14, నవంబర్ 2010, ఆదివారం

అమ్మ నగలు

  ఈపాటికి మా అమ్మ ఒక సామాన్య గృహిణి అని మీకు అర్ధమయ్యేఉంటుంది.  ఆమెకు  ఏడువారాల నగలు కానీ రత్నహారాలు కానీ ఉండి ఉంటాయని మీరనుకుని ఉండరని భావిస్తా. అయినా అమ్మ నగలు గురించి ఎందుకు వ్రాయాల్సి వచ్చిందో ఒకసారి ఇలా చూడండి.

  మా అమ్మకి ఒకప్పుడు పుట్టింటివారు పెట్టిన  చంద్రహారం, గాజులూ అత్తింటివారు పెట్టిన  జిగినీ గొలుసూ, ఉండేవట.  మంగళ సూత్రాలు వేసుకోనే నానుతాడు మా అమ్మ పెళ్ళికి ముందు నుంచీ వేసుకొనేదిట.  కానీ అర్ధికావసరాలకోసం వాటినన్నిటినీ అమ్ముకోవలసివచ్చింది.   ఆర్ధికమాంద్యం ఉన్న ఆ రోజుల్లో సామాన్య కుటుంబాల్లో అది సర్వ సాధారణం.
నాకు ఊహ తెలిసి, మా అమ్మకి తొమ్మిది రాళ్ళ దుద్దులు, ముక్కున మూడు రాళ్ళ  ముక్కు పుడక ఉండేవి. ఈ రెండూ లేకుండా అమ్మ ముఖం నాకు గుర్తుకు రాదు.  అవేం రాళ్ళోకానీ, జాతి రత్నాల్లా మెరిసేవవి.  ఇక మెడలో నానుతాడు, దారానికి గుచ్చిన నల్లపూసలూ తప్ప ఇంకేమీ ఉండేవి కాదు.  మా అమ్మ మమ్మల్నందర్నీ ముద్దుగా పెంచడం వల్లా, మాతో ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడడం వల్లా, ఎప్పుడూ అంచులున్న నేత జరీ చీరలే ధరించడంవల్లా, ఆమె మాకెప్పుడూ అందంగా, హుందాగా కనిపించేది.  అమ్మకి భాషణమే భూషణమయ్యింది.  

  మేము నలుగురం ఆడపిల్లలవడంచేతా, అందరికీ పెళ్ళి సందర్భంగా కనీస బంగారం కొనవలసి రావడం చేతా, బహుశా తనకంటూ ఏమీ చేయించుకోలెకపోయింది.

  అమ్మ చేతికి ఎప్పుడూ మట్టిగాజులే ఉండేవి.  అవికూడా తనకు నప్పే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులే ఎంచుకునేది.  వాటికెప్పుడూ చిన్న మెరుపు ఉండేది.  అవి ఏ మాత్రం మాసినా వెంటనే మార్చేసేది. కొత్త గాజులు మాచేత తనకు నచ్చిన రంగువి తెప్పించుకొని చేతికి సబ్బు రాసుకుని ఎక్కించుకొని రెండు చేతులూ తను ఒకసారి చూసుకొని మాకు  చూపించి 'బాగున్నాయమ్మా ' అనేది. నా చిన్నప్పుడు మా అమ్మ పెరట్లో రుబ్బురోట్లో పచ్చడి కానీ, పిండి కానీ రుబ్బుతుంటే వచ్చే గాజుల శబ్దం నాకిప్పటికీ గుర్తే.

  నాకూ, మా చెల్లి స్వాతికీ ఉద్యోగాలొచ్చేక మా అమ్మకి గాజులు చెయించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసేవాళ్ళం.
కానీ అమ్మ అనేది.  'ముందు మీ పెళ్ళిళ్ళు కావాలి.  డబ్బులుంటే దాచుకోండి. నాకిప్పుడు గాజులు లేకపోతే వచ్చే నష్టమేమీ  లేదు ' అని కేకలేసేది.  అలా ఆ ఆలోచన పక్కన పడేది.

  ఇన్వెస్ట్మెంట్ అనే మాట కానీ ఆలోచనగానీ లేని రోజుల్లో మా నాన్నగారు 247 చ. గ. స్థలం ఒకటి కొన్నారు.  కొన్న చాలాకాలం తరవాత, ఆ జాగాని రక్షించుకోవడం కష్టమనే ఆలోచనతోనూ  రేటు బాగా రవాడంతోనూ దాన్ని అమ్మేసారు.  వేలల్లో కొన్న జాగాకి లక్షల్లో రావడంతో అమ్మా నాన్నగారూ ఇద్దరూ చాలా ఆనందపడ్డారు.   అంత డబ్బు చేతిలొకి వచ్చినాకూడా అమ్మ తనకి కాసు బంగారమైనా  కొనుక్కొవాలన్న ఆలోచనే చెయ్యకుండా, నలుగురు కూతుళ్ళకీ, కోడలికీ తలా ఒక రెండు తులాలూ బంగారం కొంది.


  మా చెల్లి స్వాతి తనకు బంగారం వద్దని తిరిగి ఇచ్చేస్తే, అదికూడా తను తీసుకోకుండా, గొలుసు చేయించి  మనమరాలి పెళ్ళికని దాచి, ఆ పెళ్ళిలొ మనమరాలి మెడలో వేసింది.

  అందరూ ఆర్ధికంగా స్థిరపడ్డాక,  వాళ్ళ డబ్బుతో ఇంకెవరికీ అవసరం లేదనిపించాక, ఒక సందర్భంలో అమ్మ గాజులు  చేయించుకోవాలనే ఆలొచన చేసింది.  అదే సమయంలో నాన్నగారి ఆరొగ్యంలో ఒక్కసారిగా తేడా వచ్చింది.  దాంతో ఆ ఆలోచన మరిచిపోయింది.  మా అన్నయ్య కూతురు, వైదెహి పెళ్ళికి ముందు, అమ్మ నానుతాడులోని బంగారం పోగులు చిట్లి మెడకు గుచ్చుకొని  బాధపడుతుంటే, మా చెల్లి స్వాతి గమనించి 'అమ్మా మార్చేస్తాను ఇచ్చెయ్యి '  అంటూ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని నన్ను కూడా తీసుకుని వెళ్ళి పాత గొలుసు మార్చేసి కొత్త గొలుసు  తీసుకుంది.  కానీ అది నానుతాడు కాదు.  వేరొక డిజైన్ లో ఉంది. అమ్మ కొంచెం నిరాశపడ్డా, సంతోషంగానే నాన్నగారికి చూపించింది.  అమ్మ సంతొషం చూసి నాన్నగారు, 'నెమ్మదిగా గాజులు కూడా కొనుక్కో' అన్నారు.

  ఇక అమ్మ ముక్కు పుడక గురించి కూడా చిన్న మాట చెప్పాలి.  మా చెల్లి స్వాతి, అమ్మ పాత ముక్కు పుడక స్థానే, తను బొంబాయిలో కొన్న మేలిమి వజ్రంతొ చేసిన ముక్కపుడక  చేయించింది.  'ఎవరు ముక్కు కుట్టించుకుంటె వాళ్ళకే ఈ వజ్రపు ముక్కు పుడక ' అని మా అమ్మ తమాషాగా అంటుండేది. ఒక్క  మా పెద్దక్క కూతురు కిరణ్ కి తప్ప   మా ఎవరికీ ముక్కుపడక పెట్టుకునే అలవాటులేదు,. అమ్మ చనిపొయె ముందు కిరణ్ ని తలుచుకుంది.  అమ్మ కోరిక మాకు అర్ధమయ్యింది.  అలా ఆ ముక్కు పుడక కిరణ్ కి దక్కింది.  అమ్మ మరికొంత కాలం జీవించి ఉంటె తప్పక బంగారు గాజులు చేయించుకునేదేమో.  కానీ ఆ చేతికి బంగారు గాజులు పడవలసిన అవసరం లేకుండా, మట్టిగాజులతొనే దర్జాగా వెళ్ళిపొయింది.   అదీ అమ్మ నగల కథ.

  ఈ సందర్భంలో నేను మా అమ్మ దగ్గరున్న వెండి సామాను గురించి కూడా చెప్పాలి. అమ్మ దగ్గర మా తాతగారు మా అమ్మ పెళ్ళికి పెట్టిన వెండి కంచం, మరచెంబు, గ్లాసు ఉండేవి.  పండగలప్పుడు వెండి గ్లాసులోనూ, వెండి గిన్నె లోనూ పయసం తాగడాన్ని చాలా  గొప్పగా భావించేవాళ్ళం, నేనూ, మా చెల్లీ.  వీటితొపాటు, మూడు గిన్నెల గుత్తీ, వెండి గిన్నెలూ, పన్నీరు బుడ్డీ ఉండేవి.   పండగలప్పుడు అమ్మ పుట్టింటినుంచి తెచ్చుకున్న కావిడి పెట్టెలోంచి అమ్మ వాటిని తీసేది.  వాటిని మేము మా వారసత్వ సంపదగ అనుకుని సరదా పడేవాళ్ళం.  మా అందరి పెళ్ళిళ్ళూ అయ్యాక అవన్నీ ఒక్కచోట, అంటే మా అన్నయ్య దగ్గర ఉంటే బాగుంటుందనుకునేవాళ్ళం.  కానీ అమ్మ అలా అనుకోలెదు.  తన గుర్తుగా అవి అందరూ పంచుకోవాలనుకుంది.  అందుకని అందరికన్నా పెద్ద,  అన్నయ్యకి కంచం ఇచ్చింది.  పూజలు పధ్ధతిగా , విధిగా చేస్తుందని, 'కలశం' పెట్టి పూజ చేసుకోమని పెద్దక్క విజయకి మర చెంబు ఇచ్చింది. నెమలి బొమ్మ అతికిన చిన్న కుంకుమ భరిణని చిన్నక్క హైమ ఎంచుకుంది.  తన చిన్నప్పుడు, పేరంటాలకీ, నోములకీ చుట్టు పక్కల ఆడవాళ్ళని పిలుచుకురమ్మని, అమ్మ హైమని పంపిస్తే ఆ భరిణతోనే అందరినీ పిలుచుకు వచ్చెదిట.  ఆ జ్ఞాపకాలతో హైమ ఆ  భరిణని ఎంచుకుంది.     చిన్నప్పుడు అన్నప్రాసన జరిగిన వెండి గిన్నె నాకు ఇచ్చింధి.  ఆర్టిస్టిక్ డెజైన్లంటే ఇష్టపడే స్వాతి పన్నీరు బుడ్డీ ఎంచుకుంది.  అ పన్నీరు బుడ్డిని ఒకపట్టాన ఎవరికీ ఇవ్వదది.  అలా ఇచ్చినప్పుడు ఎవరైనా పారేస్తె, మరొకటి కొనుక్కోగలను, కానీ నాకిదే కావాలి, పోతే రాదు కదా అంటుంది.  అంతిష్టం దానికదంటే.

  'బంగారాన్ని సాధించే సత్తా సంపాదించాలి గానీ, బంగారాన్ని కాదు ' అని ఎవరో అన్నారు.  అది  నిజంగా నిజం.

6 కామెంట్‌లు:

  1. జ్యోతీ,
    మీకు ఓరల్ స్కిల్ అంత లేదని రాసినట్టున్నారు. అది పచ్చి అబద్ధం. ఎంతో అద్భుతంగా,ఆర్ద్రంగా రాయగలరనేదే నిజం. ఇలాగే కొనసాగించండి. చాలా బావున్నాయి -మీరు చెప్పే విషయాలు, చెప్పిన విధానం కూడా.

    రిప్లయితొలగించండి
  2. ఇక చాలు అన్న పదం మా అమ్మ దగ్గిర తప్ప ఇంకెక్కడా నేను వినలేదు.

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. lovely times of life will not return back ever but lovely relation and the missing memories of lovely parents will stay in heart forever. prasad

    రిప్లయితొలగించండి
  5. మీరు , మీ అమ్మగారిని తలుచుకుంటున్న విధానం చాలా బాగుందండి . మంచి సంగతులు చెపుతున్నారు .

    రిప్లయితొలగించండి
  6. నీ అమ్మ నగలు అనే టపా చదివేను. చాలా బాగా రాసేవు.
    ఆ మధ్య మీ విజయక్క నగలన్నీ ( ఉన్నవే అనుకో) పోయినపకపుడు మీ అక్క మిగతా వాటి కంటె అమ్మ ఇచ్చిన గొలుసు పోయిందే అని ఒక్కలా బాధ పడింది.నిగమ శర్మ అక్క తమ్ముడు అన్నీ దోచుకు పోయినా ఒక ముక్కెర కోసం ఏడిచినట్టుగా.... ఆతర్వాత వారం రోజులకే నగలన్నీ దొరికినప్పుడు కూడా మీ అక్క మా అమ్మ ఇచ్చింది అందుకే దొరికింది అంటూ మురిసి పోయింది.

    నిజమే, మీ అమ్మ గారుఏ నాడూ ఆడంబరాలకి పోలేదు. ఇతరుల
    సుఖమే కానీ తన సుఖం ఏనాడూ చూసుకో లేదు.


    ఆవిడ మనసు ఒకఅపురూపమైన నగ. నువ్వు చెప్పినట్టుగా, చక్కని ఆత్మీయమైన భాషణమే ఆవిడకి వెల కట్ట లేని భూషణంగా విలసిల్లింది.

    నా మట్టుకు నాకు మా అమ్మ, అత్త ఇద్దరూ దైవ స్వరూపాలు.

    రిప్లయితొలగించండి