7, డిసెంబర్ 2010, మంగళవారం

అమ్మ - పెద్దక్క పెళ్ళి

ప్రతి స్త్రీ జీవితంలో పెళ్ళి ఒక ముఖ్యమైన ఘట్టం. ఒక్కసారిగా మోగే మేళ తాళాల మధ్య వరుడు , తన తలమీద   జీల కర్రా బెల్లం పెట్టినా, మెడలో తాళి కట్టినా, తన జీవితంలో జరుగుతున్న ఒక ముఖ్యమైన మార్పుని తెచ్చే ఆ సమయం ఏ అమ్మాయికైనా  ఉద్విగ్న భరితమే..


తరువాత, భర్తా, పిల్లలూ, వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా చేసే వంటలూ, వంటిల్లూ, బాధ్యతలూ, స్కూళ్ళూ కాలేజీలూ,సిలబస్ లూ పిల్లలు పెరిగే క్రమం లో వాళ్ళతో పడే చిరాకులూ, అదొక అయోమయ లోకం లో బతికేస్తుంటారు ఆడవాళ్ళు.

మళ్ళీ స్త్రీ నిజంగా సంతోషం పొందేది ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యి ఉద్యోగాలొచ్చినప్పుడో లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగినప్పుడో.   అలాగే, మా పెద్దక్క పెళ్ళి, మా అమ్మ జీవితంలో అతి ముఖ్యమైన, సంతోషకరమైన ఘట్టం. నలుగురు ఆడపిల్లల్లో పెద్ద పిల్ల పెళ్ళి అంటే ఎవరికైనా ఎంత ఆనందం. ఎంత ఉత్సాహం.  మా అక్క పెళ్ళి 1972 లో జరిగింది. వధువు పేరు ముద్దు విజయలక్ష్మి. వరుని పేరు పంతుల జోగారావు. ఇక చదవండి పెళ్ళి ముచ్చట్లు.

పెళ్ళి కొడుకు మా పార్వతత్తయ్య రెండో అబ్బాయి. వాళ్ళది పార్వతీపురం. ఆ రోజు నాకింకా బాగా గుర్తు. నాన్నగారు అక్క పెళ్ళికి ముహూర్తాలు పెట్టించుకు రావడానికి పార్వతీపురం వెళ్ళారు.

అమ్మకి కాలు నిలవటంలేదు. అప్పుడు మేము అనకాపల్లిలో ఉండేవాళ్ళం. ముందు రెండు గదులు, మధ్యలో వాకిలి. వెనకవేపు నట్టిల్లు, వంటిల్లు ఉండేవి. ఊరు వెళ్ళిన నాన్నగారు ఇంకా రాలేదని అమ్మ పెరట్లోకి వీధిలోకి అటూ ఇటూ తిరుగుతునే ఉంది. అప్పడు స్కూళ్ళకి వేసవి శలవులు. నేనూ, మా చెల్లి ఇంట్లోనే ఉన్నాము. అమ్మ వెనకాలే తిరగడం మొదలు పెట్టాము. ఇల్లుగల మామ్మగారు అమ్మ ఆదుర్దా గమనించి 'గాభరా పడకండి, వస్తారు, బహుశా బస్సు లేటై ఉంటుంది ' అంటూ మాట కలిపారు.

ఇంతలో నాన్నగారు వచ్చారు. అమ్మ పరుగున ముందు గదిలోకి వచ్చింది. ఇల్లు గల మామ్మ గారు వాళ్ళ గుమ్మం బయటకు వచ్చి ఓ చెవి ఇటు పడేసారు. నాన్నగారు మంచి నీళ్ళు తాగి ముహూర్తపు తేది చెప్పేరు. 1972 మే  27 వ తేది.
అక్క పెళ్ళి శుభ లేఖ ఇది:


 అమ్మ కాలెండెర్ తీసి ముహూర్తపు తేదిని పసుపుతో మార్క్ చేసి 'సరిగ్గా నెల ఉంది ' అంటూ మధ్య పోర్షన్ లో ఉన్న మామ్మగారింటికి వెళ్ళింది. వాళ్ళిద్దరూ చాలా సేపు చాలా విషయాలు మట్లాడుకున్నారు. నాకూ మాచెల్లికి ఏం అర్ధం కాలేదు. కాని,  ఇద్దరం పెళ్ళనగానే చాలా ఉత్సాహ పడ్డాము. ఎవరింట్లోనైనా పెళ్ళంటేనే చాలా సరదా మాకు. అలాంటిది ఇంట్లో అక్క పెళ్ళంటే ఇంకెంత సంబరం.?!

పెళ్ళి పనులు మొదలయ్యేయి. మరునాడు గురువు గారొచ్చి సామాన్ల లిస్టు, ఏ పనులు ఎప్పుడు చెయ్యాలో రాసిన కాగితం ఇచ్చేరు. అమ్మ దానికి పసుపు పెట్టి, కావిడి పెట్టిలో దాచింది. అప్పటి వరకూ పెళ్ళెలా చెయ్యాలో ఎవరికైనా ఎలా తెలుస్తుందో అని నాకు చాలా కంగారుగా ఉండేది. గురువు గారిచ్చిన వివరాలు చూసేకా కొంత అర్ధమయ్యింది. ఓహో ఈయన అన్నీ అమ్మకి చెప్తారన్నమాట అనుకున్నా.


పెళ్ళికి వెన్యు కావాలి కదా. అప్పట్లో కళ్యాణ మండపాలూ, క్యాటరింగులూ ఇంతలా లేవు. అనకాపల్లిలో కన్యకాపరమేశ్వరి కల్యాణమండపం ఒకటే ఉండేది. దానిని సంప్రదించడానికి నాన్నగారు వెళితే అది కమ్యూనిటీకి సంబంధించినందువల్ల చివరివరకూ ఖచ్చితంగా చెప్పలేమన్నారు. ఆఖరి క్షణంలో ఇబ్బంది ఎందుకని అ ప్రయత్నం
విరమించారు. మరెక్కడ చెయ్యాలి.?


అప్పుడు అమ్మ సలహా ఇచ్చింది. మా అమ్మకి చిట్టి పిన్నిగారని వేలు విడిచిన పిన్నిగారు ఒకరు ఉండేవారు. వాళ్ళు అనకాపల్లిలో మా పక్క వీధిలోనే ఉండేవారు. ఆవిడని మా అమ్మ చిట్టి పిన్నీ అని పిలిచి మట్లాడితే, ఆవిడ 'ఏమే చిట్టి పిల్లా' (మా అమ్మ ముద్దు పేరు) అని మట్లాడేవారు. ఆ చిట్టి పిన్నిగారి అబ్బాయి 'ఆకుండి కృష్ణా రావు ' గారు. టెలికాం డిపార్ట్ మెంట్లో పనిచేసేవారు. మా ఇళ్ళ మధ్య తరుచూ రాకపోకలు ఉండేవి. ఆయన అనకాపల్లిలో శారదా నదికి అవతల కొత్తగా తయారవుతున్న శారదా నగర్ లో ఒక కొత్త ఇల్లు కట్టారు. అది అప్పటికింకా నిర్మాణంలో ఉంది. ఆ ఇంటిని పెళ్ళికని అడుగుతానని అమ్మ అంది. నాన్నగారికి ఆ సలహా నచ్చింది. వెళ్ళి అడగమన్నారు. పెద్దక్కకి మాత్రం బెంగ పట్టుకుంది. ఆ ఇల్లు ముహూర్తం లోపల పూర్తవుతుందా, పూర్తవుతుందనుకున్నా, వాళ్ళు ఇస్తారో లేక గచ్చులు పాడవుతాయని ఇవ్వరో అంటూ బెంగెట్టుకుంది. 'చూద్దాం. ఈ రోజే అడుగుతాను. తప్పకుండా ఒప్పుకుంటారు. చిట్టి పిన్నీ, మా అమ్మా సొంత అక్కా చెల్లెళ్ళలా ఉండేవారుట. మా చిట్టి పిన్నే చెప్పింది. ' అంది అమ్మ. ఆ రోజు సాయంకాలం అమ్మ చిట్టి పిన్ని గారింటికి బయలుదేరింది. వెనకాలే నేనూ మా చెల్లి, మామూలే. ఆ కబురూ ఈ కబురూ చెప్తూ అమ్మ మనసులోని మాట బయట పెట్టింది. ఆవిడ వెంటనే 'అయ్యో ఎంతమాటే, తప్పకుండా వీలవుతుంది ' అంటూ వాళ్ళబ్బాయినీ కోడల్నీ పిలిచి విషయం చెప్పేరు. వెంటనే 'తప్పకుండా అక్కయ్యా' అంటూ కృష్ణా రావు గారు 'శుభమా అని కొత్త ఇంట్లో పెళ్ళి చేసుకుంటామంటే మాకేం అభ్యంతరం వదినగారూ' అంటూ ఆవిడా సంతోషంగా ఒప్పుకున్నారు.

అమ్మయ్య వేదిక కుదిరింది. మర్నాడే ఆ కొత్త ఇంటి ప్రదేశానికి వెళ్ళేము. అప్పటికి ఇల్లు చాలా వరకూ తయరయిపోయింది. కాని ఇంటిముందు ఎక్కడ పడితే అక్కడ ఇటుకలు, రాళ్ళు, ఎగుడు దిగుడుగా ఉంది. ఫెళ్ళికొచ్చిన వాళ్ళు ఎక్కడ కూర్చుంటారా అని బెంగ పట్టుకుంది నాకు. కానీ పది రోజుల తరవాత వెళ్ళి చుస్తే అక్కడి రూపే మారి పోయింది. అన్న మాట మీద నిలబడి ఆరు గదుల ఇల్లు  పూర్తి చేసి గృహప్రవేశం కూడా చెసేస్కొని మాకు ఇల్లు అప్పగించేరు ఆకుండి కృష్ణా రావుగారు.


అనకాపల్లి పక్కనే కశింకొటలో మా నాన్నగారు అంతకుముందు పనిచేసారు. ఇలా పెళ్ళని తెలిసి అక్కడి స్టాఫ్ ఉత్సాహంగా ముందుకొచ్చి పెళ్ళి ఇంటిముందు పెద్ద తాటాకుల పందిరి వేయించేరు. ఇంటి వెనక వంట పాక, పాకలో గాడీ పొయ్యి కూడా తయారయిపోయాయి. దూరంగా టెంపరరీ టాయిలెట్లు కట్టేరు. పందిరి కింద జాగా అంతా క్లియర్ చేసి ఇసుక, మట్టి వేసి సాపు చేసి దిమిస కొడుతున్నారు. ఆ ఏర్పాట్లు చూసి నా మనసు కుదుట పడింది. కానీ మా చెల్లి మాత్రం నిరాశ పడింది.

'అప్పుడే' కొత్తగా షామియానాలు వస్తున్న రోజులు. ఆ షామియానా కట్టి, వాటికి రంగు కాగితాల బుట్టలు కట్టాలని దాని కోరిక. అప్పటికి చాలా చిన్నది కదా. దాని కోరిక దానిది. తర్వాత ఈ విషయం చెప్తే 'ఛ, అలా అన్నానా? ఇప్పుడైతే మనం అలాంటి పందిట్లో పెళ్ళి చెయ్యగలమా' అంటుంది. నిజమే కదా.


పెళ్ళంటే అందరూ ముందుగా అలోచించేది బట్టలూ, నగలూ. మాది సామాన్య కుటుంబం కాబట్టి , అప్పటికే సిధ్ధంగా ఒక గొలుసు తప్ప అక్కకి పెద్దగా నగలు కొనాల్సిన పని లేకపోయింది. ఇక పట్టు చీరలు. అనకాపల్లి శ్రీధరాల  వారి షాపులో కొన్నారు. అక్క లెత గులాబి రంగు పట్టుచీర అమ్మ ఎరుపు రంగు పట్టుచీర ఎంచుకున్నారు. నాకు, చెల్లి కి DCM లో (ఢిల్లీ  కాటన్ మిల్ల్స్  అని అన్నయ్య విడమరిచి చెప్పేవాడు) చెరొక మూడు గౌన్లు కుట్టించేరు. ఆ మెటీరియల్, ఇంకా అ గౌన్లు సింపుల్ గా కుట్టిన విధానం మా సుబ్బలక్ష్మి పిన్నికి బాగా నచ్చి మెచ్చుకున్నారు.

ఇక ఇంట్లో మా అమ్మ పెళ్ళి పనులు మొదలు పెట్టేసింది. పెళ్ళిలో వడ్డనకీ, మగ పెళ్ళి వారికి 'తగవు ' లో ఇవ్వాల్సిన అప్పడాలూ, గుమ్మడి వడియాలు, పేల వడియాలు అన్ని అమ్మే ఇంట్లొ స్వయంగా చేసింది. ఆ పనులన్ని నాకిప్పటికీ గుర్తే. ఇక వంట వాళ్ళు. సుబ్బరావు గారనే వంటాయన కుదిరాడు. ఆయన అద్భుతంగా వంటలు చేసేరని ఇప్పటికీ అప్పట్లో పెళ్ళికి వచ్చిన వారంతా చెప్పు కుంటు ఉంటారు. అక్కని పెళ్ళి కూతుర్ని చేసిన నాడు ఇంట్లోనే అరిశలు చేసాడాయన. పెళ్ళికి ఒక రోజు ముందు ఆ కొత్త ఇంట్లో లడ్డు చెసారు. సున్ని ఉండలు మాత్రం అమ్మ ఇల్లుగల మామ్మగారు, నాయనమ్మ గారి సాయంతో ఇంట్లోనే స్వయంగా తయారు చేసింది. కొన్ని చేశాకా నెయ్యి చాలదనిపించి అన్నీ చిదిపేసి, మరింత నెయ్యి పోసి మళ్ళి చుట్టింది అమ్మ. క్వాలిటీలో కాంప్రమైజ్ ఉండేది కాదు. 

పెళ్ళి కొద్ది రోజులుందనగా కాబోయే మా బావగారు మా ఇంటికి వచ్చారు. మేము ఆయన్ని చూడ్డం అదే మొదటి సారి. మా పక్కింటి మూడో పోర్షన్లో అమ్మాయిలు 'పెళ్ళి కొడుకు తెల్లగా, పొడవుగా చాలా బాగున్నాడన్నారు '  .  మా బావే కదా అని మేము చలా గర్వంగా గొప్పగా ఫీల్ అయిపోయాము.  అక్కా, బావా ఊర్లో కాస్త దూరంగా ఉన్న వెంకటేశ్వరస్వామి కోవెలకి బయలుదేరారు. అమ్మ నన్నూ, మా చెల్లినీ వాళ్ళ వెనకాలే పంపింది. అలా వెళ్ళకూడదని అప్పట్లో మాకేం తెలుసు.


ఇక పెళ్ళి పిలుపులు. అమ్మా, నాన్నగారూ, నేను చెల్లీ రిక్షాలో వెళ్ళి పిలిచేము. చిక్కశం అనే మాటని చాలా మంది విని కూడా ఉండరు. మా అక్క పెళ్ళికి అమ్మ ఊళ్ళో వాళ్ళందరినీ చిక్కశం పంచి పెట్టి మరీ అందర్నీ పిలిచింది. చిక్కశం అంటే మరేం కాదు. పసుపు, కుంకుమ, నలుగుపిండి , కుంకుడుకాయలు , నూనె , ఒక స్వీటుతో సహా వాళ్ళకిచ్చి చక్కగా పెళ్ళికి తయారయి రమ్మని చెప్పడం.  ఇక పై ఊరి బంధువలకి అందరికీ తప్పనిసరిగా శుభలేఖతో పాటు ఒక ఉత్తరం కూడా తప్పనిసరిగా రసేరు.  ఇప్పుడు శుభలేఖ పోస్ట్ చేసి , ఫోన్లు చేసేస్తున్నాము.  ఆ రోజుల్లో ఫోన్లు లేవుగా.  అందుకని  ఒక్క శుభలేఖ మాత్రమే పంపిస్తే మొక్కుబడిగా పిలిచినట్టు ఫీల్ అయ్యేవారు.  పైగా అలా ఉత్తరం లేకపోతె అలకలూ కోపాలు తెచ్చుకొని గొడవలు పడిన సందర్భాలు కూడా ఉండేవి ఆ రోజుల్లో.  అందుకని ఆ విషయంలో అమ్మా నాన్నగారూ చాలా జాగ్రత్త తీసుకొని అందరికీ ఉత్తరాలు రాయడం జరిగింది.     

పెళ్ళి రోజు దగ్గర పడింది. ముందురోజు రాత్రే అమ్మా నాన్న గారూ కొత్త ఇంటికి బయలుదేరారు. నేను కూడా వెళ్ళా. పార్వతీపురం నుండి రావలసిన మగ పెళ్ళివారు బస్సు ట్రబుల్ ఇవ్వడంతో బాగా ఆలస్యంగా వచ్చారు. ఆ విషయం వాళ్ళు వచ్చి చెప్తే కానీ తెలీదుగా. ఈ లోపల అమ్మకి ఒకటే కంగారు. అవీ ఇవీ సర్దినవే సర్దుతూ ఇల్లంతా ఒకటే తిరగడం మొదలుపెట్టింది. నాకింక నిద్ర వచ్చి , మగ పెళ్ళి వారు రాగానే చూడాలనే కోరికని పక్కన పెట్టి నిద్ర పోయాను. వాళ్ళు ఏ అర్ధరాత్రికో వచ్చినట్టున్నారు.

తెల్లవారగానే చూసేసరికి ఇంటా, బయటా ఒకటే సందడి. అక్క పెళ్ళి రెండు రోజులు జరిగింది. పెళ్ళి జరిగిన ఇంటి పక్కనే రైల్వే ట్రాక్, ట్రాక్ దాటితే పక్కన చిన్న అందమైన కొండ, కొండమీద సత్యనారాయణస్వామి వారి గుడి, గుడి వరుకు పాములా మెలికలు తిరుగుతూ మెట్లు. పెళ్ళి కర్యక్రమాలు పూర్తవగానే మగ పెళ్ళి వారిలోని ఉత్సాహవంతులంతా కొండ మీద గుడికి వెళ్ళేవారు. వాళ్ళందరికీ నేనే గైడ్. ఆ ఇంటికి దగ్గరలోనే చిన్న దిగుడుబావిలాంటిది ఉండేది. దాన్లో సయంకాలమయ్యేసరికి స్నానాలు. అందుకే పెళ్ళికి వచ్చినవారంతా ఇప్పటికీ 'అది పిక్నిక్కి వచ్చినట్టుండేదని ' అంటుంటారు.


'కాఫీలూ' 'టిఫినీలూ' లేకుండా పెళ్ళుండదుగా. సాధారణంగా పెళ్ళిళ్ళలో పల్చటి పంచదార పాకం లాంటి కాఫీలు పోసేవారు. కానీ, అమ్మ  ఏర్పాటు చేసిన కాఫీలే  వేరు. ప్రత్యెకించి చెప్పుకోవాల్సిన.  రుచితో తయారు  చేయించింది. అప్పుడు మా నాన్న గారు విసాఖ ఏజన్సీ ఏరియాలో పనిచేసేవారు. పాడేరు కాఫీ ఉత్పత్తికి ప్రసిధ్ధి. అక్కడినుంచి  కాఫీ గింజలు తెప్పించి అమ్మే స్వయంగా వేయించి అన్నయ్య చేత మర పట్టించి, ఆ కాఫీ పొడితో ఘుమ ఘుమలా డే  కాఫీ ఏర్పాట్లు చేసింది. ఈ మన్యం కా ఫీ ఉత్పత్తి ఇప్పుడు ప్రపంచంలోనే ఉత్తమ ప్రామాణికంగా నిలిచింది.  అలా అక్క పెళ్ళిలో కాఫీలు చలా ప్రత్యెకంగా నిలిచాయి. ఇక వంటాయన కూడా అమ్మ కోరిక ప్రకారం ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు వేడి వేడి కఫీలు విడిదికి పంపించేవాడు.

ఇక భోజనాల వడ్డన కిందనే. పంక్తి భోజనాలు. అది కూడా ప్రోటొకోల్ పాటించి మరీ కూర్చునేవారు. భోజనానికి ముందూ, తరువాతా సాహిత్యాభిమానులూ సరదా వ్యక్తులూ చక్కటి పద్యాలు పాడి ఆనందించేరు. పంక్తిలో అందరి భోజనం పూర్తయ్యెవరకూ లేచేవారు కాదు.

ఈ కాలపు పెళ్ళిల్లలో లాగా ప్లేట్లు పట్టుకుని ఖైదీల్లాగా క్యూలో నుంచొని పదార్ధాలు అడుక్కుని వడ్డించికుని హాలు ఇరుకైతే వాళ్ళ మోచెయి, వీళ్ళ మోచెయి తగిలి ఇబ్బంది పడుతూ భోజనం అయ్యిందనిపించే ప్రసక్తే లేదు అప్పట్లో.

ఆ రోజుల్లో శనివారం టిఫిన్ అంటే ఉప్పు పిండే. కాని నాన్నగారు పూరీ కూరా చేయించి , లడ్డూ పెట్టించేరు. గుప్తాస్ వారి కూల్ డ్రింక్స్ ముహూర్త సమయంలో అందరికి పంచేరు. ఆ కంపనీ మానేజర్ గారు అమ్మకి దగ్గర బంధువు. ఐస్ లో పెట్టి మరీ ముహూర్త సమయానికి అందించేరు.  ఆ డ్రింకులు ఆరెంజ్ ఫ్లేవరుతో పిల్లలందరికీ తెగ నచ్చేసాయి.

ఇక పెళ్ళి ఘనంగా జరిగింది. ఫక్కకు జరగండి , అడ్డంగా ఉన్నరు అంటూ వీడియొ వాళ్ళ గోల లేదు. మా పెద్దక్క తరవాత రచయిత్రిగా మారి  'అప్పగింతలు ' అనే కధ రాసింది. అందులో ఒక పెళ్ళిలో అప్పగింతలు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అమ్మాయిని అందరికీ అప్పగిం చేయడం, తల్లి, పెళ్ళికుతురు ఏడవడం అన్ని పూర్తయ్యాక ఆ తంతు వీడియొ తీయలేదని తెలుసి వీడియొ కోసం మళ్ళీ ఆ కార్యక్రమం  పూర్తి చేస్తారు, నటించిన ఏడుపులతో సహా. ఎంత రసాభాస. ఇలా కధలోలాగా వీడియో వాళ్ళకోసం చేసే ఏక్షన్ రీప్లేలు లేవు. సాహిత్య కారుడు  కూడా పెళ్ళంటే ‘పందిళ్ళు , సందళ్ళు , తో రణాలు’ అని రాసాడు కానీ, పాపం వీడియోలు అని రాయలేదు. ఇప్పట్లోలాగా ఏదో స్టేజ్ షో కొచ్చిన ఫీలింగ్ కూడా లేదు. చక్కగా చుట్టూ కూర్చొని పెళ్ళిని ఆసాంతం చూసి ఆనందించేరు. అందరూ పెళ్ళి ఏర్పాట్ల గురించి మెచ్చుకున్నారు. అది అమ్మ ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షించుకోవడం వల్ల సాధ్యమయ్యింది.


అమ్మకి పెద్దక్క పెళ్ళిగురించి అందరికిన్నా గొప్ప కితాబు మా మామయ్యగారినుండే లభించింది. మా అక్క పెళ్ళి తరువాత జరిగిన మరొక పెళ్ళిలో అందరూ కూర్చొని ఉండగా మామయ్యగారు బాసిం పట్టు వేసుకుని కూర్చొని 'మా చిట్టి పిల్ల చేసినట్టు ఎవరూ చేయలేరు పెళ్ళి ' అంటూ చేత్తో ఢంకా   బజాయించినట్టు మరీ చెప్పేరు. ఆయన గొంతు కొంచెం పెద్దది. ఆయన నలుగురిలోనూ అంత గట్టిగా చెప్పేసరికి అమ్మ ముఖం చేటంత అయ్యింది. 'అన్నయ్యా, అంతా మీ అభిమానం అంటూ ఆయన  పాదాల మీద చేతులు వేసింది.

ఈ పెళ్ళిలో  ఒక కొస మెరుపు కూడా ఉంది. మూడోరోజు ఉదయం మగపెళ్ళివాళ్ళు బయలుదేరవలసి ఉంది. అంతా తయరయి టిఫిన్లు కూడా తిని, సిధ్ధంగా ఉన్న మగ పెళ్ళి వారికోసం రావలసిన బస్సు రాలేదు. వాళ్ళు వచ్చినప్పటి సమస్యే మళ్ళీ వచ్చింది. బస్సు పదకొండు గంటలకు వస్తుందని తెలిసింది. పార్వతీపురం నాలుగైదు గంటల ప్రయాణం. ఆ సమయంలో వాళ్ళని అభోజనగా మంపించడం అమ్మకి ఇష్టం లేకపొయింది. మా కిండాం దొడ్డమ్మ, పెద్ద దొడ్డమ్మలతో సంప్రదించింది. 'అయ్యో అదెంతసేపే అంటూ' వాళ్ళిద్దరూ ముందుకు వచ్చి డెబ్భైమందికి అవలీలగా ఒక పప్పు, కూర చారులతో భోజనం రడీ చేసేసారు. సహృదయంతో విషయాన్ని అర్ధం చేసుకున్న మామయ్యగారు, బస్సు ఏర్పాటు సరిగా చెయ్యలేదని మగ పెళ్ళివారిలో ఎవర్నీ ఒక్కమాట కూడా అననివ్వకుండా కట్టడి చేసేరు. పైగా అక్క చెల్లెళ్ళ అవస్థ గమనించి ఆయనే స్వయంగా ముందుకు వచ్చి , ఉన్న పెరుగులో అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి నీళ్ళు పోసి చక్కటి మజ్జిగని తయారు చేసారు.

అప్పటికి మేము చిన్న వాళ్ళం. ఇంత చిన్న చిన్న వివరాలు కూడా మాకు ఇంతగా గుర్తు ఉన్నాయంటే అమ్మ తరుచు ఈ విషయాలన్నీ ఇష్టంగా గుర్తు చేసుకుంటూ మాకు చెప్తుండటమే కారణం.

ఈ మధ్య మా చిన్నక్క కొడుకు ఉపనయనం రోజున సుధ అనీ మా బావగారి అన్నయ్యగారి అమ్మాయి ఒక విషయం చెప్పింది. ఈ పెళ్ళికి ఆ అమ్మాయి చాలా చిన్నది. మా బావగారు తన పెళ్ళిలో సుధని 'ఇదెవరి పెళ్ళీ'  అని అడిగారట. 'ఇదేంటి ఇది తన పెళ్ళే కద్ద, చిన్నాన్న ఇలా అడుగుతారేంటి ' అనుకుంటూ 'ఇది మీ పెళ్ళే' అని చెప్పడానికి అప్పుడు చాలా సిగ్గు పడిపోయిందట. ఆ విషయం చెప్పి తెగ నవ్వింది.

పంతొమ్మిది ఏళ్ళకే అత్తవారి ఇంటికి వెళ్ళిన మా అక్క కూడా, అమ్మ పేరు నిలబెట్టేలా అత్త వారి ఇంట్లోనూ, పార్వతీపురం లోని అత్తవారి కుటుంబాలలోనూ మంచిపేరే తెచ్చుకుంది. అప్పటికే మా పార్వతత్తయ్య లేరు.  అత్త పెద్ద కొడుకు వివాహమయి ఉద్యోగరీత్యా హైదరాబదులో ఉండేవారు. ఇక పార్వతీపురంలో మామగారూ, భర్తా, ముగ్గురు మరుదులూ,  చిన్నదైనా అక్క అన్నీ ఓపిగ్గా నేర్చుకుని ఇంటి బాధ్యతలు చక్క పెట్టేది. అందులో మా మామయ్యగారి సహకారం కూడా ఉంది.  ఆయనే దగ్గరుండి ఇంటి పనులన్నీ నేర్పించేరు.  38 ఏళ్ళు గడిచాయి. ఇప్పుడు మా పెద్దక్క తన ఇద్దరు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి అమ్మమ్మకూడా అయ్యింది. ఐనా ఏదో ఒక సందర్భంలో ఈ పెళ్ళి గురించిన ఉదాహరణలు వస్తుంటాయి. మగ పెళ్ళి వారిలో ఒక అబ్బాయి పెళ్ళికి వచ్చిన వారిలో కొంతమంది వివరాలు ముందే తెలుసుకుని, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెయ్యి చూసి 'హస్త సాముద్రికం' తెలుసని చెప్పి ముందుగా తెలుసుకున్న వాళ్ళ వివరాలన్నీ  చెప్పడం,  ఆ వివరాలన్నీ ఎలా చెపుతున్నాడా అని వాళ్ళు ఆశ్చర్య పోతుంటే అందరూ నవ్వడం, పార్వతీపురం వారి హాస్యప్రియత్వం అన్నీ గుర్తొస్తుంటాయి.


ఇంటి ఆడ పిల్లల పెళ్ళిళ్ళకు సంబంధించిన ఉద్వేగం నేను అమ్మలో మళ్ళీ మా అన్న కూతురు చిన్ని పెళ్ళిలో చూశాను. అమ్మకి ఎనభై ఏళ్ళు వచ్చేసాయి. ఓపిక తగ్గిపొయింది. చిన్ని పెళ్ళి ముహూర్తం ఉదయం ఏడు గంటలకే. అమ్మ, నాన్నగారూ, నాలుగున్నరకే లేచి తయారయిపోయి మా వారి సాయంతో వెన్యుకి వచ్చి చిన్ని పెళ్ళిని ఆసాంతం ఆనందించేరు. ‘ జ్యో తులు’ పట్టుకునే సమయానికి అమ్మ ఉత్సాహంగా లేచి తనుకూడా పట్టుకుంది.  ఆ దీపాల వెలుగులో అమ్మ ముఖం కాంతితో నిండి పొయింది.

మా అన్నయ్య, వదిన వెనకాలే నిలబడి అన్నీ అందిస్తూ హడావిడిగా ఉన్న మా పెద్దక్కని చూసి అమ్మ కడుపు నిండి  పోయి నాతో ఈ మాట అంది, ‘జ్యోతీ, విజయ పెళ్ళిళ్ళు చెయడంలో పండిపోయింది కదూ’ అంటూ సరదా పడింది. తన వారసత్వం అంది పుచ్చుకున్నందుకు పొంగి పోయింది. చిన్నికి మంగళ సుత్ర ధారణ జరుగుతున్నప్పుడు అమ్మకి ఉద్వేగం ఆపుకోలెక కళ్ళనీళ్ళు వచ్చాయి. అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మా అమ్మ ఆశీస్సులు ఉంటే  మంచి జరగనిదెవరికి. మంగళధారణ పూర్తయ్యాక మా అక్క మా దగ్గరికి వచ్చింది. అక్క ముఖంలో కూడా అదే ఉద్వేగం. ‘ఇది మన పుట్టిల్లు. మనం ఈ ఇంట్లోంచే అత్త వారి ఇళ్ళకు వెళ్ళాము . ఈ ముద్దు వారి ఇంటినుండి మనం ఎలా  వెళ్ళేమో చిన్ని కూడా అలాగే వెళ్తోంది , మేనత్తలుగా చిన్ని పెళ్ళి సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత మనందరిదీ. అలాగే దాని పెళ్ళి సక్రమంగా జరిగింది’ అంటూ ఉద్వేగంతో మాట్లాడింది.


 అమ్మ ఇచ్చిన ఈ వారసత్వం ఇలా కొనసాగుతునే ఉంటుంది.

5, డిసెంబర్ 2010, ఆదివారం

అమ్మ - ఆర్టూ – జ్ఞానం - విజ్ఞానం

మా అమ్మది కళాత్మక హృదయం. కాలక్రమంలో ఆమెలోని ఆర్టూ, క్రియేటివిటీ మరుగునపడ్డా మా అమ్మ చనిపొయే వరకూ ఆమెలోని కళ తొంగి చూస్తూ ఉండేది.

మా చిన్నప్పుడు మాకు అందమైన స్వెట్టర్లు అల్లేది.  ఊలు దారాలు కానీ సిల్కు దారాలుకానీ ఉపయోగించి గుండ్రని లేసులు అందంగా అల్లేది. మా రమణ చిన్నన్నగారి పెద్ద కోడలు, విజయ ఎంతో ముచ్చటపడి అమ్మ అల్లుతున్న పధ్ధతి చూసి తెలుసుకుంది.  మేము నలుగురం అమ్మయిలం మా అమ్మకి ఉన్నాం కానీ మాకెవరికీ ఆ బుధ్ధి లేకపొయింది.  అమ్మ దగ్గర ఎప్పుడూ ఆ లేసులల్లే సూదులు ఉండేవి.  అవెక్కడున్నాయో మా హైమక్కని ఆదిగి తీసి దాచుకోవాలి.


మహిళా మండలి లో నేర్చుకున్న ఎంబ్రాయిడరీలన్నీ ఇంట్లో చేసేది.  నా చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ మ్యాటీ క్లాత్తో కుట్టిన డోర్ కర్టెన్ ఉండేది.  దానికి చుట్టూ ఆకు పచ్చని కాటన్ అంచు ఉందేది.  కర్టెన్ మధ్యలో పెద్ద పూలకుండీ డిజైన్, నాలుగు మూలలా పూల గుత్తులు ఉండేవి.  ఆ కర్టెన్ని మా అమ్మ ఎంత కష్టపడి కుట్టిందో.  అది ఎంత బాగుండేదో.  మేము ఏ ఊరు వెళ్ళినా ముందు గుమ్మానికి ఆ కర్టెన్ వేసే వాళ్ళం.  కనీసం ఒక 30 సంవత్సరాలు ఆ కర్టెన్ వాడేము.  చిరిగి పోయింది కాని దాని అందం మాత్రం పోలేదు.  


ఇక మా అమ్మ చాలా అందమైన బొంతలు కుట్టేది.  బొంతలు కుట్టడం ఒక పెద్ద ఆర్టా అనుకోవచ్చు.  కాని వాటిని అందంగా కూర్చి వాటిమీద ఇక్కత్ డిజైన్ వచ్చేటట్టు రంగు రంగు దారాలతో కుట్టడం మాత్రం ఆర్టే.  మా ఇళ్ళల్లోని పిల్లలందరూ అమ్మ బొంతల మీద పెరిగినవారే.  చంటి పిల్లలకైతే మరీ మెత్తని చీరలు ఎంచుకుని కుట్టేది. నేనొకసారి మా మామయ్య కూతురు పెళ్ళికి హైదరాబాదు వెళ్ళినప్పుడు ఆ పెళ్ళికి వచ్చిన బొంబాయి వాళ్ళందరికీ మా చిన్నమ్మయిని, మూడు నెలలది, పడుకొపెట్టిన బొంతని ఎంత మెచ్చుకున్నారో.  వాళ్ళంతా ఒకప్పుడు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళే.  'అరె ఇవి మనవేపు కుడతారర్రా'  అనుకుంటూ తెగ మెచ్చుకున్నారు.


మా అమ్మ మామూలు జనప గోనె సంచి మీద ఊలుతో మంచి మంచి డెజైన్లు వేసి, డోర్ మ్యాట్ గా వాడుకోమని ఇచ్చేది.  అవెంత బాగుండేవో.

ఇక శ్రావణమాసపు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మ తీర్చి దిద్దే అమ్మవారి రూపు గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసిందే. మైదా పిండిలో పసుపు కలిపి ముఖానికి ఆకృతిని ఇచ్చేది.  వరిపిండి, కాటుకతో కళ్ళూ, కుంకుమతో తిలకం దిద్దేది.  ఇంట్లో ఉన్న పాత రాళ్ళతో కర్నాభరణం, ముక్కెర అలంకరించేది.  మా అమ్మ,  అమ్మవారికి ఏ నగలూ పెట్టేది కాదు.  ఎలాంటి ఆడంబరమూ ఉండేది కాదు.  కాని అమ్మ చేసిన అమ్మవారు అందంగా వెలిగి పోతుండేది. చుట్టుపక్కల ఆడవాళ్ళు ప్రత్యేకించి వచ్చి అమ్మ చేసిన రూపుని చూసి వెళ్ళేవాళ్ళు..


మా అమ్మ పిల్లల్ని గుమ్మడి పండు మామిడి పండు అంటూ పోల్చి ముద్దులాడేది.  ఏ అమ్మమ్మైనా అంతే అనుకోండి.  మ చెల్లి కూతురు  చిట్టి  కాస్త తక్కువ బరువుతో పుట్టినా, పుట్టిన నెల రోజులకే తేరుకుని ఒళ్ళు చేసింది.  అమ్మా ఇదేం పండు అని అడిగా.  'దీని బుగ్గలు మర్రి పళ్ళర్రా' అంది.  నేను ఒక్కసారిగా చిట్టి బుగ్గలు చూసా.  అవి నిజంగా చిన్న ఎర్రని మర్రి పళ్ళలానే ఉన్నాయి.  అమ్మ పోలికకి నవ్వొచ్చింది.  ఒకసారి గోరేటి వెంకన్న గారు అన్నారు.  గ్రామీణులు చేసే పోలికలన్నీ ప్రకృతిలోని విషయాలతో ఉంటాయని.  మా అమ్మది కూడా గ్రామీణ నేపధ్యమే.

మా అమ్మ ఏమీ చదువుకోలేదు.  రెండో తరగతితో ఆపేసింది.   కానీ ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలించేది.  ఎలాంటి మూఢనమ్మకాలూ ఇసుమంతైనా లేని మా నాన్నగారి సాహచర్యంవల్ల మా అమ్మకు కూడా ఎలాంటి మూఢనమ్మకాలూ ఉండేవి కావు.  ఆఖరికి ఏ పనికైనా చూసే ముహూర్తాల విషయంలో కూడా 'మనకి ఏ పనైనా చెయ్యాలని సంకల్పం కలిగిని సమయమే మంచి ముహూర్తం అనుకోవాలని, సంకల్పం కలిగినప్పుడే పని మొదలైనట్టని అనేది.' ఈ మధ్య పెళ్ళిళ్ళలో జాతకాల పిచ్చి మరీ ఎక్కువైపోతోందని చిరాకు పడెది.  వాళ్ళ కాలంలో అన్నీ నచ్చితే జాతకాలు చూసేవారే కాదంట.  పిచ్చి ముదిరి రోకలి తలకు చుట్టమన్నట్టు చదువులు ఎక్కువైనకొద్దీ ఈ జాతకాల పిచ్చేంటని విసుక్కునేది.  శకునాలు చూడ్డం కానీ, కష్టాలు వచ్చినప్పుడు 'అన్నీ దేవుడే చూసుకుంటాడనీ కానీ మా ఆలోచనలెనెప్పుడూ కండిషనింగ్ చెయ్యాలని ప్రయత్నించలేదు.   విషయమంతా మనలోనే ఉంటుందనీ బయటి నుంచి ఏ ఫోర్సులూ పని చెయ్యవని తనకు కలిగిని సహజ జ్ఞానం వల్ల అమ్మ తనకు తెలియకుండానే మమ్మల్ని ' జిడ్డు కృస్ణమూర్తి ' ఆలోచనా పధ్ధతిలో పెంచింది.   ఇక టీవీలూ, బీరువాలు కొత్తవి కొన్నప్పుడు ప్రారంభించడానికి ముహూర్తాలు చుసేవాళ్ళతో,  ఆ వస్తువు ఇంటికి రావడమే సుముహూర్తమండీ, ఇంక వేరే ముహూర్తమెందుకని నవ్వేసేది.  పాండిత్యం  కన్నా జ్ఞానం ముఖ్యం' కదా.

మా అమ్మ నమ్మకాలకన్నా, సాంప్రదాయానికి ఎక్కువ విలువ నిచ్చేది.  ఈ మధ్య పెళ్ళిళ్ళలో చూసేరా, పెళ్ళికూతుర్ని కూర్చోబెట్టే గంపకి రంగు కాగితాలు చుట్టి , మెరుపులు అలంకరిస్తున్నారు.  ‘అమ్మాయిని గంపలో కుర్చో పెట్టి  అబ్బాయికి అప్పగించాలి కాని ఇదేంటి కాగితం డొక్కులాగా,  అది గంప అని తెలియటమే లేదు.  చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి పూలతో అలంకరించినా బాగుంటుంది అని సలహా ఇచ్చేది.

మా అమ్మ అభిరుచులుకూడా చాలా చక్కగా ఉండేవి.   కర్ణాటక సంగీతం చాలా ఇష్టంగా వినేది.  అందులోనూ అన్నిటికన్న మిన్నగా డీ కె పట్టమ్మాళ్ పాటలంటే మరీను. ఎమ్మెస్ సుబ్బలక్ష్మికి తరువాతి స్థానం. పుష్య బహుళ పంచమినాడు తిరువైయ్యారులో జరిగే అరాధనోత్సవాలప్పుడు పంచరత్నాలూ పూర్తయ్యేవరకూ ఇంతకు ముందు రేడియో తరువాత టీవీ ముందునుండు నాన్నగారితో సహా కూర్చుని విని, చూసి మనసుతీరా అనందించేది.  అమ్మకి అన్నిటికన్నా ఇష్టమైన పాట 'రఘువంశ సుధాంబుధీ. ఇక పెళ్ళిళ్ళలో సన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తనకిష్టమైన పాటల్ని వాళ్ళకి వస్తే అడిగి వాయించమని చెప్పేది.  తొట లాంఛనమప్పుడు 'గంధమూ పుయ్యరుగా', ఇంకా పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడు సమయానికి తగు మాటలాడెనే' పాటలుండాలనేది. ముహూర్తానికి ముందు ఎందరో మహానుభావులు తప్పని సరిగా ఉండాలనేది.

 మల్లీశ్వరి అమ్మకి చాలా ఇష్టమైన సినిమా. మా అమ్మ నలభైల్లో ఉండగానే సినిమాలు నచ్చక అసలు చూడ్డం మానేసింది.  నేను విజయవాడలో ఉండగా అమ్మ అక్కడికి వచ్చినప్పుడు పాత దీదార్ సినిమాకి తీసుకెళ్ళా.  చాలా అనందించింది.  మా కీర్తి ఒక సారి నాతో అంది.  'అమ్మా మా ఫ్రెండ్స్ గ్రాండ్ పేరెంట్స్ ఏం తోచక తెలుగు టీవీ సీరియల్స్ చూస్తారుట.  చక్కగా మన అమ్మమ్మా తాతగారే నయం.  అసలు టీవీ సీరియల్సే చూడరు ' వాళ్ళకవి నచ్చవు అంటూ అనాలసిస్ ఇచ్చి టీవీ సీరియల్స్  చూడని అమ్మమ్మా తాతగారూ వాళ్ళకు దొరికినందుకు చాలా అనందించింది.


టీవీ అంటే గుర్తుకొచ్చింది.  అమ్మ జ్ఞానానికి సంబంధించిన విషయం ఒకటి చెప్తా. ఒక సారి అందరం కూర్చొని టీవీలో క్విజ్ షో వస్తుంటే చూస్తున్నాము. అక్కడ మాతో పాటు , తమకు మంచి విషయ పరిజ్ఞానముందనీ, పురాణాల విషయంలో తమకు మంచి పరిజ్ఞానం ఉందనుకునే ఆడవాళ్ళు  కూడా కొంతమంధి ఉన్నారు.  క్విజ్ లో ఒక ప్రశ్న.  దేవవ్రతుడంటే ఎవరు అని.  అమ్మ వెంటనే భీష్ముడని చెప్పింది.  మిగిలిన వాళ్ళు అర్జునుడనీ, ధర్మరాజనీ చెప్పడం మొదలుపెట్టేరు.  అమ్మ సమాధానాన్ని వాళ్ళస్సలు పట్టించికోలేదు.  కానీ అమ్మ చెప్పిన సమాధానమే కరక్ట్ అయ్యింది.  నాకు చాలా సరదా వేసింది.  అందులో ఒకావిడ అంది ‘పిల్లల బొమ్మల భారతం’ చదివి కూడా ఇలాంటివి చెప్పెయ్యొచ్చని.


తరువాత అమ్మని అంత కరక్ట్ గా ఎలా చెప్పావని అడిగా.  పురిపండా అప్పలస్వామి వచన భారతం చదువుతున్నా, అందుకే చెప్పగలిగానంది.

నా చిన్నప్పుడు డాబా మీద పడుకునేవాళ్ళం.   లో దాహం వేసి అమ్మని లేపా.  అమ్మ ఇచ్చిన మంచి నీళ్ళు తాగి తల పైకెత్తి చూస్తే అమ్మ ఆకాశంలోకి చూస్తోంది.  'అమ్మా ఏం చూస్తున్నావు ' అన్నా.  'వృశ్చిక రాశి బాగా కిందకి దికిపొయింది ' ఇంకో గంటలో తెల్లవారి పోతుంది '  అంది.  అంతేకాదు పడుకునే ముందు సప్తరుషుల్నీ, సింహరాశినీ,  చూపించేది.   ఇవన్నీ ఏం చదువుకోని అమ్మకెలా తెలుసా అని ఆశ్చర్యమేసేది.