మొదటగా నెమలికన్ను శేషగిరిరావు గారూ, వారి భార్య మణెమ్మ గారి గురించి చెప్పుకోవాలి. శేషగిరిరావు గారు పెందుర్తిలొ ఆరైగా పనిచేసేవారు. నాన్నగారి సహోద్యోగి. వీరి గురించి నా కన్నా, మా అన్నయ్య, అక్కయ్యలు విజయ హైమలకే బాగా తెలుసు. నాకు ఊహ తెలిసేసరికి మేము వేరే ఊరు వెళ్ళిపోయేము. కాని అమ్మ తరుచూ వారినీ వారి అభిమనాన్ని తలుచుకొనేది. తరువాతి కాలంలో వీరి కుటుంబం విశాఖపట్నంలో ఉండగా అమ్మా నాన్నగారూ వెళ్ళి కలిసేరు. వాళ్ళు కూడా పెద్దక్క పెళ్ళికి వచ్చేరు.
ఇక సర్వేశ్వరరావుగారు వారి భార్య మంగతాయారమ్మగారు మా అమ్మా నాన్నగారి జీవితంలో చాలా ముఖ్యులు. సర్వేశ్వరరావుగారు స్థానం నరసిమ్హరావుగారి శిష్యులు. ఈ ఫ్యామిలీ, కొట ఉరట్లలో మా నాన్నగారు పనిచేసేటప్పటి స్నేహితులు. అప్పట్లో వారికి పిల్లలు లేరు. మా అక్కయ్యల్నీ, అన్నయ్యనీ ఇంకా ఇరుగు పొరుగు పిల్లల్నీ పోగు చేసి, కథలూ, జనరల్ నాలెడ్జ్ విషయాలూ చెప్పేవారుట. సర్వేశ్వర్రావు గారు అమ్మని 'అక్కయ్యగారూ' అని సంబోధించేవారు. వీరికి ఉన్న నిష్కళంక మనస్తత్వం, పిల్లల మీద ఉన్న కడు ప్రేమ వల్ల తరువాతి కాలంలో వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఒక మగపిల్లవాడు కలిగేరు. వీరు తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఇటీవలి కాలం వరకూ వారితో నాన్నగారికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుండేవి.
తరువాత అమ్మకి ఎంతో ఇష్టమైన ఒక స్నేహితురాలి గురించి చెప్పాలి. ఆమె తమిళులు. పాడేరు కాఫీ బోర్డు ఆఫీసర్ గారి భార్య. ఆవిడకి తెలుగు రాదు. అమ్మకి తమిళం రాదు. ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు. వారిద్దర్నీ కలిపింది త్యాగరాజస్వామే. ఆవిడకి కర్నాటక సంగీతం బాగా వచ్చు. త్యాగరాజ కీర్తనలు, ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు చాలా శ్రావ్యంగా పాడేవారు. పేరంటాలూ మహిళా మండలి మీటింగుల్లో ఆఖరువరకూ వేచి ఉండి అమ్మకి నచ్చిన పాట అమ్మకోసం ప్రత్యేకంగా పాడి వెళ్ళేవారు. ఒకసారి వాళ్ళింటికి బంధువులొచ్చే సందర్భం. ఆవిడేమో ఇంట్లోకి రాకూడదు. అప్పట్లో పట్టింపులు కదా. ఇబ్బందిలో సాయం చేయకపోతే స్నేహం ఎందుకు. అమ్మ నన్నూ, చిన్నక్క హైమనీ వాళ్ళింటికి పంపింది. మేము, మరొక అమ్మాయితొ కలిసి బృందంగా వెళ్ళి వాళ్ళింట్లో ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి, అన్నం వండి, కూర చేసి, టమాటా చారు చేసాం. తమిళులు చారు ఎంత బాగా చేస్తారో తెలుసుకున్నాం. ఒక సారి చిన్న ఫంక్షన్ సందర్భంగా మా ఇంట్లో పాటల పోటీలు జరిగాయి. అమ్మ న్యాయ నిర్ణేత. మొదటి బహుమతి ఈ తమిళ మామి గారిదే. రెండవ బహుమతి ఒక క్రైస్తవ గీతానికి. మూడవ బహుమతి ఒక పాత తెలుగు సినిమా మాటకి. ఈ తమిళ అయ్యంగారి మహిళతో అమ్మ స్నేహం చాలా సున్నితంగా అందంగా ఉండేది.
అమ్మ స్నేహితుల బాధల్నీ, కష్టాల్నీ వాళ్ళ కోణంలో ఎలా అర్ధం చేసుకునేదో చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్తా.
మేము కొట ఉరట్లలో ఉండెటప్పుడు సీతారమయ్యగారని ఒక ఎక్సిక్యూటివ్ ఆఫిసర్ ఉండేవారు. ఆయన సతీమని అందరితో స్నేహంగా ఉండేవారు, అందరూ తనతో అలా ఉండాలని అభిలషించేవారు. ఒక రోజు ఆవిడ మా ఇంటికి వచ్చి కూర్చుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. ఏమైందండీ అని అమ్మ అరా తీస్తే చెప్పుకొచ్చేరావిడ. ఒకావిడ పేరంటానికని పిలిచి, బొట్టు పెట్టకుండా, వాయనం ఇవ్వకుండా' దూరంగా పక్కన పెట్టి రెండూ తీసుకోమన్నారట. అది ఆవిడ జాతిని ఎత్తి చూపించే ప్రయత్నం. అది ఆవిడకి అవమానమనిపించి బాధతో బయటికి వచ్చేసి ఆ బాధని దించుకొవాడానికి అమ్మ దగ్గరికి వచ్చారు. అమ్మ అవిడని ఊరుకోమని చెప్పి 'భర్తల ఉద్యోగరీత్యా అందరం ఒకచోట బతుకుతూ, ఇలాంటి పనులేంటని ' అలాంటి వాళ్ళ మీద చిరాకు పడి, ఆవిడకి బొట్టు, తాంబూలం ఇచ్చి పంపింది. అమ్మ మీద ఎంత నమ్మకం లేకపొతే ఆవిడ అలా అమ్మ దగ్గరికి వస్తుందని మేము పిల్లలందరం అమ్మ గురించి చాలా గొప్పగా ఫీల్ అయ్యాము. తరువాత ఒక పిక్నిక్ లో అమ్మ మాలో ఒకరిని (ఎవరో గుర్తు లేదు) ఆవిడ పక్కన కూర్చోపెట్టి తన నిజాయితీని నిరూపించుకొంది.
ఆఖరుగా మా అమ్మ స్నేహానికి ఇచ్చే విలువా, స్నేహితురాలి బాధని అర్ధం చేసుకునే మనసూ తెలియాలంటే, మా చెల్లి స్వాతి చెప్పిన ఒక సంఘటన గురించి చెప్పాలి. స్వాతి మాటల్లొనే చెప్తా.
' నేనొక సారి హైదరాబాదులో ఒక పెళ్ళికి
వెళ్ళినప్పుడు, అక్కడ అమ్మతో ఒకావిడ అదే పనిగా మట్లాడుతూ ఉంటే చూసాను. అమ్మని మరొకళ్ళతో మట్లాడే అవకాశమే ఇవ్వడం లేదావిడ. ఆ మనిషినీ ఆ అర్ధంలేని వాగుడినీ చూస్తే చిరాకేసింది. అమ్మని పక్కకి పిలిచి చెప్పాను. 'అమ్మా, ఎవరావిడ అలా వాగుతోంది, వదిలేసి వచ్చేయి ' అని చిరాకు పడ్డాను. 'అయ్యో అలా అనకమ్మా, అది నా చిన్నప్పటి స్నేహితురాలు. చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేది, మాతో ఆడుకునేది. పాపం దానికి చాలా చిన్నప్పుడే పెళ్ళి చెసేసారు. పాపం, దాని మొగుడు కొజ్జా వాడు. అలాంటి మొగుడూ, పిల్లా పీచూ లేకపోతే ఎవరైనా ఇలాగే అయిపోతారు. ఏమి జీవితం దానిది పాపం. అందుకే పాత కబుర్లేవో చెప్తుంటే దానికి కాస్త ఆనందం కలుగుతుందని వింటున్నా'. స్నేహితురాలి గురించి చెప్తుంటే అమ్మ ముఖంలో ఏదో బాధ. నాకింక మాట రాలెదు. నాక్కూడా బాధనిపించి అక్కడ్నించి వెళ్ళిపోయాను '. తరువాత ఎదో సందర్భంలో స్వాతి నాకు ఈ విషయం చెప్పింది. అమ్మ ఆడవాళ్ళ విషయంలో ఎంతో మానవత్వంతోనూ, స్నేహితురాలి విషయంలో ఎంతో ఆర్తితోనూ స్పందించినతీరు చాలు, అమ్మ స్నేహానికి ఎంత విలువనిచ్చేదో తెలియడానికి.
అలా, నాన్నగారి ఉద్యోగరీత్యా ఊళ్ళన్నీ తిరుగుతుండడంచేత, మా అమ్మ స్నేహాలు కులం, మతం, భాషలకి అతీతంగా ఉండేవి.
ఈ పోస్టు పబ్లిష్ అయిన తరువాత మా చిన్నక్క చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ పొందు పరుస్తున్నా. మేము కశింకోటలో ఉండేటప్పుడు మా నాన్నగారికి చాలా చికాకు చేసింది. ఆయన రెండు నెలలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచం పట్టేసారు. ఆయనకున్న స్మోకింగ్ అలవాటువల్ల లంగ్స్ బాగా ఇన్ ఫెక్ట్ అయి, ఎకంగా రెండు నెలలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచం పట్టేసారు. ఆయనకేమవుతుందోనని అమ్మ చాలా బెంగ పెట్టుకుంది. ఆ రోజుల్లో అంత చిన్న ఊరిలో ప్రెత్యేక శ్రద్ధ చూపించే డాక్టరు ఎక్కడ దొరుకుతారు. అప్పుడు అమ్మకి తోడుగా నిలిచింది స్నేహితులే. మా ఇంటి వెనక కాశీభట్ల వారి కోడలు రత్నం గారు అమ్మకి మంచి స్నేహితురాలు. ఆవిడ మరిదిగారు ఆ ఊర్లో మంచి పేరున్న డాక్టరు గారు. ఆయన్ని చంటి డాక్టరు గారని పిలిచేవారు. రత్నం గారి చలువ వల్ల ఆ చంటి డాక్టరు గారు ప్రతిరోజూ ఇంటికే వచ్చి నాన్నగారి పరీక్షించి, మందులు ఇచ్చి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బు తగ్గేటట్టు చేసారు. నిజానికి మా నాన్నగారిని మాకు ప్రాణాలతో దక్కించారు. ఆ రెండు నెలలూ, మళ్ళీ నాన్నగారు అరోగ్యంగా లేచి తిరిగేవరకూ అమ్మ విపరీతంగా టెన్షన్
పడింది. ఆయన్ని అలా దక్కించినందుకు అ రత్నం గారు, అ చంటి డాక్టరు వారి భార్య బేబీ గార్లని అమ్మ ఎంతో కృతజ్ఞతతో జీవితాంతం తలుచుకునేది. వీళ్ళు అమ్మకి ఎంతో ముఖ్యులు అవడం వల్ల మా చిన్నక్క వాళ్ళ గురించి వివరంగా చెప్పడంతో ఈ విషయం నా పోస్టుకి జత చేసాను.
Very well written jyothi. Beautiful nostalgia.
రిప్లయితొలగించండిI feel like reading it again and again.
చాలా బాగా రాసేవు. ఒక ఉదాత్త మనస్తత్వం ఇందులో ఆవిష్కృతమైంది. డబ్బు, హోదా, జాతి, కులం, మతం, ఇలాంటి వాటికి కాక, మనిషితనానికి పెద్ద పీట వేసిన వ్యక్తి ఆమె.
రిప్లయితొలగించండిమీ అమ్మ గారికి పెళ్ళిసంబంధం మా నాన్న చూసారని తెగ ముచ్చట పడి పోతూ నాతో తరుచుగా అంటూ ఉండే వారు. రక్త సంబంధానికి అతీతమైన అన్నా చెళ్ళెళ్ళ అనుబంధం వారిది అనిపించేలా ఇద్దరూ మసలు కునే వారు.
మా నాన్న కూడా జాతి, కుల, మతాల కంటె మనిషితనానికి ప్రథమ స్థానం ఇచ్చే వారనడానికి నికార్సయిన, ఉదాత్తమైన సంఘటన ఒకటి చెబుతాను ....
ఓ వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం నాతో ఏదో పని మీద వచ్చిన మా కొలీగ్ సుందర రావు అనే
వ్యక్తికి బలవంతం చేసి మరీ మాతో పాటూ భోజనానికి కూర్చో పెట్టి గౌరవించేరు నాన్న.
ఆ వేసవి మధ్యాహ్నం వేళ నాతో పని చూసుకుని, వెళ్ళడానికి లేచిన ఆ సుందర రావు గారితో నాన్న, ఎండ మండి పోతోంది. ఈ సమయంలో అభోజనంగా వెళ్ళడమేమిటి, రండి, భోజనం చేసి, ఎండ చల్ల బడ్డాక వోళుదురు గాని అన్నారు. ఆవ్యక్తి నిర్ఘాంత పోయేరు. కారణం బ్రాహ్మణులమైన మాయింట జాతి కారణంగా తను తిన రాదేమోననే ఆత్మన్యూనతాభావం చేత.
వద్దండీ, వెళతాను అన్నారతను. నాన్న వదల్లేదు. దెబ్బలాడి మరీ ఒప్పించి, అమ్మా, విజయా ముట్టురికీ వడ్డించమ్మా, అంటూ మీ అక్కతో అన్నారు.
ఆ మధ్యాహ్నం మా నట్టింట కంచాల్లో నాన్న, నేనూ, సుందర రావు గారూ సహసంక్తి భోజనం చేసాం. భోజనం చేస్తున్నంత సేపూ సుందర రావు గారి కళ్ళు చెమరుస్తూ ఉండడం నాకింకా గుర్తు. భోజనాలయ్యేక, ఎండ తగ్గేక ఆయన నాన్నకి రెండు చేతులూ జోడించి శలవు తీసుకుని వెళ్ళి పోయేరు.
అప్పుడు నేను, నాన్నతో సుందర రావు జాతి నాన్నకి తెలియక అతనిని భోజనానికి ఉంచేసేరేమో అని భావించి, నాన్నతో ... నాన్నా, ఆయన ... అంటూ ఏదో చెప్ప బోయేను. అప్పుడు నాన్న నవ్వి, నేను ఏం చెప్ప బోతున్నానో తెలుసన్నట్టుగా తలూపి, ఆకలి వేళ వచ్చేడు, అభోజనంగా ఎలా వెళతాడు? ఈ జాతులూ, కులాలూ అన్నానికి లేవురా ... అన్నారు.
ఆ రోజు మా నట్టిల్లు బరంపురానికి ఏమీ తీసిపో లేదనిపించింది.
ఆ సంస్కారం, ఔన్నత్యం, విశాల దృక్పథం ... గురించి ఆలోచిస్తే, వాళ్ళకున్న ఔన్నత్యంలో సహస్రాంశమైనా మనం మన జీవిత కాలం లో అలవరచుకోగలమా అనిపించక తీరదు.