5, నవంబర్ 2010, శుక్రవారం

అమ్మ - బొబ్బిలి - కృష్ణుడు - కృష్ణాష్టమి

      మా అమ్మ పేరు ముద్దు సీతాలక్ష్మి. పుట్టింది బొబ్బిలిలో.  శంకర జయంతి నాడు. బొబ్బిలిలో కొలువు తీరింది శ్రీ వేణుగోపాలస్వామి.  అమ్మకి,కృష్ణుడికి, బొబ్బిలికి ఉన్న అనుబంధం చెప్పనలవికాదు.  అమ్మ బాల్యం, వివాహం అన్నీ బొబ్బిలిలోనే.  ఎప్పుడైనా మేమెవరైనా బొబ్బిలి వెళితే, అక్కడ మా తాతగారు నివశించిన ఇల్లూ, తను చిన్నతనంలో ఆడుకున్న అరుగులూ చూపించేది.  ఇక గుళ్ళో వేణుగోపాలస్వామి దర్శనం సరే సరి.  
       అమ్మకి ఉన్న కృష్ణ భక్తి, ఆమె చేసే పూజలూ పునస్కారోల్లో కన్నా ఆమె మాటల్లోనే ఎక్కువగా కనిపించేది. అమ్మ  బొబ్బిలిలో గడిపిన అందమైన బాల్యంలో తరుచూ ఆఏణుగోపాలస్వామిని దర్శించుకోవడం వల్ల అమ్మకి కృష్ణుడంటె భక్తి భావం అనుకుంటా. ఆ భావనని భక్తి అనే కన్నా ప్రేమ అనడమే సరైనది.
అమ్మకి జాన్ హిగ్గిన్స్ పాడిన 'కృష్ణా నీ వేగ నే బారో ' అన్న కన్నడ పాటంటే ఎంత ఇష్టమో .  ఒక సారి ఆర్ కే నారాయణ్ రాసిన స్వామీ & ఫ్రెండ్స్ ' ఆధారిత'  టీవీ సిరీస్ లో ఒక చిన్న పాప ఈ పాట పాడింది.  అమ్మ అలా చూస్తూ ఉండి పోయింది.
       అమ్మ తనకు తరుచూ వచ్చే ఒక కల గురించి చెప్పేది.వేణుగోపాలస్వామి గుడిలోని కృష్ణుడు ఒక బుడి బుడి నడకల చిన్ని బాలుడిగా మారి పరుగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చాడని.  ఎంత అధ్భుతమైన కల. ఆంతర్భూతంగా కృష్ణుడంటె ఉన్న పుత్ర వాత్సల్యం వల్ల ఆమెకి అలాంటి కల వచ్చెదనుకుంటా.  కృష్ణుడి మీద అమ్మకి యశోదా దేవికి ఉన్నంత పేమ.బొబ్బిలి వేణుగొపలస్వామి గురించి మాతో తరుచూ మట్లాడేది.  తన చిన్నప్పుడు బొబ్బిలి రాణీగారు దర్శనానికి వచ్చేవారట.  ఒక్క మగపురుగు కూడ చుట్టుపక్కల లేకుండా చూసెవరట.  పిల్లల్ని మాత్రం అనుమతించేవారట. దర్శనంతరం   రాణీగారు పిల్లలందర్నీ చూసి ఒక్క నవ్వు నవ్వేవారట.  దాంతొ పిల్లలందరూ ఒకటే కిలకిల నవ్వులు.  ఆ రోజుల్లో భోగం (ప్రసాదాలు) చలా బాగా చెసేవారట. అమ్మ అవన్నీ తరుచూ గుర్తుకు తెచ్చుకునేది. అమ్మకి నేను పేపర్ పల్ప్ తొ చెసిన కృష్ణుడి బొమ్మని విజయవాడలో కొన్నాను. ఆ విగ్రహానికి రోజూ సాయంత్రం ఇంట్లొనే పూచిన పారిజాత పూల దండ గుచ్చి వేసెది.  అంత పెద్ద కృష్ణుడి బొమ్మ ముందు గదిలొ నవ్వుతూ నించుంటే అమ్మకి ఏ ఈతి బాధలూ గుర్తుకొచ్చేవి కావేమో.
  అమ్మ దేవుని మందిరంలో మోకాళ్ళ మీద చేతులానించి వంగిఉన్న కృష్ణుడి పటం ఒకటి ఉండేది.  పక్కనే వెన్నతొ సహా ఒలికిన చల్ల కుండ.  ముద్దొస్తున్న ఆ కృష్ణుడి ముఖం చూసి మా చిన్నమ్మాయి కీర్తి ఆ పటం కావాలంది.  అడిగిందే తడవు అమ్మ ఇచ్చేసింది.  మా కీర్తి వెంటనే ఆ పటాన్ని మా పూజా మందిరంలొ పెట్టేసింది.  అలా అమ్మ కృష్ణుడు మా ఇంట్లోకి కూడా వచ్చి చేరాడు.
       అమ్మకి కృష్ణుడన్నా, బొబ్బిలన్నా ఎంత ఇష్టమో తెలియాలంటె మరో ఉదాహరణ. అమ్మ చనిపోయినపుడు నాన్నగారు అమ్మని గుర్తు చేసుకుంటూ బొబ్బిలి గురించీ, వేణుగొపలస్వామి గురించీ మట్లాడేరు. వాళ్ళ పెళ్ళైన కొత్తలో నాన్నగారు బొబ్బిలి వెళ్ళినప్పుడు అమ్మ ఆయన్ని గుడికి తెసుకెళ్ళి తన చిన్నప్పుడు కూర్చున్న మండపాలు, అరుగులూ చూపించిందట.  వేణుగోపాలస్వామి దర్శనం చేసుకుని వచ్చి ఆ అరుగు మీద పడుక్కుంటే జీవితంలో ఇంకేదీ అక్ఖర్లేదు అనిపిస్తుందని చెప్పిందట. ఇది చాలు, అమ్మకీ బొబ్బిలికీ, ఆ వేణుగొపలస్వామికీ ఉన్న బాంధవ్యం తెలియాలంటే.
       నా పెద్ద కూతురు విద్యకి పది నెలలప్పుడు నా చెల్లెలు స్వాతి ఫొటోలు తీస్తుంటే అమ్మ ముచ్చటపడి గబగబా నాన్నగారి ఎర్ర పట్టువాణీతొ విద్యకి పంచెకట్టి, నెమలి విసనకర్రలోంచి నెమలి కన్నొకటి తీసి పింఛం పెట్టి, నడుం కట్టు కట్టి, మెడకీ,దండలకీ పూసల గొలుసులు వేసి కృష్ణుడి బొమ్మకి ఉన్న పిల్లనగ్రోవిని దాని చేతికిచ్చి ఫొటొ తీయించి ముచ్చట పడింది.
       కృష్ణుడంటే ఇంత ప్రేమ ఉన్న అమ్మ కృష్ణాష్టమి చెయకుండా ఉంటుందా.  నాకు ఊహ తెలిసినప్పటినుండీ అమ్మ కృష్ణాష్టమిని పండగలా జరిపేది.  కృష్ణుడికి ఇష్టమైన అటుకులూ, వెన్నా, పాలూ, పెరుగూ తప్పనిసరిగా నైవేద్యం  పెట్టెది.  ఉట్టి, ఉట్టిలో మట్టి కుండా అందులొ వెన్నతో అలంకరించి పక్కనే పెట్టేది.  ఒకసారి కృష్ణాష్టమికి మా పెద్దక్క కూతురు కిరణ్ మా ఇంట్లో ఉంది.  అమ్మమ్మ కృష్ణాష్టమి చెస్తుంటే సరదా పడి కృష్ణుడి పాదాలు వేసింది.  అదికూడా అమ్మే  చెప్పింది.  పిడికిలి బిగించి నానపెట్టిన నామం సుద్దలో అలవొకగా అద్ది నేలమీద ముద్రించి ఆ పైన చిన్న చిన్న చుక్కలు పెడితే సరి బుల్లిపాదం తయారైపోతుంది.
       అదీ అమ్మకీ, బొబ్బిలికీ, కృష్ణుడికీ, కృష్ణాష్టమికీ ఉన్న సంబంధ బాంధవ్యం.  అమ్మ ఆ కృష్ణుడి సాన్నిధ్యానికే చేరుకుని ఉంటుందనుకుంటె ఎంత ఊరటగా ఉందో.
       అమ్మ, 'కూతురిగా', 'సోదరిగా' 'అమ్మగా', 'భార్యగా', కోడలిగా, 'వదినగా' 'అత్తగారిగా' 'అమ్మమ్మగా' 'నాన్నమ్మగా' సంపూర్ణమైన బాధ్యతలు నిర్వర్తించింది. ఆ విషయాలన్నీ మరొకసారి మీ అందరితొ పంచుకుంటాను.

9 కామెంట్‌లు:

  1. అమ్మ గురించి చాలా అద్భుతంగా రాసేవు.
    అక్కయ్యపాలెం లో ఉన్నప్పుడు
    రొజూ సాయంత్రం అవగానే పెరట్లో పూసిన పారిజాతాలు దండ గుచ్చి
    వేణుగోపాలస్వామి కోవేలకి వెళ్లి ఆ కృష్ణుడికి వేసి వచ్చేది.

    రిప్లయితొలగించండి
  2. మీ అమ్మ గారి గురించి చాలా బాగా రాసేవు. చాలా అద్భుతంగా ఉంది. ఎంతో ఆర్ద్రంగా ఉంది.మీ అమ్మ గారు గొప్ప శ్రీ కృష్ణ భక్తులు. బొబ్బిలి లో వెలసిన వేణు గోపాల స్వామి అంటే, ఎన లేని భక్తి.మేం సాలూరు లో ఉండే రోజులలో మీ అమ్మ గారు వచ్చినప్పుడల్లా విధిగా బొబ్బిలి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకుని వచ్చే వారు.

    మీ అక్క నీ టపా చదివేక మీ అమ్మ గారితో మరో చక్కని ముచ్చట గుర్తు చేసుకుంది. మీ అమ్మ గారు ఎప్పుడు బొబ్బిలి వెళ్ళినా, అక్కడ కోవెల దగ్గర ఉండే ఒక మఱ్ఱి చెట్టుని చూస్తూ చాలా ఆనంద పడేవారుట. తను బొబ్బిలిలో చిన్నప్పుడు ఉండే రోజులలో ఎప్పుడూ ఆ మఱ్ఱి చెట్టు
    ఊడలు పట్టుకుని ఊగే దానినని చెబుతూ ఉండే వారుట. ఎన్ని సార్లు బొబ్బిలి వెళ్ళినా, అన్ని సార్లూ, అదే ముచ్చట చెబుతూ పరవశించి పోయే వారుట.

    ఆతర్వాత, కొన్ని నాళ్ళ క్రిందట, ఎవరో మత పెద్దలు ఆ చెట్టు అక్కడ ఉండ రాదని చెప్పడం వల్ల దానిని కొట్టించి వేసారుట. ఈ దారుణం తెలిస్తే మీ అమ్మ గారు తట్టుకో లేరనుకుని మీ అక్క ఆ విషయం మీ అమ్మ గారికి చెప్పనే లేదుట.
    అందు చేత, స్వర్గస్థులైన మీ అమ్మ గారికి ఆమరణాంతం ఆ మఱ్ఱి చెట్టు ఊడలను పట్టుకుని తాను చిన్న ప్పుడు ఊగిన అందమైన ఆలోచనలు మాత్రం సజీవంగా ఉండడం జరిగింది.

    ఇలాంటి మంచి టపాలు నీనుంచి తరుచుగా మరిన్ని ఆశిస్తున్నాం, నేనూ, మీ అక్కానూ.
    అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. అమ్మ గురించి నువ్వు వ్రాసినది చదివాను. చాలా బాగుంది. అమ్మ గురించిన విశేషాలు తరుచుగా పెడుతూ ఉండు.

    రిప్లయితొలగించండి
  4. read your reminescencesaboutchinnavadine .Mothers remembrances are sweet for any one .Ramanarao.

    రిప్లయితొలగించండి
  5. జ్యోతిగారు,
    అమ్మ గురించి ఎవరి అమ్మగురించయినా సరే ఏం చెప్పినా సరే...అత్యంత మధురంగా ఉంటుంది. అందులోను మధురమయిన కృష్ణభక్తితో నిండిన అమ్మగురించి రాసిన విషయాలు ఎంతో కమ్మగా ఉన్నాయి.
    మీ అమ్మగారు మా నాన్నగారి చిన్నఅత్తయ్యగా నాకు వరసకి అమ్మమ్మగారు అవుతారు. కానీ నాన్నలాగే మాకూ చిన్నత్తగానే మీ అమ్మగారిని పిలచుకోవడం అలవాటు. నాన్న ఎన్నో సందర్భాలలో ఆవిడ ఓర్పు, మంచితనం, ఆత్మీయత,అభిమానం తలచుకుంటూ ఉండడం చూసి మాకూ ఆమె పట్ల ఎనలేని గౌరవం. ఎంతో సహనాన్ని ప్రదర్శిస్తూ, మీరన్న ఈతిబాధలను సహిస్తూ రకరకాల పాత్రలను అందరికీ ఆమోదయోగ్యంగా నిర్వహించిన మీ అమ్మగారి గురించి మరిన్ని ముచ్చట్లు రాయండి.

    రిప్లయితొలగించండి
  6. చిన్నత్తకా నేనంటే చాలా ఇష్టం .అది ఆవిడ మాటల్లో నాకు స్పష్టంగా తెలిసేది. దానికి కారణం నా పేరు కృష్ణుడు కావడం కూడా ఒకటి అయి ఉండొచ్చని ఇప్పుడు అని పిస్తోంది. ఆవిడ చేసిన మైసూరుపాకూ,మినప సున్నీ లాగే అవిడ మనసు కూడా మధురం. తీయని తల్లి ని గుర్తుచేసుకుంటూ మాక్కూడా " గేపకం" చేసి నందుకు జ్యోతికి థాంక్స్. ---- pgk, hyderabad

    రిప్లయితొలగించండి
  7. థాంక్యూ స్వాతి, ఈ బ్లాగు రావడానికి నీ ప్రోత్సాహమే ముఖ్య కారణం.

    థాంక్యూ విజయ & బావ. అమ్మ గురించి తరగని కబుర్లు ఉన్నాయి. అవి అయ్యేవరకూ ఈ బ్లాగుని కంటిన్యూ చేస్తా.

    థాంక్యూ చిన్నాన్నగారూ. I am not good in oral skills. But I have a few things to say about my mother. This blog helps me record these memoirs.

    థాంక్యూ సుధా, నేను కుడా మీ ఇల్లాలి 'ముచ్చట్లు ' బ్లాగు ఫాలో అవుతున్నా. ఈ బ్లాగులు కొత్తగా మళ్ళీ మనుషుల్ని దగ్గర చేస్తున్నాయి.

    థాంక్యూ కృష్ణ బావా, అమ్మ, అల్లుడ్నీ, మేనల్లుడ్నీ వేరుగా భావించేది కాదు. మా మిగిలిన కజిన్స్ ఎవరినీ 'బావా' అని పిలిచే అలవాటు మాకు లెదు. ఒక్క మిమ్మల్నే మేం అలా పిలిచేది

    రిప్లయితొలగించండి
  8. జ్యొతి,
    నువ్వు రాసినది చదివెను. చాలా బాగుంది. నెను, విజయ ఒకసారి బొబ్బిలి వెల్లెము. నీకు బొబ్బిలిలొ అన్నప్రాసన చెసింది. నాకు చాల బాగ గుర్థు. ఆక్కడ్ కొవిల దగ్గర్లొ పుల తొట వుందెదట. అది ఇప్పుదు లెక పొవదం చుసి అమ్మ చాల బాధ పడుతు వుండెది. అ తొట అంటె అమ్మకి చాల ఇష్తం. ఆక్కద ఆడుకునెవారుట. ఆమ్మ వాల ఇంటి ముందునుంచె రొజు సయంకాలం ఎనుగు వెలుతు వుందెదట. ఎనుగు పాదలకిందన వున్న మట్టిని తీసి పరెట్లొ దాచెవారుట.

    రిప్లయితొలగించండి
  9. అమ్మ అన్నది ఒక కమ్మని మాట యెన్నెన్నో తెలియని మమతల మూట

    రిప్లయితొలగించండి