14, నవంబర్ 2010, ఆదివారం

అమ్మ నగలు

  ఈపాటికి మా అమ్మ ఒక సామాన్య గృహిణి అని మీకు అర్ధమయ్యేఉంటుంది.  ఆమెకు  ఏడువారాల నగలు కానీ రత్నహారాలు కానీ ఉండి ఉంటాయని మీరనుకుని ఉండరని భావిస్తా. అయినా అమ్మ నగలు గురించి ఎందుకు వ్రాయాల్సి వచ్చిందో ఒకసారి ఇలా చూడండి.

  మా అమ్మకి ఒకప్పుడు పుట్టింటివారు పెట్టిన  చంద్రహారం, గాజులూ అత్తింటివారు పెట్టిన  జిగినీ గొలుసూ, ఉండేవట.  మంగళ సూత్రాలు వేసుకోనే నానుతాడు మా అమ్మ పెళ్ళికి ముందు నుంచీ వేసుకొనేదిట.  కానీ అర్ధికావసరాలకోసం వాటినన్నిటినీ అమ్ముకోవలసివచ్చింది.   ఆర్ధికమాంద్యం ఉన్న ఆ రోజుల్లో సామాన్య కుటుంబాల్లో అది సర్వ సాధారణం.
నాకు ఊహ తెలిసి, మా అమ్మకి తొమ్మిది రాళ్ళ దుద్దులు, ముక్కున మూడు రాళ్ళ  ముక్కు పుడక ఉండేవి. ఈ రెండూ లేకుండా అమ్మ ముఖం నాకు గుర్తుకు రాదు.  అవేం రాళ్ళోకానీ, జాతి రత్నాల్లా మెరిసేవవి.  ఇక మెడలో నానుతాడు, దారానికి గుచ్చిన నల్లపూసలూ తప్ప ఇంకేమీ ఉండేవి కాదు.  మా అమ్మ మమ్మల్నందర్నీ ముద్దుగా పెంచడం వల్లా, మాతో ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడడం వల్లా, ఎప్పుడూ అంచులున్న నేత జరీ చీరలే ధరించడంవల్లా, ఆమె మాకెప్పుడూ అందంగా, హుందాగా కనిపించేది.  అమ్మకి భాషణమే భూషణమయ్యింది.  

  మేము నలుగురం ఆడపిల్లలవడంచేతా, అందరికీ పెళ్ళి సందర్భంగా కనీస బంగారం కొనవలసి రావడం చేతా, బహుశా తనకంటూ ఏమీ చేయించుకోలెకపోయింది.

  అమ్మ చేతికి ఎప్పుడూ మట్టిగాజులే ఉండేవి.  అవికూడా తనకు నప్పే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులే ఎంచుకునేది.  వాటికెప్పుడూ చిన్న మెరుపు ఉండేది.  అవి ఏ మాత్రం మాసినా వెంటనే మార్చేసేది. కొత్త గాజులు మాచేత తనకు నచ్చిన రంగువి తెప్పించుకొని చేతికి సబ్బు రాసుకుని ఎక్కించుకొని రెండు చేతులూ తను ఒకసారి చూసుకొని మాకు  చూపించి 'బాగున్నాయమ్మా ' అనేది. నా చిన్నప్పుడు మా అమ్మ పెరట్లో రుబ్బురోట్లో పచ్చడి కానీ, పిండి కానీ రుబ్బుతుంటే వచ్చే గాజుల శబ్దం నాకిప్పటికీ గుర్తే.

  నాకూ, మా చెల్లి స్వాతికీ ఉద్యోగాలొచ్చేక మా అమ్మకి గాజులు చెయించాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసేవాళ్ళం.
కానీ అమ్మ అనేది.  'ముందు మీ పెళ్ళిళ్ళు కావాలి.  డబ్బులుంటే దాచుకోండి. నాకిప్పుడు గాజులు లేకపోతే వచ్చే నష్టమేమీ  లేదు ' అని కేకలేసేది.  అలా ఆ ఆలోచన పక్కన పడేది.

  ఇన్వెస్ట్మెంట్ అనే మాట కానీ ఆలోచనగానీ లేని రోజుల్లో మా నాన్నగారు 247 చ. గ. స్థలం ఒకటి కొన్నారు.  కొన్న చాలాకాలం తరవాత, ఆ జాగాని రక్షించుకోవడం కష్టమనే ఆలోచనతోనూ  రేటు బాగా రవాడంతోనూ దాన్ని అమ్మేసారు.  వేలల్లో కొన్న జాగాకి లక్షల్లో రావడంతో అమ్మా నాన్నగారూ ఇద్దరూ చాలా ఆనందపడ్డారు.   అంత డబ్బు చేతిలొకి వచ్చినాకూడా అమ్మ తనకి కాసు బంగారమైనా  కొనుక్కొవాలన్న ఆలోచనే చెయ్యకుండా, నలుగురు కూతుళ్ళకీ, కోడలికీ తలా ఒక రెండు తులాలూ బంగారం కొంది.


  మా చెల్లి స్వాతి తనకు బంగారం వద్దని తిరిగి ఇచ్చేస్తే, అదికూడా తను తీసుకోకుండా, గొలుసు చేయించి  మనమరాలి పెళ్ళికని దాచి, ఆ పెళ్ళిలొ మనమరాలి మెడలో వేసింది.

  అందరూ ఆర్ధికంగా స్థిరపడ్డాక,  వాళ్ళ డబ్బుతో ఇంకెవరికీ అవసరం లేదనిపించాక, ఒక సందర్భంలో అమ్మ గాజులు  చేయించుకోవాలనే ఆలొచన చేసింది.  అదే సమయంలో నాన్నగారి ఆరొగ్యంలో ఒక్కసారిగా తేడా వచ్చింది.  దాంతో ఆ ఆలోచన మరిచిపోయింది.  మా అన్నయ్య కూతురు, వైదెహి పెళ్ళికి ముందు, అమ్మ నానుతాడులోని బంగారం పోగులు చిట్లి మెడకు గుచ్చుకొని  బాధపడుతుంటే, మా చెల్లి స్వాతి గమనించి 'అమ్మా మార్చేస్తాను ఇచ్చెయ్యి '  అంటూ నాన్నగారి దగ్గర డబ్బులు తీసుకొని నన్ను కూడా తీసుకుని వెళ్ళి పాత గొలుసు మార్చేసి కొత్త గొలుసు  తీసుకుంది.  కానీ అది నానుతాడు కాదు.  వేరొక డిజైన్ లో ఉంది. అమ్మ కొంచెం నిరాశపడ్డా, సంతోషంగానే నాన్నగారికి చూపించింది.  అమ్మ సంతొషం చూసి నాన్నగారు, 'నెమ్మదిగా గాజులు కూడా కొనుక్కో' అన్నారు.

  ఇక అమ్మ ముక్కు పుడక గురించి కూడా చిన్న మాట చెప్పాలి.  మా చెల్లి స్వాతి, అమ్మ పాత ముక్కు పుడక స్థానే, తను బొంబాయిలో కొన్న మేలిమి వజ్రంతొ చేసిన ముక్కపుడక  చేయించింది.  'ఎవరు ముక్కు కుట్టించుకుంటె వాళ్ళకే ఈ వజ్రపు ముక్కు పుడక ' అని మా అమ్మ తమాషాగా అంటుండేది. ఒక్క  మా పెద్దక్క కూతురు కిరణ్ కి తప్ప   మా ఎవరికీ ముక్కుపడక పెట్టుకునే అలవాటులేదు,. అమ్మ చనిపొయె ముందు కిరణ్ ని తలుచుకుంది.  అమ్మ కోరిక మాకు అర్ధమయ్యింది.  అలా ఆ ముక్కు పుడక కిరణ్ కి దక్కింది.  అమ్మ మరికొంత కాలం జీవించి ఉంటె తప్పక బంగారు గాజులు చేయించుకునేదేమో.  కానీ ఆ చేతికి బంగారు గాజులు పడవలసిన అవసరం లేకుండా, మట్టిగాజులతొనే దర్జాగా వెళ్ళిపొయింది.   అదీ అమ్మ నగల కథ.

  ఈ సందర్భంలో నేను మా అమ్మ దగ్గరున్న వెండి సామాను గురించి కూడా చెప్పాలి. అమ్మ దగ్గర మా తాతగారు మా అమ్మ పెళ్ళికి పెట్టిన వెండి కంచం, మరచెంబు, గ్లాసు ఉండేవి.  పండగలప్పుడు వెండి గ్లాసులోనూ, వెండి గిన్నె లోనూ పయసం తాగడాన్ని చాలా  గొప్పగా భావించేవాళ్ళం, నేనూ, మా చెల్లీ.  వీటితొపాటు, మూడు గిన్నెల గుత్తీ, వెండి గిన్నెలూ, పన్నీరు బుడ్డీ ఉండేవి.   పండగలప్పుడు అమ్మ పుట్టింటినుంచి తెచ్చుకున్న కావిడి పెట్టెలోంచి అమ్మ వాటిని తీసేది.  వాటిని మేము మా వారసత్వ సంపదగ అనుకుని సరదా పడేవాళ్ళం.  మా అందరి పెళ్ళిళ్ళూ అయ్యాక అవన్నీ ఒక్కచోట, అంటే మా అన్నయ్య దగ్గర ఉంటే బాగుంటుందనుకునేవాళ్ళం.  కానీ అమ్మ అలా అనుకోలెదు.  తన గుర్తుగా అవి అందరూ పంచుకోవాలనుకుంది.  అందుకని అందరికన్నా పెద్ద,  అన్నయ్యకి కంచం ఇచ్చింది.  పూజలు పధ్ధతిగా , విధిగా చేస్తుందని, 'కలశం' పెట్టి పూజ చేసుకోమని పెద్దక్క విజయకి మర చెంబు ఇచ్చింది. నెమలి బొమ్మ అతికిన చిన్న కుంకుమ భరిణని చిన్నక్క హైమ ఎంచుకుంది.  తన చిన్నప్పుడు, పేరంటాలకీ, నోములకీ చుట్టు పక్కల ఆడవాళ్ళని పిలుచుకురమ్మని, అమ్మ హైమని పంపిస్తే ఆ భరిణతోనే అందరినీ పిలుచుకు వచ్చెదిట.  ఆ జ్ఞాపకాలతో హైమ ఆ  భరిణని ఎంచుకుంది.     చిన్నప్పుడు అన్నప్రాసన జరిగిన వెండి గిన్నె నాకు ఇచ్చింధి.  ఆర్టిస్టిక్ డెజైన్లంటే ఇష్టపడే స్వాతి పన్నీరు బుడ్డీ ఎంచుకుంది.  అ పన్నీరు బుడ్డిని ఒకపట్టాన ఎవరికీ ఇవ్వదది.  అలా ఇచ్చినప్పుడు ఎవరైనా పారేస్తె, మరొకటి కొనుక్కోగలను, కానీ నాకిదే కావాలి, పోతే రాదు కదా అంటుంది.  అంతిష్టం దానికదంటే.

  'బంగారాన్ని సాధించే సత్తా సంపాదించాలి గానీ, బంగారాన్ని కాదు ' అని ఎవరో అన్నారు.  అది  నిజంగా నిజం.

అమ్మ - స్నేహం

మా అమ్మ స్నేహ శీలి. స్నేహితుల్ని తనకు వాళ్ళిచ్చే 'మన్ననా మర్యద ' అనే కొలబద్దలతో కొలిచేది.   మానాన్న గారి ఉద్యోగరీత్యా మేము ఎన్నో ఊర్లు తిరిగేవాళ్ళం.  ఏ ఊర్లోనైనా ఇరుగు పొరుగులతోనూ, మేం అద్దెకున్న ఇల్లుగలవళ్ళతోనూ,  'నొప్పింపక ' 'తానొవ్వక ' అనే సూత్రంతో మెలిగేది.  ఎవరైనా తేడాగా మట్లాడుతున్నట్టు అనిపిస్తే వాళ్ళని దూరంగాపెట్టేసేది.  'డిప్లమసీ' మైంటైన్ చెయ్యమ్మా అని ఆమెకు అర్ధం అయ్యే భాషలో చెప్పినా, 'ముఖస్థుతి ' కోసం మాట్లాడకపోతే వచ్చిన నష్టమేంటి అనేసేది.  అందువల్ల ఆమెకు చాలా కొద్దిమందే ఐనా 'చాలా' విలువైన స్నెహితులు లభించేరు.

మొదటగా నెమలికన్ను శేషగిరిరావు గారూ, వారి భార్య మణెమ్మ గారి గురించి చెప్పుకోవాలి.   శేషగిరిరావు గారు పెందుర్తిలొ ఆరైగా పనిచేసేవారు.  నాన్నగారి సహోద్యోగి.  వీరి గురించి నా కన్నా, మా అన్నయ్య, అక్కయ్యలు విజయ  హైమలకే బాగా తెలుసు.  నాకు ఊహ తెలిసేసరికి మేము వేరే ఊరు వెళ్ళిపోయేము.  కాని అమ్మ తరుచూ వారినీ వారి అభిమనాన్ని తలుచుకొనేది.  తరువాతి కాలంలో వీరి కుటుంబం  విశాఖపట్నంలో ఉండగా అమ్మా నాన్నగారూ వెళ్ళి కలిసేరు.  వాళ్ళు కూడా పెద్దక్క పెళ్ళికి వచ్చేరు.

ఇక సర్వేశ్వరరావుగారు వారి భార్య మంగతాయారమ్మగారు మా అమ్మా నాన్నగారి జీవితంలో చాలా ముఖ్యులు.  సర్వేశ్వరరావుగారు స్థానం నరసిమ్హరావుగారి శిష్యులు.  ఈ ఫ్యామిలీ,  కొట ఉరట్లలో మా నాన్నగారు పనిచేసేటప్పటి స్నేహితులు.  అప్పట్లో వారికి పిల్లలు లేరు.  మా అక్కయ్యల్నీ, అన్నయ్యనీ ఇంకా ఇరుగు పొరుగు పిల్లల్నీ పోగు చేసి, కథలూ, జనరల్ నాలెడ్జ్ విషయాలూ చెప్పేవారుట.  సర్వేశ్వర్రావు గారు అమ్మని 'అక్కయ్యగారూ' అని సంబోధించేవారు.  వీరికి ఉన్న నిష్కళంక మనస్తత్వం,  పిల్లల మీద ఉన్న కడు ప్రేమ వల్ల తరువాతి కాలంలో వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఒక మగపిల్లవాడు కలిగేరు.  వీరు తరువాత రాజమండ్రిలో స్థిరపడ్డారు.  ఇటీవలి కాలం వరకూ వారితో నాన్నగారికి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుండేవి.


తరువాత అమ్మకి ఎంతో ఇష్టమైన ఒక స్నేహితురాలి గురించి చెప్పాలి.  ఆమె తమిళులు.  పాడేరు కాఫీ బోర్డు ఆఫీసర్ గారి భార్య.  ఆవిడకి తెలుగు రాదు.   అమ్మకి తమిళం రాదు. ఇద్దరికీ ఇంగ్లిష్ రాదు.   వారిద్దర్నీ కలిపింది త్యాగరాజస్వామే.  ఆవిడకి కర్నాటక సంగీతం బాగా వచ్చు.  త్యాగరాజ కీర్తనలు,  ముత్తుస్వామి దీక్షితార్ కీర్తనలు చాలా శ్రావ్యంగా పాడేవారు. పేరంటాలూ మహిళా మండలి మీటింగుల్లో ఆఖరువరకూ వేచి ఉండి అమ్మకి నచ్చిన పాట అమ్మకోసం ప్రత్యేకంగా పాడి వెళ్ళేవారు.  ఒకసారి వాళ్ళింటికి బంధువులొచ్చే సందర్భం. ఆవిడేమో ఇంట్లోకి రాకూడదు. అప్పట్లో పట్టింపులు కదా.  ఇబ్బందిలో సాయం చేయకపోతే స్నేహం ఎందుకు.  అమ్మ నన్నూ, చిన్నక్క హైమనీ వాళ్ళింటికి పంపింది.  మేము, మరొక అమ్మాయితొ కలిసి బృందంగా వెళ్ళి వాళ్ళింట్లో ఫిల్టర్లో కాఫీ డికాషన్ తీసి, అన్నం వండి, కూర చేసి, టమాటా చారు చేసాం.  తమిళులు చారు ఎంత బాగా  చేస్తారో తెలుసుకున్నాం.  ఒక సారి చిన్న ఫంక్షన్ సందర్భంగా మా ఇంట్లో పాటల పోటీలు జరిగాయి. అమ్మ న్యాయ నిర్ణేత.    మొదటి బహుమతి ఈ తమిళ మామి గారిదే.  రెండవ బహుమతి ఒక క్రైస్తవ గీతానికి.  మూడవ బహుమతి ఒక పాత తెలుగు సినిమా మాటకి.  ఈ తమిళ అయ్యంగారి మహిళతో అమ్మ స్నేహం చాలా సున్నితంగా అందంగా ఉండేది.

అమ్మ స్నేహితుల బాధల్నీ, కష్టాల్నీ వాళ్ళ కోణంలో ఎలా అర్ధం చేసుకునేదో చెప్పడానికి రెండు ఉదాహరణలు చెప్తా.

మేము కొట ఉరట్లలో ఉండెటప్పుడు సీతారమయ్యగారని ఒక ఎక్సిక్యూటివ్ ఆఫిసర్ ఉండేవారు.  ఆయన సతీమని అందరితో స్నేహంగా ఉండేవారు, అందరూ తనతో అలా ఉండాలని అభిలషించేవారు.  ఒక రోజు ఆవిడ మా ఇంటికి వచ్చి కూర్చుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు.  ఏమైందండీ అని అమ్మ అరా తీస్తే చెప్పుకొచ్చేరావిడ.  ఒకావిడ పేరంటానికని పిలిచి, బొట్టు పెట్టకుండా, వాయనం ఇవ్వకుండా' దూరంగా పక్కన పెట్టి రెండూ తీసుకోమన్నారట.  అది ఆవిడ జాతిని ఎత్తి చూపించే ప్రయత్నం.  అది ఆవిడకి అవమానమనిపించి బాధతో బయటికి వచ్చేసి ఆ బాధని  దించుకొవాడానికి అమ్మ దగ్గరికి వచ్చారు.    అమ్మ అవిడని ఊరుకోమని చెప్పి 'భర్తల ఉద్యోగరీత్యా అందరం ఒకచోట బతుకుతూ, ఇలాంటి పనులేంటని ' అలాంటి వాళ్ళ మీద చిరాకు పడి, ఆవిడకి బొట్టు, తాంబూలం ఇచ్చి పంపింది.  అమ్మ మీద ఎంత నమ్మకం లేకపొతే ఆవిడ అలా అమ్మ దగ్గరికి వస్తుందని మేము పిల్లలందరం అమ్మ గురించి చాలా గొప్పగా ఫీల్ అయ్యాము.  తరువాత ఒక పిక్నిక్ లో అమ్మ మాలో ఒకరిని (ఎవరో గుర్తు లేదు) ఆవిడ పక్కన కూర్చోపెట్టి తన నిజాయితీని నిరూపించుకొంది.  
ఆఖరుగా మా అమ్మ స్నేహానికి ఇచ్చే విలువా, స్నేహితురాలి బాధని అర్ధం చేసుకునే మనసూ తెలియాలంటే, మా చెల్లి స్వాతి చెప్పిన ఒక సంఘటన గురించి చెప్పాలి. స్వాతి మాటల్లొనే చెప్తా.

' నేనొక సారి హైదరాబాదులో ఒక పెళ్ళికి
వెళ్ళినప్పుడు, అక్కడ అమ్మతో ఒకావిడ అదే పనిగా మట్లాడుతూ ఉంటే చూసాను.  అమ్మని మరొకళ్ళతో మట్లాడే అవకాశమే ఇవ్వడం లేదావిడ.  ఆ మనిషినీ ఆ అర్ధంలేని వాగుడినీ చూస్తే చిరాకేసింది.  అమ్మని పక్కకి పిలిచి చెప్పాను.  'అమ్మా, ఎవరావిడ అలా వాగుతోంది, వదిలేసి వచ్చేయి ' అని చిరాకు పడ్డాను.  'అయ్యో అలా అనకమ్మా, అది నా చిన్నప్పటి స్నేహితురాలు.  చిన్నప్పుడు చాలా చక్కగా ఉండేది, మాతో ఆడుకునేది.  పాపం దానికి చాలా చిన్నప్పుడే  పెళ్ళి చెసేసారు.  పాపం, దాని మొగుడు కొజ్జా వాడు.  అలాంటి మొగుడూ, పిల్లా పీచూ లేకపోతే  ఎవరైనా ఇలాగే అయిపోతారు.  ఏమి  జీవితం దానిది పాపం.  అందుకే పాత కబుర్లేవో చెప్తుంటే దానికి  కాస్త ఆనందం కలుగుతుందని వింటున్నా'.  స్నేహితురాలి  గురించి చెప్తుంటే అమ్మ ముఖంలో ఏదో బాధ.  నాకింక మాట రాలెదు.  నాక్కూడా బాధనిపించి అక్కడ్నించి వెళ్ళిపోయాను '.  తరువాత ఎదో సందర్భంలో స్వాతి నాకు ఈ విషయం చెప్పింది.  అమ్మ ఆడవాళ్ళ విషయంలో ఎంతో మానవత్వంతోనూ, స్నేహితురాలి విషయంలో ఎంతో ఆర్తితోనూ స్పందించినతీరు చాలు, అమ్మ స్నేహానికి ఎంత విలువనిచ్చేదో  తెలియడానికి.

అలా, నాన్నగారి ఉద్యోగరీత్యా ఊళ్ళన్నీ తిరుగుతుండడంచేత, మా అమ్మ స్నేహాలు కులం, మతం, భాషలకి అతీతంగా ఉండేవి.
 ఈ పోస్టు పబ్లిష్ అయిన తరువాత మా చిన్నక్క చెప్పిన కొన్ని విషయాలు ఇక్కడ పొందు పరుస్తున్నా.  మేము కశింకోటలో ఉండేటప్పుడు మా నాన్నగారికి చాలా చికాకు చేసింది.  ఆయన రెండు నెలలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచం పట్టేసారు.  ఆయనకున్న స్మోకింగ్ అలవాటువల్ల లంగ్స్ బాగా ఇన్ ఫెక్ట్ అయి, ఎకంగా రెండు నెలలు ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లోనే మంచం పట్టేసారు. ఆయనకేమవుతుందోనని అమ్మ చాలా బెంగ పెట్టుకుంది.  ఆ రోజుల్లో అంత చిన్న ఊరిలో ప్రెత్యేక శ్రద్ధ చూపించే డాక్టరు ఎక్కడ దొరుకుతారు.  అప్పుడు అమ్మకి తోడుగా నిలిచింది స్నేహితులే.  మా ఇంటి వెనక కాశీభట్ల వారి కోడలు రత్నం గారు అమ్మకి మంచి స్నేహితురాలు.  ఆవిడ మరిదిగారు ఆ ఊర్లో మంచి పేరున్న డాక్టరు గారు.  ఆయన్ని చంటి డాక్టరు గారని పిలిచేవారు.  రత్నం గారి చలువ వల్ల ఆ చంటి డాక్టరు గారు ప్రతిరోజూ ఇంటికే వచ్చి నాన్నగారి పరీక్షించి, మందులు ఇచ్చి చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి జబ్బు తగ్గేటట్టు చేసారు.  నిజానికి మా నాన్నగారిని మాకు ప్రాణాలతో దక్కించారు.  ఆ రెండు నెలలూ, మళ్ళీ నాన్నగారు అరోగ్యంగా లేచి తిరిగేవరకూ అమ్మ విపరీతంగా టెన్షన్
పడింది.   ఆయన్ని అలా దక్కించినందుకు అ రత్నం గారు, అ చంటి డాక్టరు వారి భార్య బేబీ గార్లని అమ్మ ఎంతో కృతజ్ఞతతో జీవితాంతం తలుచుకునేది.  వీళ్ళు అమ్మకి ఎంతో ముఖ్యులు అవడం వల్ల మా చిన్నక్క వాళ్ళ గురించి వివరంగా చెప్పడంతో ఈ విషయం నా పోస్టుకి జత చేసాను.    
         

5, నవంబర్ 2010, శుక్రవారం

అమ్మ - బొబ్బిలి - కృష్ణుడు - కృష్ణాష్టమి

      మా అమ్మ పేరు ముద్దు సీతాలక్ష్మి. పుట్టింది బొబ్బిలిలో.  శంకర జయంతి నాడు. బొబ్బిలిలో కొలువు తీరింది శ్రీ వేణుగోపాలస్వామి.  అమ్మకి,కృష్ణుడికి, బొబ్బిలికి ఉన్న అనుబంధం చెప్పనలవికాదు.  అమ్మ బాల్యం, వివాహం అన్నీ బొబ్బిలిలోనే.  ఎప్పుడైనా మేమెవరైనా బొబ్బిలి వెళితే, అక్కడ మా తాతగారు నివశించిన ఇల్లూ, తను చిన్నతనంలో ఆడుకున్న అరుగులూ చూపించేది.  ఇక గుళ్ళో వేణుగోపాలస్వామి దర్శనం సరే సరి.  
       అమ్మకి ఉన్న కృష్ణ భక్తి, ఆమె చేసే పూజలూ పునస్కారోల్లో కన్నా ఆమె మాటల్లోనే ఎక్కువగా కనిపించేది. అమ్మ  బొబ్బిలిలో గడిపిన అందమైన బాల్యంలో తరుచూ ఆఏణుగోపాలస్వామిని దర్శించుకోవడం వల్ల అమ్మకి కృష్ణుడంటె భక్తి భావం అనుకుంటా. ఆ భావనని భక్తి అనే కన్నా ప్రేమ అనడమే సరైనది.
అమ్మకి జాన్ హిగ్గిన్స్ పాడిన 'కృష్ణా నీ వేగ నే బారో ' అన్న కన్నడ పాటంటే ఎంత ఇష్టమో .  ఒక సారి ఆర్ కే నారాయణ్ రాసిన స్వామీ & ఫ్రెండ్స్ ' ఆధారిత'  టీవీ సిరీస్ లో ఒక చిన్న పాప ఈ పాట పాడింది.  అమ్మ అలా చూస్తూ ఉండి పోయింది.
       అమ్మ తనకు తరుచూ వచ్చే ఒక కల గురించి చెప్పేది.వేణుగోపాలస్వామి గుడిలోని కృష్ణుడు ఒక బుడి బుడి నడకల చిన్ని బాలుడిగా మారి పరుగెత్తుకుంటూ తన దగ్గరకు వచ్చాడని.  ఎంత అధ్భుతమైన కల. ఆంతర్భూతంగా కృష్ణుడంటె ఉన్న పుత్ర వాత్సల్యం వల్ల ఆమెకి అలాంటి కల వచ్చెదనుకుంటా.  కృష్ణుడి మీద అమ్మకి యశోదా దేవికి ఉన్నంత పేమ.బొబ్బిలి వేణుగొపలస్వామి గురించి మాతో తరుచూ మట్లాడేది.  తన చిన్నప్పుడు బొబ్బిలి రాణీగారు దర్శనానికి వచ్చేవారట.  ఒక్క మగపురుగు కూడ చుట్టుపక్కల లేకుండా చూసెవరట.  పిల్లల్ని మాత్రం అనుమతించేవారట. దర్శనంతరం   రాణీగారు పిల్లలందర్నీ చూసి ఒక్క నవ్వు నవ్వేవారట.  దాంతొ పిల్లలందరూ ఒకటే కిలకిల నవ్వులు.  ఆ రోజుల్లో భోగం (ప్రసాదాలు) చలా బాగా చెసేవారట. అమ్మ అవన్నీ తరుచూ గుర్తుకు తెచ్చుకునేది. అమ్మకి నేను పేపర్ పల్ప్ తొ చెసిన కృష్ణుడి బొమ్మని విజయవాడలో కొన్నాను. ఆ విగ్రహానికి రోజూ సాయంత్రం ఇంట్లొనే పూచిన పారిజాత పూల దండ గుచ్చి వేసెది.  అంత పెద్ద కృష్ణుడి బొమ్మ ముందు గదిలొ నవ్వుతూ నించుంటే అమ్మకి ఏ ఈతి బాధలూ గుర్తుకొచ్చేవి కావేమో.
  అమ్మ దేవుని మందిరంలో మోకాళ్ళ మీద చేతులానించి వంగిఉన్న కృష్ణుడి పటం ఒకటి ఉండేది.  పక్కనే వెన్నతొ సహా ఒలికిన చల్ల కుండ.  ముద్దొస్తున్న ఆ కృష్ణుడి ముఖం చూసి మా చిన్నమ్మాయి కీర్తి ఆ పటం కావాలంది.  అడిగిందే తడవు అమ్మ ఇచ్చేసింది.  మా కీర్తి వెంటనే ఆ పటాన్ని మా పూజా మందిరంలొ పెట్టేసింది.  అలా అమ్మ కృష్ణుడు మా ఇంట్లోకి కూడా వచ్చి చేరాడు.
       అమ్మకి కృష్ణుడన్నా, బొబ్బిలన్నా ఎంత ఇష్టమో తెలియాలంటె మరో ఉదాహరణ. అమ్మ చనిపోయినపుడు నాన్నగారు అమ్మని గుర్తు చేసుకుంటూ బొబ్బిలి గురించీ, వేణుగొపలస్వామి గురించీ మట్లాడేరు. వాళ్ళ పెళ్ళైన కొత్తలో నాన్నగారు బొబ్బిలి వెళ్ళినప్పుడు అమ్మ ఆయన్ని గుడికి తెసుకెళ్ళి తన చిన్నప్పుడు కూర్చున్న మండపాలు, అరుగులూ చూపించిందట.  వేణుగోపాలస్వామి దర్శనం చేసుకుని వచ్చి ఆ అరుగు మీద పడుక్కుంటే జీవితంలో ఇంకేదీ అక్ఖర్లేదు అనిపిస్తుందని చెప్పిందట. ఇది చాలు, అమ్మకీ బొబ్బిలికీ, ఆ వేణుగొపలస్వామికీ ఉన్న బాంధవ్యం తెలియాలంటే.
       నా పెద్ద కూతురు విద్యకి పది నెలలప్పుడు నా చెల్లెలు స్వాతి ఫొటోలు తీస్తుంటే అమ్మ ముచ్చటపడి గబగబా నాన్నగారి ఎర్ర పట్టువాణీతొ విద్యకి పంచెకట్టి, నెమలి విసనకర్రలోంచి నెమలి కన్నొకటి తీసి పింఛం పెట్టి, నడుం కట్టు కట్టి, మెడకీ,దండలకీ పూసల గొలుసులు వేసి కృష్ణుడి బొమ్మకి ఉన్న పిల్లనగ్రోవిని దాని చేతికిచ్చి ఫొటొ తీయించి ముచ్చట పడింది.
       కృష్ణుడంటే ఇంత ప్రేమ ఉన్న అమ్మ కృష్ణాష్టమి చెయకుండా ఉంటుందా.  నాకు ఊహ తెలిసినప్పటినుండీ అమ్మ కృష్ణాష్టమిని పండగలా జరిపేది.  కృష్ణుడికి ఇష్టమైన అటుకులూ, వెన్నా, పాలూ, పెరుగూ తప్పనిసరిగా నైవేద్యం  పెట్టెది.  ఉట్టి, ఉట్టిలో మట్టి కుండా అందులొ వెన్నతో అలంకరించి పక్కనే పెట్టేది.  ఒకసారి కృష్ణాష్టమికి మా పెద్దక్క కూతురు కిరణ్ మా ఇంట్లో ఉంది.  అమ్మమ్మ కృష్ణాష్టమి చెస్తుంటే సరదా పడి కృష్ణుడి పాదాలు వేసింది.  అదికూడా అమ్మే  చెప్పింది.  పిడికిలి బిగించి నానపెట్టిన నామం సుద్దలో అలవొకగా అద్ది నేలమీద ముద్రించి ఆ పైన చిన్న చిన్న చుక్కలు పెడితే సరి బుల్లిపాదం తయారైపోతుంది.
       అదీ అమ్మకీ, బొబ్బిలికీ, కృష్ణుడికీ, కృష్ణాష్టమికీ ఉన్న సంబంధ బాంధవ్యం.  అమ్మ ఆ కృష్ణుడి సాన్నిధ్యానికే చేరుకుని ఉంటుందనుకుంటె ఎంత ఊరటగా ఉందో.
       అమ్మ, 'కూతురిగా', 'సోదరిగా' 'అమ్మగా', 'భార్యగా', కోడలిగా, 'వదినగా' 'అత్తగారిగా' 'అమ్మమ్మగా' 'నాన్నమ్మగా' సంపూర్ణమైన బాధ్యతలు నిర్వర్తించింది. ఆ విషయాలన్నీ మరొకసారి మీ అందరితొ పంచుకుంటాను.