మా అమ్మది కళాత్మక హృదయం. కాలక్రమంలో ఆమెలోని ఆర్టూ, క్రియేటివిటీ మరుగునపడ్డా మా అమ్మ చనిపొయే వరకూ ఆమెలోని కళ తొంగి చూస్తూ ఉండేది.
మా చిన్నప్పుడు మాకు అందమైన స్వెట్టర్లు అల్లేది. ఊలు దారాలు కానీ సిల్కు దారాలుకానీ ఉపయోగించి గుండ్రని లేసులు అందంగా అల్లేది. మా రమణ చిన్నన్నగారి పెద్ద కోడలు, విజయ ఎంతో ముచ్చటపడి అమ్మ అల్లుతున్న పధ్ధతి చూసి తెలుసుకుంది. మేము నలుగురం అమ్మయిలం మా అమ్మకి ఉన్నాం కానీ మాకెవరికీ ఆ బుధ్ధి లేకపొయింది. అమ్మ దగ్గర ఎప్పుడూ ఆ లేసులల్లే సూదులు ఉండేవి. అవెక్కడున్నాయో మా హైమక్కని ఆదిగి తీసి దాచుకోవాలి.
మహిళా మండలి లో నేర్చుకున్న ఎంబ్రాయిడరీలన్నీ ఇంట్లో చేసేది. నా చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ మ్యాటీ క్లాత్తో కుట్టిన డోర్ కర్టెన్ ఉండేది. దానికి చుట్టూ ఆకు పచ్చని కాటన్ అంచు ఉందేది. కర్టెన్ మధ్యలో పెద్ద పూలకుండీ డిజైన్, నాలుగు మూలలా పూల గుత్తులు ఉండేవి. ఆ కర్టెన్ని మా అమ్మ ఎంత కష్టపడి కుట్టిందో. అది ఎంత బాగుండేదో. మేము ఏ ఊరు వెళ్ళినా ముందు గుమ్మానికి ఆ కర్టెన్ వేసే వాళ్ళం. కనీసం ఒక 30 సంవత్సరాలు ఆ కర్టెన్ వాడేము. చిరిగి పోయింది కాని దాని అందం మాత్రం పోలేదు.
ఇక మా అమ్మ చాలా అందమైన బొంతలు కుట్టేది. బొంతలు కుట్టడం ఒక పెద్ద ఆర్టా అనుకోవచ్చు. కాని వాటిని అందంగా కూర్చి వాటిమీద ఇక్కత్ డిజైన్ వచ్చేటట్టు రంగు రంగు దారాలతో కుట్టడం మాత్రం ఆర్టే. మా ఇళ్ళల్లోని పిల్లలందరూ అమ్మ బొంతల మీద పెరిగినవారే. చంటి పిల్లలకైతే మరీ మెత్తని చీరలు ఎంచుకుని కుట్టేది. నేనొకసారి మా మామయ్య కూతురు పెళ్ళికి హైదరాబాదు వెళ్ళినప్పుడు ఆ పెళ్ళికి వచ్చిన బొంబాయి వాళ్ళందరికీ మా చిన్నమ్మయిని, మూడు నెలలది, పడుకొపెట్టిన బొంతని ఎంత మెచ్చుకున్నారో. వాళ్ళంతా ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళే. 'అరె ఇవి మనవేపు కుడతారర్రా' అనుకుంటూ తెగ మెచ్చుకున్నారు.
మా అమ్మ మామూలు జనప గోనె సంచి మీద ఊలుతో మంచి మంచి డెజైన్లు వేసి, డోర్ మ్యాట్ గా వాడుకోమని ఇచ్చేది. అవెంత బాగుండేవో.
ఇక శ్రావణమాసపు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మ తీర్చి దిద్దే అమ్మవారి రూపు గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిందే. మైదా పిండిలో పసుపు కలిపి ముఖానికి ఆకృతిని ఇచ్చేది. వరిపిండి, కాటుకతో కళ్ళూ, కుంకుమతో తిలకం దిద్దేది. ఇంట్లో ఉన్న పాత రాళ్ళతో కర్నాభరణం, ముక్కెర అలంకరించేది. మా అమ్మ, అమ్మవారికి ఏ నగలూ పెట్టేది కాదు. ఎలాంటి ఆడంబరమూ ఉండేది కాదు. కాని అమ్మ చేసిన అమ్మవారు అందంగా వెలిగి పోతుండేది. చుట్టుపక్కల ఆడవాళ్ళు ప్రత్యేకించి వచ్చి అమ్మ చేసిన రూపుని చూసి వెళ్ళేవాళ్ళు..
మా అమ్మ పిల్లల్ని గుమ్మడి పండు మామిడి పండు అంటూ పోల్చి ముద్దులాడేది. ఏ అమ్మమ్మైనా అంతే అనుకోండి. మ చెల్లి కూతురు చిట్టి కాస్త తక్కువ బరువుతో పుట్టినా, పుట్టిన నెల రోజులకే తేరుకుని ఒళ్ళు చేసింది. అమ్మా ఇదేం పండు అని అడిగా. 'దీని బుగ్గలు మర్రి పళ్ళర్రా' అంది. నేను ఒక్కసారిగా చిట్టి బుగ్గలు చూసా. అవి నిజంగా చిన్న ఎర్రని మర్రి పళ్ళలానే ఉన్నాయి. అమ్మ పోలికకి నవ్వొచ్చింది. ఒకసారి గోరేటి వెంకన్న గారు అన్నారు. గ్రామీణులు చేసే పోలికలన్నీ ప్రకృతిలోని విషయాలతో ఉంటాయని. మా అమ్మది కూడా గ్రామీణ నేపధ్యమే.
మా అమ్మ ఏమీ చదువుకోలేదు. రెండో తరగతితో ఆపేసింది. కానీ ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించేది. ఎలాంటి మూఢనమ్మకాలూ ఇసుమంతైనా లేని మా నాన్నగారి సాహచర్యంవల్ల మా అమ్మకు కూడా ఎలాంటి మూఢనమ్మకాలూ ఉండేవి కావు. ఆఖరికి ఏ పనికైనా చూసే ముహూర్తాల విషయంలో కూడా 'మనకి ఏ పనైనా చెయ్యాలని సంకల్పం కలిగిని సమయమే మంచి ముహూర్తం అనుకోవాలని, సంకల్పం కలిగినప్పుడే పని మొదలైనట్టని అనేది.' ఈ మధ్య పెళ్ళిళ్ళలో జాతకాల పిచ్చి మరీ ఎక్కువైపోతోందని చిరాకు పడెది. వాళ్ళ కాలంలో అన్నీ నచ్చితే జాతకాలు చూసేవారే కాదంట. పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నట్టు చదువులు ఎక్కువైనకొద్దీ ఈ జాతకాల పిచ్చేంటని విసుక్కునేది. శకునాలు చూడ్డం కానీ, కష్టాలు వచ్చినప్పుడు 'అన్నీ దేవుడే చూసుకుంటాడనీ కానీ మా ఆలోచనలెనెప్పుడూ కండిషనింగ్ చెయ్యాలని ప్రయత్నించలేదు. విషయమంతా మనలోనే ఉంటుందనీ బయటి నుంచి ఏ ఫోర్సులూ పని చెయ్యవని తనకు కలిగిని సహజ జ్ఞానం వల్ల అమ్మ తనకు తెలియకుండానే మమ్మల్ని ' జిడ్డు కృస్ణమూర్తి ' ఆలోచనా పధ్ధతిలో పెంచింది. ఇక టీవీలూ, బీరువాలు కొత్తవి కొన్నప్పుడు ప్రారంభించడానికి ముహూర్తాలు చుసేవాళ్ళతో, ఆ వస్తువు ఇంటికి రావడమే సుముహూర్తమండీ, ఇంక వేరే ముహూర్తమెందుకని నవ్వేసేది. పాండిత్యం కన్నా జ్ఞానం ముఖ్యం' కదా.
మా అమ్మ నమ్మకాలకన్నా, సాంప్రదాయానికి ఎక్కువ విలువ నిచ్చేది. ఈ మధ్య పెళ్ళిళ్ళలో చూసేరా, పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టే గంపకి రంగు కాగితాలు చుట్టి , మెరుపులు అలంకరిస్తున్నారు. ‘అమ్మాయిని గంపలో కుర్చో పెట్టి అబ్బాయికి అప్పగించాలి కాని ఇదేంటి కాగితం డొక్కులాగా, అది గంప అని తెలియటమే లేదు. చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించినా బాగుంటుంది అని సలహా ఇచ్చేది.
మా అమ్మ అభిరుచులుకూడా చాలా చక్కగా ఉండేవి. కర్ణాటక సంగీతం చాలా ఇష్టంగా వినేది. అందులోనూ అన్నిటికన్న మిన్నగా డీ కె పట్టమ్మాళ్ పాటలంటే మరీను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి తరువాతి స్థానం. పుష్య బహుళ పంచమినాడు తిరువైయ్యారులో జరిగే అరాధనోత్సవాలప్పుడు పంచరత్నాలూ పూర్తయ్యేవరకూ ఇంతకు ముందు రేడియో తరువాత టీవీ ముందునుండు నాన్నగారితో సహా కూర్చుని విని, చూసి మనసుతీరా అనందించేది. అమ్మకి అన్నిటికన్నా ఇష్టమైన పాట 'రఘువంశ సుధాంబుధీ. ఇక పెళ్ళిళ్ళలో సన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకిష్టమైన పాటల్ని వాళ్ళకి వస్తే అడిగి వాయించమని చెప్పేది. తొట లాంఛనమప్పుడు 'గంధమూ పుయ్యరుగా', ఇంకా పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడు సమయానికి తగు మాటలాడెనే' పాటలుండాలనేది. ముహూర్తానికి ముందు ఎందరో మహానుభావులు తప్పని సరిగా ఉండాలనేది.
మల్లీశ్వరి అమ్మకి చాలా ఇష్టమైన సినిమా. మా అమ్మ నలభైల్లో ఉండగానే సినిమాలు నచ్చక అసలు చూడ్డం మానేసింది. నేను విజయవాడలో ఉండగా అమ్మ అక్కడికి వచ్చినప్పుడు పాత దీదార్ సినిమాకి తీసుకెళ్ళా. చాలా అనందించింది. మా కీర్తి ఒక సారి నాతో అంది. 'అమ్మా మా ఫ్రెండ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏం తోచక తెలుగు టీవీ సీరియల్స్ చూస్తారుట. చక్కగా మన అమ్మమ్మా తాతగారే నయం. అసలు టీవీ సీరియల్సే చూడరు ' వాళ్ళకవి నచ్చవు అంటూ అనాలసిస్ ఇచ్చి టీవీ సీరియల్స్ చూడని అమ్మమ్మా తాతగారూ వాళ్ళకు దొరికినందుకు చాలా అనందించింది.
టీవీ అంటే గుర్తుకొచ్చింది. అమ్మ జ్ఞానానికి సంబంధించిన విషయం ఒకటి చెప్తా. ఒక సారి అందరం కూర్చొని టీవీలో క్విజ్ షో వస్తుంటే చూస్తున్నాము. అక్కడ మాతో పాటు , తమకు మంచి విషయ పరిజ్ఞానముందనీ, పురాణాల విషయంలో తమకు మంచి పరిజ్ఞానం ఉందనుకునే ఆడవాళ్ళు కూడా కొంతమంధి ఉన్నారు. క్విజ్ లో ఒక ప్రశ్న. దేవవ్రతుడంటే ఎవరు అని. అమ్మ వెంటనే భీష్ముడని చెప్పింది. మిగిలిన వాళ్ళు అర్జునుడనీ, ధర్మరాజనీ చెప్పడం మొదలుపెట్టేరు. అమ్మ సమాధానాన్ని వాళ్ళస్సలు పట్టించికోలేదు. కానీ అమ్మ చెప్పిన సమాధానమే కరక్ట్ అయ్యింది. నాకు చాలా సరదా వేసింది. అందులో ఒకావిడ అంది ‘పిల్లల బొమ్మల భారతం’ చదివి కూడా ఇలాంటివి చెప్పెయ్యొచ్చని.
తరువాత అమ్మని అంత కరక్ట్ గా ఎలా చెప్పావని అడిగా. పురిపండా అప్పలస్వామి వచన భారతం చదువుతున్నా, అందుకే చెప్పగలిగానంది.
నా చిన్నప్పుడు డాబా మీద పడుకునేవాళ్ళం. లో దాహం వేసి అమ్మని లేపా. అమ్మ ఇచ్చిన మంచి నీళ్ళు తాగి తల పైకెత్తి చూస్తే అమ్మ ఆకాశంలోకి చూస్తోంది. 'అమ్మా ఏం చూస్తున్నావు ' అన్నా. 'వృశ్చిక రాశి బాగా కిందకి దికిపొయింది ' ఇంకో గంటలో తెల్లవారి పోతుంది ' అంది. అంతేకాదు పడుకునే ముందు సప్తరుషుల్నీ, సింహరాశినీ, చూపించేది. ఇవన్నీ ఏం చదువుకోని అమ్మకెలా తెలుసా అని ఆశ్చర్యమేసేది.
అమ్మలందరూ ఇంతే and thats why we love them. Moms are intelligent yet coming to their kids they would like to be otherwise. మా అమ్మ కూడ చాలా బొమ్మలేసేది, ఎంబ్రాయిడరీ చేసేది, పాటలు పాడేది కానీ ఇప్పుడు కాదు.
రిప్లయితొలగించండిtheir's was the real education. you wrote very well about your mother.
రిప్లయితొలగించండిచిట్టి కి అమ్మ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి అమ్మ కుట్టిన బొంతలంటే చాలా ఇష్టం. చిట్టి చిన్నప్పుడు షిప్ లో ఉన్నప్పుడు మధ్య రాత్రి నిద్ర లోంచి లేచి అమ్మమ్మ కావాలని అనేది. అప్పుడు అమ్మ కుట్టిన బొంత చూపించి అమ్మమ్మ నీకు పంపించింది అంటే ఆ బొంత మీద బజ్జొనేది.అమ్మ కుట్టిన బొంతలన్నీ చాలా భద్రంగా దాస్తున్నాను. అయితే చిట్టి పుట్టినప్పుడు అమ్మ కుట్టిన చిన్న చిన్న బొంతలని దాచలేదని చిట్టి నన్ను సతాయిస్తుంటుంది
రిప్లయితొలగించండి