ‘ జ్యో తులు’ పట్టుకునే సమయానికి అమ్మ ఉత్సాహంగా లేచి తనుకూడా పట్టుకుంది.  ఆ దీపాల వెలుగులో అమ్మ ముఖం కాంతితో నిండి పొయింది.

మా అన్నయ్య, వదిన వెనకాలే నిలబడి అన్నీ అందిస్తూ హడావిడిగా ఉన్న మా పెద్దక్కని చూసి అమ్మ కడుపు నిండి  పోయి నాతో ఈ మాట అంది, ‘జ్యోతీ, విజయ పెళ్ళిళ్ళు చెయడంలో పండిపోయింది కదూ’ అంటూ సరదా పడింది. తన వారసత్వం అంది పుచ్చుకున్నందుకు పొంగి పోయింది. చిన్నికి మంగళ సుత్ర ధారణ జరుగుతున్నప్పుడు అమ్మకి ఉద్వేగం ఆపుకోలెక కళ్ళనీళ్ళు వచ్చాయి. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మా అమ్మ ఆశీస్సులు ఉంటే  మంచి జరగనిదెవరికి. మంగళధారణ పూర్తయ్యాక మా అక్క మా దగ్గరికి వచ్చింది. అక్క ముఖంలో కూడా అదే ఉద్వేగం. ‘ఇది మన పుట్టిల్లు. మనం ఈ ఇంట్లోంచే అత్త వారి ఇళ్ళకు వెళ్ళాము . ఈ ముద్దు వారి ఇంటినుండి మనం ఎలా  వెళ్ళేమో చిన్ని కూడా అలాగే వెళ్తోంది , మేనత్తలుగా చిన్ని పెళ్ళి సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత మనందరిదీ. అలాగే దాని పెళ్ళి సక్రమంగా జరిగింది’ అంటూ ఉద్వేగంతో మాట్లాడింది.


 అమ్మ ఇచ్చిన ఈ వారసత్వం ఇలా కొనసాగుతునే ఉంటుంది.

5, డిసెంబర్ 2010, ఆదివారం

అమ్మ - ఆర్టూ – జ్ఞానం - విజ్ఞానం

మా అమ్మది కళాత్మక హృదయం. కాలక్రమంలో ఆమెలోని ఆర్టూ, క్రియేటివిటీ మరుగునపడ్డా మా అమ్మ చనిపొయే వరకూ ఆమెలోని కళ తొంగి చూస్తూ ఉండేది.

మా చిన్నప్పుడు మాకు అందమైన స్వెట్టర్లు అల్లేది.  ఊలు దారాలు కానీ సిల్కు దారాలుకానీ ఉపయోగించి గుండ్రని లేసులు అందంగా అల్లేది. మా రమణ చిన్నన్నగారి పెద్ద కోడలు, విజయ ఎంతో ముచ్చటపడి అమ్మ అల్లుతున్న పధ్ధతి చూసి తెలుసుకుంది.  మేము నలుగురం అమ్మయిలం మా అమ్మకి ఉన్నాం కానీ మాకెవరికీ ఆ బుధ్ధి లేకపొయింది.  అమ్మ దగ్గర ఎప్పుడూ ఆ లేసులల్లే సూదులు ఉండేవి.  అవెక్కడున్నాయో మా హైమక్కని ఆదిగి తీసి దాచుకోవాలి.


మహిళా మండలి లో నేర్చుకున్న ఎంబ్రాయిడరీలన్నీ ఇంట్లో చేసేది.  నా చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ మ్యాటీ క్లాత్తో కుట్టిన డోర్ కర్టెన్ ఉండేది.  దానికి చుట్టూ ఆకు పచ్చని కాటన్ అంచు ఉందేది.  కర్టెన్ మధ్యలో పెద్ద పూలకుండీ డిజైన్, నాలుగు మూలలా పూల గుత్తులు ఉండేవి.  ఆ కర్టెన్ని మా అమ్మ ఎంత కష్టపడి కుట్టిందో.  అది ఎంత బాగుండేదో.  మేము ఏ ఊరు వెళ్ళినా ముందు గుమ్మానికి ఆ కర్టెన్ వేసే వాళ్ళం.  కనీసం ఒక 30 సంవత్సరాలు ఆ కర్టెన్ వాడేము.  చిరిగి పోయింది కాని దాని అందం మాత్రం పోలేదు.  


ఇక మా అమ్మ చాలా అందమైన బొంతలు కుట్టేది.  బొంతలు కుట్టడం ఒక పెద్ద ఆర్టా అనుకోవచ్చు.  కాని వాటిని అందంగా కూర్చి వాటిమీద ఇక్కత్ డిజైన్ వచ్చేటట్టు రంగు రంగు దారాలతో కుట్టడం మాత్రం ఆర్టే.  మా ఇళ్ళల్లోని పిల్లలందరూ అమ్మ బొంతల మీద పెరిగినవారే.  చంటి పిల్లలకైతే మరీ మెత్తని చీరలు ఎంచుకుని కుట్టేది. నేనొకసారి మా మామయ్య కూతురు పెళ్ళికి హైదరాబాదు వెళ్ళినప్పుడు ఆ పెళ్ళికి వచ్చిన బొంబాయి వాళ్ళందరికీ మా చిన్నమ్మయిని, మూడు నెలలది, పడుకొపెట్టిన బొంతని ఎంత మెచ్చుకున్నారో.  వాళ్ళంతా ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళే.  'అరె ఇవి మనవేపు కుడతారర్రా'  అనుకుంటూ తెగ మెచ్చుకున్నారు.


మా అమ్మ మామూలు జనప గోనె సంచి మీద ఊలుతో మంచి మంచి డెజైన్లు వేసి, డోర్ మ్యాట్ గా వాడుకోమని ఇచ్చేది.  అవెంత బాగుండేవో.

ఇక శ్రావణమాసపు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మ తీర్చి దిద్దే అమ్మవారి రూపు గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిందే. మైదా పిండిలో పసుపు కలిపి ముఖానికి ఆకృతిని ఇచ్చేది.  వరిపిండి, కాటుకతో కళ్ళూ, కుంకుమతో తిలకం దిద్దేది.  ఇంట్లో ఉన్న పాత రాళ్ళతో కర్నాభరణం, ముక్కెర అలంకరించేది.  మా అమ్మ,  అమ్మవారికి ఏ నగలూ పెట్టేది కాదు.  ఎలాంటి ఆడంబరమూ ఉండేది కాదు.  కాని అమ్మ చేసిన అమ్మవారు అందంగా వెలిగి పోతుండేది. చుట్టుపక్కల ఆడవాళ్ళు ప్రత్యేకించి వచ్చి అమ్మ చేసిన రూపుని చూసి వెళ్ళేవాళ్ళు..


మా అమ్మ పిల్లల్ని గుమ్మడి పండు మామిడి పండు అంటూ పోల్చి ముద్దులాడేది.  ఏ అమ్మమ్మైనా అంతే అనుకోండి.  మ చెల్లి కూతురు  చిట్టి  కాస్త తక్కువ బరువుతో పుట్టినా, పుట్టిన నెల రోజులకే తేరుకుని ఒళ్ళు చేసింది.  అమ్మా ఇదేం పండు అని అడిగా.  'దీని బుగ్గలు మర్రి పళ్ళర్రా' అంది.  నేను ఒక్కసారిగా చిట్టి బుగ్గలు చూసా.  అవి నిజంగా చిన్న ఎర్రని మర్రి పళ్ళలానే ఉన్నాయి.  అమ్మ పోలికకి నవ్వొచ్చింది.  ఒకసారి గోరేటి వెంకన్న గారు అన్నారు.  గ్రామీణులు చేసే పోలికలన్నీ ప్రకృతిలోని విషయాలతో ఉంటాయని.  మా అమ్మది కూడా గ్రామీణ నేపధ్యమే.

మా అమ్మ ఏమీ చదువుకోలేదు.  రెండో తరగతితో ఆపేసింది.   కానీ ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించేది.  ఎలాంటి మూఢనమ్మకాలూ ఇసుమంతైనా లేని మా నాన్నగారి సాహచర్యంవల్ల మా అమ్మకు కూడా ఎలాంటి మూఢనమ్మకాలూ ఉండేవి కావు.  ఆఖరికి ఏ పనికైనా చూసే ముహూర్తాల విషయంలో కూడా 'మనకి ఏ పనైనా చెయ్యాలని సంకల్పం కలిగిని సమయమే మంచి ముహూర్తం అనుకోవాలని, సంకల్పం కలిగినప్పుడే పని మొదలైనట్టని అనేది.' ఈ మధ్య పెళ్ళిళ్ళలో జాతకాల పిచ్చి మరీ ఎక్కువైపోతోందని చిరాకు పడెది.  వాళ్ళ కాలంలో అన్నీ నచ్చితే జాతకాలు చూసేవారే కాదంట.  పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నట్టు చదువులు ఎక్కువైనకొద్దీ ఈ జాతకాల పిచ్చేంటని విసుక్కునేది.  శకునాలు చూడ్డం కానీ, కష్టాలు వచ్చినప్పుడు 'అన్నీ దేవుడే చూసుకుంటాడనీ కానీ మా ఆలోచనలెనెప్పుడూ కండిషనింగ్ చెయ్యాలని ప్రయత్నించలేదు.   విషయమంతా మనలోనే ఉంటుందనీ బయటి నుంచి ఏ ఫోర్సులూ పని చెయ్యవని తనకు కలిగిని సహజ జ్ఞానం వల్ల అమ్మ తనకు తెలియకుండానే మమ్మల్ని ' జిడ్డు కృస్ణమూర్తి ' ఆలోచనా పధ్ధతిలో పెంచింది.   ఇక టీవీలూ, బీరువాలు కొత్తవి కొన్నప్పుడు ప్రారంభించడానికి ముహూర్తాలు చుసేవాళ్ళతో,  ఆ వస్తువు ఇంటికి రావడమే సుముహూర్తమండీ, ఇంక వేరే ముహూర్తమెందుకని నవ్వేసేది.  పాండిత్యం  కన్నా జ్ఞానం ముఖ్యం' కదా.

మా అమ్మ నమ్మకాలకన్నా, సాంప్రదాయానికి ఎక్కువ విలువ నిచ్చేది.  ఈ మధ్య పెళ్ళిళ్ళలో చూసేరా, పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టే గంపకి రంగు కాగితాలు చుట్టి , మెరుపులు అలంకరిస్తున్నారు.  ‘అమ్మాయిని గంపలో కుర్చో పెట్టి  అబ్బాయికి అప్పగించాలి కాని ఇదేంటి కాగితం డొక్కులాగా,  అది గంప అని తెలియటమే లేదు.  చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించినా బాగుంటుంది అని సలహా ఇచ్చేది.

మా అమ్మ అభిరుచులుకూడా చాలా చక్కగా ఉండేవి.   కర్ణాటక సంగీతం చాలా ఇష్టంగా వినేది.  అందులోనూ అన్నిటికన్న మిన్నగా డీ కె పట్టమ్మాళ్ పాటలంటే మరీను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి తరువాతి స్థానం. పుష్య బహుళ పంచమినాడు తిరువైయ్యారులో జరిగే అరాధనోత్సవాలప్పుడు పంచరత్నాలూ పూర్తయ్యేవరకూ ఇంతకు ముందు రేడియో తరువాత టీవీ ముందునుండు నాన్నగారితో సహా కూర్చుని విని, చూసి మనసుతీరా అనందించేది.  అమ్మకి అన్నిటికన్నా ఇష్టమైన పాట 'రఘువంశ సుధాంబుధీ. ఇక పెళ్ళిళ్ళలో సన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకిష్టమైన పాటల్ని వాళ్ళకి వస్తే అడిగి వాయించమని చెప్పేది.  తొట లాంఛనమప్పుడు 'గంధమూ పుయ్యరుగా', ఇంకా పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడు సమయానికి తగు మాటలాడెనే' పాటలుండాలనేది. ముహూర్తానికి ముందు ఎందరో మహానుభావులు తప్పని సరిగా ఉండాలనేది.

 మల్లీశ్వరి అమ్మకి చాలా ఇష్టమైన సినిమా. మా అమ్మ నలభైల్లో ఉండగానే సినిమాలు నచ్చక అసలు చూడ్డం మానేసింది.  నేను విజయవాడలో ఉండగా అమ్మ అక్కడికి వచ్చినప్పుడు పాత దీదార్ సినిమాకి తీసుకెళ్ళా.  చాలా అనందించింది.  మా కీర్తి ఒక సారి నాతో అంది.  'అమ్మా మా ఫ్రెండ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏం తోచక తెలుగు టీవీ సీరియల్స్ చూస్తారుట.  చక్కగా మన అమ్మమ్మా తాతగారే నయం.  అసలు టీవీ సీరియల్సే చూడరు ' వాళ్ళకవి నచ్చవు అంటూ అనాలసిస్ ఇచ్చి టీవీ సీరియల్స్  చూడని అమ్మమ్మా తాతగారూ వాళ్ళకు దొరికినందుకు చాలా అనందించింది.


టీవీ అంటే గుర్తుకొచ్చింది.  అమ్మ జ్ఞానానికి సంబంధించిన విషయం ఒకటి చెప్తా. ఒక సారి అందరం కూర్చొని టీవీలో క్విజ్ షో వస్తుంటే చూస్తున్నాము. అక్కడ మాతో పాటు , తమకు మంచి విషయ పరిజ్ఞానముందనీ, పురాణాల విషయంలో తమకు మంచి పరిజ్ఞానం ఉందనుకునే ఆడవాళ్ళు  కూడా కొంతమంధి ఉన్నారు.  క్విజ్ లో ఒక ప్రశ్న.  దేవవ్రతుడంటే ఎవరు అని.  అమ్మ వెంటనే భీష్ముడని చెప్పింది.  మిగిలిన వాళ్ళు అర్జునుడనీ, ధర్మరాజనీ చెప్పడం మొదలుపెట్టేరు.  అమ్మ సమాధానాన్ని వాళ్ళస్సలు పట్టించికోలేదు.  కానీ అమ్మ చెప్పిన సమాధానమే కరక్ట్ అయ్యింది.  నాకు చాలా సరదా వేసింది.  అందులో ఒకావిడ అంది ‘పిల్లల బొమ్మల భారతం’ చదివి కూడా ఇలాంటివి చెప్పెయ్యొచ్చని.


తరువాత అమ్మని అంత కరక్ట్ గా ఎలా చెప్పావని అడిగా.  పురిపండా అప్పలస్వామి వచన భారతం చదువుతున్నా, అందుకే చెప్పగలిగానంది.

నా చిన్నప్పుడు డాబా మీద పడుకునేవాళ్ళం.   లో దాహం వేసి అమ్మని లేపా.  అమ్మ ఇచ్చిన మంచి నీళ్ళు తాగి తల పైకెత్తి చూస్తే అమ్మ ఆకాశంలోకి చూస్తోంది.  'అమ్మా ఏం చూస్తున్నావు ' అన్నా.  'వృశ్చిక రాశి బాగా కిందకి దికిపొయింది ' ఇంకో గంటలో తెల్లవారి పోతుంది '  అంది.  అంతేకాదు పడుకునే ముందు సప్తరుషుల్నీ, సింహరాశినీ,  చూపించేది.   ఇవన్నీ ఏం చదువుకోని అమ్మకెలా తెలుసా అని ఆశ్చర్యమేసేది.

14, నవంబర్ 2010, ఆదివారం

అమ్మ నగలు

  ఈపాటికి మా అమ్మ ఒక సామాన్య గృహిణి అని మీకు అర్ధమయ్యేఉంటుంది.  ఆమెకు  ఏడువారాల నగలు కానీ రత్నహారాలు కానీ ఉండి ఉంటాయని మీరనుకుని ఉండరని భావిస్తా. అయినా అమ్మ నగలు గురించి ఎందుకు వ్రాయాల్సి వచ్చిందో ఒకసారి ఇలా చూడండి.

  మా అమ్మకి ఒకప్పుడు పుట్టింటివారు పెట్టిన  చంద్రహారం, గాజులూ అత్తింటివారు పెట్టిన  జిగినీ గొలుసూ, ఉండేవట.  మంగళ సూత్రాలు వేసుకోనే నానుతాడు మా అమ్మ పెళ్ళికి ముందు నుంచీ వేసుకొనేదిట.  కానీ అర్ధికావసరాలకోసం వాటినన్నిటినీ అమ్ముకోవలసివచ్చింది.   ఆర్ధికమాంద్యం ఉన్న ఆ రోజుల్లో సామాన్య కుటుంబాల్లో అది సర్వ సాధారణం.
నాకు ఊహ తెలిసి, మా అమ్మకి తొమ్మిది రాళ్ళ దుద్దులు, ముక్కున మూడు రాళ్ళ  ముక్కు పుడక ఉండేవి. ఈ రెండూ లేకుండా అమ్మ ముఖం నాకు గుర్తుకు రాదు.  అవేం రాళ్ళోకానీ, జాతి రత్నాల్లా మెరిసేవవి.  ఇక మెడలో నానుతాడు, దారానికి గుచ్చిన నల్లపూసలూ తప్ప ఇంకేమీ ఉండేవి కాదు.  మా అమ్మ మమ్మల్నందర్నీ ముద్దుగా పెంచడం వల్లా, మాతో ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడడం వల్లా, ఎప్పుడూ అంచులున్న నేత జరీ చీరలే ధరించడంవల్లా, ఆమె మాకెప్పుడూ అందంగా, హుందాగా కనిపించేది.  అమ్మకి భాషణమే భూషణమయ్యింది.  

  మేము నలుగురం ఆడపిల్లలవడంచేతా, అందరికీ పెళ్ళి సందర్భంగా కనీస బంగారం కొనవలసి రావడం చేతా, బహుశా తనకంటూ ఏమీ చేయించుకోలెకపోయింది.

  అమ్మ చేతికి ఎప్పుడూ మట్టిగాజులే ఉండేవి.  అవికూడా తనకు నప్పే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులే ఎంచుకునేది.  వాటికెప్పుడూ చిన్న మెరుపు ఉండేది.  అవి ఏ మాత్రం మాసినా వెంటనే మార్చేసేది. కొత్త గాజులు మాచేత తనకు నచ్చిన రంగువి తెప్పించుకొని చేతికి సబ్బు రాసుకుని ఎక్కించుకొని రెండు చేతులూ తను ఒకసారి చూసుకొని మాకు  చూపించి 'బాగున్నాయమ్మా ' అనేది. నా చిన్నప్పుడు మా అమ్మ పెరట్లో రుబ్బురోట్లో పచ్చడి కానీ, పిండి కానీ రుబ్బుతుంటే వచ్చే గాజుల శబ్దం నాకిప్పటికీ గుర్తే.

  నాకూ, మా చెల్లి స్వాతికీ ఉద్యోగాలొచ్చేక మా అమ్మకి గాజులు చెయించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసేవాళ్ళం.
కానీ అమ్మ అనేది.  'ముందు మీ పెళ్ళిళ్ళు కావాలి.  డబ్బులుంటే దాచుకోండి. నాకిప్పుడు గాజులు లేకపోతే వచ్చే నష్టమేమీ  లేదు ' అని కేకలేసేది.  అలా ఆ ఆలోచన పక్కన పడేది.

  ఇన్వెస్ట్మెంట్ అనే మాట కానీ ఆలోచనగానీ లేని రోజుల్లో మా నాన్నగారు 247 చ. గ. స్థలం ఒకటి కొన్నారు.  కొన్న చాలాకాలం తరవాత, ఆ జాగాని రక్షించుకోవడం కష్టమనే ఆలోచనతోనూ  రేటు బాగా రవాడంతోనూ దాన్ని అమ్మేసారు.  వేలల్లో కొన్న జాగాకి లక్షల్లో రావడంతో అమ్మా నాన్నగారూ ఇద్దరూ చాలా ఆనందపడ్డారు.   అంత డబ్బు చేతిలొకి వచ్చినాకూడా అమ్మ తనకి కాసు బంగారమైనా  కొనుక్కొవాలన్న ఆలోచనే చెయ్యకుండా, నలుగురు కూతుళ్ళకీ, కోడలికీ తలా ఒక రెండు తులాలూ బంగారం కొంది.


  మా చెల్లి స్వాతి తనకు బంగారం వద్దని తిరిగి ఇచ్చేస్తే, అదికూడా తను తీసుకోకుండా, గొలుసు చేయించి  మనమరాలి పెళ్ళికని దాచి, ఆ పెళ్ళిలొ మనమరాలి మెడలో వేసింది.

  అందరూ ఆర్ధికంగా స్థిరపడ్డాక,  వాళ్ళ డబ్బుతో ఇంకెవరికీ అవసరం లేదనిపించాక, ఒక సందర్భంలో అమ్మ గాజులు  చేయించుకోవాలనే ఆలొచన చేసింది.  అదే సమయంలో నాన్నగారి ఆరొగ్యంలో ఒక్కసారిగా తేడా వచ్చింది.  దాంతో ఆ ఆలోచన మరిచిపోయింది.  మా అన్నయ్య కూతురు, వైదెహి పెళ్ళికి ముందు, అమ్మ నానుతాడులోని బంగారం పోగులు చిట్లి మెడకు గుచ్చుకొని  బాధపడుతుంటే, మా చెల్లి స్వాతి గమనించి 'అమ్మా మార్చేస్తాను ఇచ్చెయ్యి '  అంటూ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని నన్ను కూడా తీసుకుని వెళ్ళి పాత గొలుసు మార్చేసి కొత్త గొలుసు  తీసుకుంది.  కానీ అది నానుతాడు కాదు.  వేరొక డిజైన్ లో ఉంది. అమ్మ కొంచెం నిరాశపడ్డా, సంతోషంగానే నాన్నగారికి చూపించింది.  అమ్మ సంతొషం చూసి నాన్నగారు, 'నెమ్మదిగా గాజులు కూడా కొనుక్కో' అన్నారు.

  ఇక అమ్మ ముక్కు పుడక గురించి కూడా చిన్న మాట చెప్పాలి.  మా చెల్లి స్వాతి, అమ్మ పాత ముక్కు పుడక స్థానే, తను బొంబాయిలో కొన్న మేలిమి వజ్రంతొ చేసిన ముక్కపుడక  చేయించింది.  'ఎవరు ముక్కు కుట్టించుకుంటె వాళ్ళకే ఈ వజ్రపు ముక్కు పుడక ' అని మా అమ్మ తమాషాగా అంటుండేది. ఒక్క  మా పెద్దక్క కూతురు కిరణ్ కి తప్ప   మా ఎవరికీ ముక్కుపడక పెట్టుకునే అలవాటులేదు,. అమ్మ చనిపొయె ముందు కిరణ్ ని తలుచుకుంది.  అమ్మ కోరిక మాకు అర్ధమయ్యింది.  అలా ఆ ముక్కు పుడక కిరణ్ కి దక్కింది.  అమ్మ మరికొంత కాలం జీవించి ఉంటె తప్పక బంగారు గాజులు చేయించుకునేదేమో.  కానీ ఆ చేతికి బంగారు గాజులు పడవలసిన అవసరం లేకుండా, మట్టిగాజులతొనే దర్జాగా వెళ్ళిపొయింది.   అదీ అమ్మ నగల కథ.

  ఈ సందర్భంలో నేను మా అమ్మ దగ్గరున్న వెండి సామాను గురించి కూడా చెప్పాలి. అమ్మ దగ్గర మా తాతగారు మా అమ్మ పెళ్ళికి పెట్టిన వెండి కంచం, మరచెంబు, గ్లాసు ఉండేవి.  పండగలప్పుడు వెండి గ్లాసులోనూ, వెండి గిన్నె లోనూ పయసం తాగడాన్ని చాలా  గొప్పగా భావించేవాళ్ళం, నేనూ, మా చెల్లీ.  వీటితొపాటు, మూడు గిన్నెల గుత్తీ, వెండి గిన్నెలూ, పన్నీరు బుడ్డీ ఉండేవి.   పండగలప్పుడు అమ్మ పుట్టింటినుంచి తెచ్చుకున్న కావిడి పెట్టెలోంచి అమ్మ వాటిని తీసేది.  వాటిని మేము మా వారసత్వ సంపదగ అనుకుని సరదా పడేవాళ్ళం.  మా అందరి పెళ్ళిళ్ళూ అయ్యాక అవన్నీ ఒక్కచోట, అంటే మా అన్నయ్య దగ్గర ఉంటే బాగుంటుందనుకునేవాళ్ళం.  కానీ అమ్మ అలా అనుకోలెదు.  తన గుర్తుగా అవి అందరూ పంచుకోవాలనుకుంది.  అందుకని అందరికన్నా పెద్ద,  అన్నయ్యకి కంచం ఇచ్చింది.  పూజలు పధ్ధతిగా , విధిగా చేస్తుందని, 'కలశం' పెట్టి పూజ చేసుకోమని పెద్దక్క విజయకి మర చెంబు ఇచ్చింది. నెమలి బొమ్మ అతికిన చిన్న కుంకుమ భరిణని చిన్నక్క హైమ ఎంచుకుంది.  తన చిన్నప్పుడు, పేరంటాలకీ, నోములకీ చుట్టు పక్కల ఆడవాళ్ళని పిలుచుకురమ్మని, అమ్మ హైమని పంపిస్తే ఆ భరిణతోనే అందరినీ పిలుచుకు వచ్చెదిట.  ఆ జ్ఞాపకాలతో హైమ ఆ  భరిణని ఎంచుకుంది.     చిన్నప్పుడు అన్నప్రాసన జరిగిన వెండి గిన్నె నాకు ఇచ్చింధి.  ఆర్టిస్టిక్ డెజైన్లంటే ఇష్టపడే స్వాతి పన్నీరు బుడ్డీ ఎంచుకుంది.  అ పన్నీరు బుడ్డిని ఒకపట్టాన ఎవరికీ ఇవ్వదది.  అలా ఇచ్చినప్పుడు ఎవరైనా పారేస్తె, మరొకటి కొనుక్కోగలను, కానీ నాకిదే కావాలి, పోతే రాదు కదా అంటుంది.  అంతిష్టం దానికదంటే.

  'బంగారాన్ని సాధించే సత్తా సంపాదించాలి గానీ, బంగారాన్ని కాదు ' అని ఎవరో అన్నారు.  అది  నిజంగా నిజం.

అమ్మ - స్నేహం

మా అమ్మ స్నేహ శీలి. స్నేహితుల్ని తనకు వాళ్ళిచ్చే 'మన్ననా మర్యద ' అనే కొలబద్దలతో కొలిచేది.   మానాన్న గారి ఉద్యోగరీత్యా మేము ఎన్నో ఊర్లు తిరిగేవాళ్ళం.  ఏ ఊర్లోనైనా ఇరుగు పొరుగులతోనూ, మేం అద్దెకున్న ఇల్లుగలవళ్ళతోనూ,  'నొప్పింపక ' 'తానొవ్వక ' అనే సూత్రంతో మెలిగేది.  ఎవరైనా తేడాగా మట్లాడుతున్నట్టు అనిపిస్తే వాళ్ళని దూరంగాపెట్టేసేది.  'డిప్లమసీ' మైంటైన్ చెయ్యమ్మా అని ఆమెకు అర్ధం అయ్యే భాషలో చెప్పినా, 'ముఖస్థుతి ' కోసం మాట్లాడకపోతే వచ్చిన నష్టమేంటి అనేసేది.  అందువల్ల ఆమెకు చాలా కొద్దిమందే ఐనా 'చాలా' విలువైన స్నెహితులు లభించేరు.

మొదటగా నెమలికన్ను శేషగిరిరావు గారూ, వారి భార్య మణెమ్మ గారి గురించి చెప్పుకోవాలి.   శేషగిరిరావు గారు పెందుర్తిలొ ఆరైగా పనిచేసేవారు.  నాన్నగారి సహోద్యోగి.  వీరి గురించి నా కన్నా, మా అన్నయ్య, అక్కయ్యలు విజయ  హైమలకే బాగా తెలుసు.  నాకు ఊహ తెలిసేసరికి మేము వేరే ఊరు వెళ్ళిపోయేము.  కాని అమ్మ తరుచూ వారినీ వారి అభిమనాన్ని తలుచుకొనేది.  తరువాతి కాలంలో వీరి కుటుంబం  విశాఖపట్నంలో ఉండగా అమ్మా నాన్నగారూ వెళ్ళి కలిసేరు.  వాళ్ళు కూడా పెద్దక్క పెళ్ళికి వచ్చేరు.

ఇక సర్వేశ్వరరావుగారు వారి భార్య మంగతాయారమ్మగారు మా అమ్మా నాన్నగారి జీవితంలో చాలా ముఖ్యులు.  సర్వేశ్వరరావుగారు స్థానం నరసిమ్హరావుగారి శిష్యులు.  ఈ ఫ్యామిలీ,  కొట ఉరట్లలో మా నాన్నగారు పనిచేసేటప్పటి స్నేహితులు.  అప్పట్లో వారికి పిల్లలు లేరు.  మా అక్కయ్యల్నీ, అన్నయ్యనీ ఇంకా ఇరుగు పొరుగు పిల్లల్నీ పోగు చేసి, కథలూ, జనరల్ నాలెడ్జ్ విషయాలూ చెప్పేవారుట.  సర్వేశ్వర్రావు గారు అమ్మని 'అక్కయ్యగారూ' అని సంబోధించేవారు.  వీరికి ఉన్న నిష్కళంక మనస్తత్వం,  పిల్లల మీద ఉన్న కడు ప్రేమ వల్ల తరువాతి కాలంలో వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఒక మగపిల్లవాడు కలిగేరు.  వీరు తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డారు.  ఇటీవలి కాలం వరకూ వారితో నాన్నగారికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుండేవి.


తరువాత అమ్మకి ఎంతో ఇష్టమైన ఒక స్నేహితురాలి గురించి చెప్పాలి.  ఆమె తమిళులు.  పాడేరు కాఫీ బోర్డు ఆఫీసర్ గారి భార్య.  ఆవిడకి తెలుగు రాదు.   అమ్మకి తమిళం రాదు. ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు.   వారిద్దర్నీ కలిపింది త్యాగరాజస్వామే.  ఆవిడకి కర్నాటక సంగీతం బాగా వచ్చు.  త్యాగరాజ కీర్తనలు,  ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు చాలా శ్రావ్యంగా పాడేవారు. పేరంటాలూ మహిళా మండలి మీటింగుల్లో ఆఖరువరకూ వేచి ఉండి అమ్మకి నచ్చిన పాట అమ్మకోసం ప్రత్యేకంగా పాడి వెళ్ళేవారు.  ఒకసారి వాళ్ళింటికి బంధువులొచ్చే సందర్భం. ఆవిడేమో ఇంట్లోకి రాకూడదు. అప్పట్లో పట్టింపులు కదా.  ఇబ్బందిలో సాయం చేయకపోతే స్నేహం ఎందుకు.  అమ్మ నన్నూ, చిన్నక్క హైమనీ వాళ్ళింటికి పంపింది.  మేము, మరొక అమ్మాయితొ కలిసి బృందంగా వెళ్ళి వాళ్ళింట్లో ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి, అన్నం వండి, కూర చేసి, టమాటా చారు చేసాం.  తమిళులు చారు ఎంత బాగా  చేస్తారో తెలుసుకున్నాం.  ఒక సారి చిన్న ఫంక్షన్ సందర్భంగా మా ఇంట్లో పాటల పోటీలు జరిగాయి. అమ్మ న్యాయ నిర్ణేత.    మొదటి బహుమతి ఈ తమిళ మామి గారిదే.  రెండవ బహుమతి ఒక క్రైస్తవ గీతానికి.  మూడవ బహుమతి ఒక పాత తెలుగు సినిమా మాటకి.  ఈ తమిళ అయ్యంగారి మహిళతో అమ్మ స్నేహం చాలా సున్నితంగా అందంగా ఉండేది.

అమ్మ స్నేహితుల బాధల్నీ, కష్టాల్నీ వాళ్ళ కోణంలో ఎలా అర్ధం చేసుకునేదో చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్తా.

మేము కొట ఉరట్లలో ఉండెటప్పుడు సీతారమయ్యగారని ఒక ఎక్సిక్యూటివ్ ఆఫిసర్ ఉండేవారు.  ఆయన సతీమని అందరితో స్నేహంగా ఉండేవారు, అందరూ తనతో అలా ఉండాలని అభిలషించేవారు.  ఒక రోజు ఆవిడ మా ఇంటికి వచ్చి కూర్చుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు.  ఏమైందండీ అని అమ్మ అరా తీస్తే చెప్పుకొచ్చేరావిడ.  ఒకావిడ పేరంటానికని పిలిచి, బొట్టు పెట్టకుండా, వాయనం ఇవ్వకుండా' దూరంగా పక్కన పెట్టి రెండూ తీసుకోమన్నారట.  అది ఆవిడ జాతిని ఎత్తి చూపించే ప్రయత్నం.  అది ఆవిడకి అవమానమనిపించి బాధతో బయటికి వచ్చేసి ఆ బాధని  దించుకొవాడానికి అమ్మ దగ్గరికి వచ్చారు.    అమ్మ అవిడని ఊరుకోమని చెప్పి 'భర్తల ఉద్యోగరీత్యా అందరం ఒకచోట బతుకుతూ, ఇలాంటి పనులేంటని ' అలాంటి వాళ్ళ మీద చిరాకు పడి, ఆవిడకి బొట్టు, తాంబూలం ఇచ్చి పంపింది.  అమ్మ మీద ఎంత నమ్మకం లేకపొతే ఆవిడ అలా అమ్మ దగ్గరికి వస్తుందని మేము పిల్లలందరం అమ్మ గురించి చాలా గొప్పగా ఫీల్ అయ్యాము.  తరువాత ఒక పిక్నిక్ లో అమ్మ మాలో ఒకరిని (ఎవరో గుర్తు లేదు) ఆవిడ పక్కన కూర్చోపెట్టి తన నిజాయితీని నిరూపించుకొంది.  
ఆఖరుగా మా అమ్మ స్నేహానికి ఇచ్చే విలువా, స్నేహితురాలి బాధని అర్ధం చేసుకునే మనసూ తెలియాలంటే, మా చెల్లి స్వాతి చెప్పిన ఒక సంఘటన గురించి చెప్పాలి. స్వాతి మాటల్లొనే చెప్తా.

' నేనొక సారి హైదరాబాదులో ఒక పెళ్ళికి
వెళ్ళినప్పుడు, అక్కడ అమ్మతో ఒకావిడ అదే పనిగా మట్లాడుతూ ఉంటే చూసాను.  అమ్మని మరొకళ్ళతో మట్లాడే అవకాశమే ఇవ్వడం లేదావిడ.  ఆ మనిషినీ ఆ అర్ధంలేని వాగుడినీ చూస్తే చిరాకేసింది.  అమ్మని పక్కకి పిలిచి చెప్పాను.  'అమ్మా, ఎవరావిడ అలా వాగుతోంది, వదిలేసి వచ్చేయి ' అని చిరాకు పడ్డాను.  'అయ్యో అలా అనకమ్మా, అది నా చిన్నప్పటి స్నేహితురాలు.  చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేది, మాతో ఆడుకునేది.  పాపం దానికి చాలా చిన్నప్పుడే  పెళ్ళి చెసేసారు.  పాపం, దాని మొగుడు కొజ్జా వాడు.  అలాంటి మొగుడూ, పిల్లా పీచూ లేకపోతే  ఎవరైనా ఇలాగే అయిపోతారు.  ఏమి  జీవితం దానిది పాపం.  అందుకే పాత కబుర్లేవో చెప్తుంటే దానికి  కాస్త ఆనందం కలుగుతుందని వింటున్నా'.  స్నేహితురాలి  గురించి చెప్తుంటే అమ్మ ముఖంలో ఏదో బాధ.  నాకింక మాట రాలెదు.  నాక్కూడా బాధనిపించి అక్కడ్నించి వెళ్ళిపోయాను '.  తరువాత ఎదో సందర్భంలో స్వాతి నాకు ఈ విషయం చెప్పింది.  అమ్మ ఆడవాళ్ళ విషయంలో ఎంతో మానవత్వంతోనూ, స్నేహితురాలి విషయంలో ఎంతో ఆర్తితోనూ స్పందించినతీరు చాలు, అమ్మ స్నేహానికి ఎంత విలువనిచ్చేదో  తెలియడానికి.

అలా, నాన్నగారి ఉద్యోగరీత్యా ఊళ్ళన్నీ తిరుగుతుండడంచేత, మా అమ్మ స్నేహాలు కులం, మతం, భాషలకి అతీతంగా ఉండేవి.
 ఈ పోస్టు పబ్లిష్ అయిన తరువాత మా చిన్నక్క చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ పొందు పరుస్తున్నా.  మేము కశింకోటలో ఉండేటప్పుడు మా నాన్నగారికి చాలా చికాకు చేసింది.  ఆయన రెండు నెలలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచం పట్టేసారు.  ఆయనకున్న స్మోకింగ్ అలవాటువల్ల లంగ్స్ బాగా ఇన్ ఫెక్ట్ అయి, ఎకంగా రెండు నెలలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచం పట్టేసారు. ఆయనకేమవుతుందోనని అమ్మ చాలా బెంగ పెట్టుకుంది.  ఆ రోజుల్లో అంత చిన్న ఊరిలో ప్రెత్యేక శ్రద్ధ చూపించే డాక్టరు ఎక్కడ దొరుకుతారు.  అప్పుడు అమ్మకి తోడుగా నిలిచింది స్నేహితులే.  మా ఇంటి వెనక కాశీభట్ల వారి కోడలు రత్నం గారు అమ్మకి మంచి స్నేహితురాలు.  ఆవిడ మరిదిగారు ఆ ఊర్లో మంచి పేరున్న డాక్టరు గారు.  ఆయన్ని చంటి డాక్టరు గారని పిలిచేవారు.  రత్నం గారి చలువ వల్ల ఆ చంటి డాక్టరు గారు ప్రతిరోజూ ఇంటికే వచ్చి నాన్నగారి పరీక్షించి, మందులు ఇచ్చి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బు తగ్గేటట్టు చేసారు.  నిజానికి మా నాన్నగారిని మాకు ప్రాణాలతో దక్కించారు.  ఆ రెండు నెలలూ, మళ్ళీ నాన్నగారు అరోగ్యంగా లేచి తిరిగేవరకూ అమ్మ విపరీతంగా టెన్షన్
పడింది.   ఆయన్ని అలా దక్కించినందుకు అ రత్నం గారు, అ చంటి డాక్టరు వారి భార్య బేబీ గార్లని అమ్మ ఎంతో కృతజ్ఞతతో జీవితాంతం తలుచుకునేది.  వీళ్ళు అమ్మకి ఎంతో ముఖ్యులు అవడం వల్ల మా చిన్నక్క వాళ్ళ గురించి వివరంగా చెప్పడంతో ఈ విషయం నా పోస్టుకి జత చేసాను.